అది బాబు చేసిన ఖూనీ
అనంతపురం యువ రైతు ఆత్మహత్యపై జగన్
* రైతుల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటం
* ప్రజాకంటక సర్కారుకు పోయే రోజులు దగ్గర పడ్డారుు
* వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. అనంతపురంలో యువరైతు బ్యాంకులోనే ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో రైతుల పరిస్థితికి అద్దం పడుతోందన్నారు.
ఇది నూటికి నూరుశాతం చంద్రబాబు చేసిన ఖూనీయేనని మండిపడ్డారు. కాకినాడలో శుక్రవారం తనను కలిసిన విలేకరులతో జగన్ కొద్దిసేపు మాట్లాడారు. రైతులకు లక్షలోపు వడ్డీలేని రుణాలు ఇస్తామని చెబుతూ వచ్చిన చంద్రబాబు వారిని పచ్చిమోసం చేశారన్నారు. వడ్డీ మాఫీ కాకపోగా ఇప్పుడు 14 నుంచి 16 శాతం అపరాధ వడ్డీ కట్టాల్సిన పరిస్థితుల్లో రైతులు గత్యంతరం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురంలో యువరైతు తీసుకున్న రుణంపై వడ్డీ చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితికి చంద్రబాబు కారణం కాదా? అని ప్రశ్నించారు.
డ్వాక్రా రుణాలకు సంబంధించి పైసా కూడా మాఫీ చేయకుండా అక్కచెల్లెళ్ళను నిలువునా దగా చేశారని చెప్పారు. ప్రజాకంటక పాలన సాగిస్తున్న చంద్రబాబు సర్కార్‌కు పోయే రోజులు దగ్గరపడ్డాయని ధ్వజమెత్తారు. ఈ విషయాలన్నింటిపైనా అన్ని వర్గాల పక్షాన తమ పార్టీ నిరంతర పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
తప్పించుకోవడానికే తెర మీదకు సెక్షన్-8
పునర్విభజన చట్టంలోని ప్రతి అంశాన్నీ అమలు చేసి తీరాల్సిందేనని తమ పార్టీ తర ఫున అనేక పర్యాయాలు ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి నివేదించామని జగన్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎమ్మెల్యేలను కొనుగోలుచేసి తెలంగాణ లో ఎమ్మెల్సీని గెలిపించుకునేందుకు అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు దాని నుంచి తప్పించుకునేందుకే సెక్షన్-8ని తీసుకొచ్చారని విమర్శించారు.
జగన్ హెచ్చరికతో కదలిన ప్రభుత్వం
సాక్షి, విశాఖపట్నం: ధవళేశ్వరం ప్రమాద బాధితులకు నాలుగు రోజుల్లో పరిహారం ఇవ్వకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించడంతో సర్కారు దిగి వచ్చింది. మృతుల కుటుంబాలకు ప్రకటించిన రూ.2లక్షల పరిహారాన్ని శనివారం పంపిణీ చేయాలని నిర్ణయించింది.
పొగాకు రైతులతో నేడు జగన్ భేటీ
సాక్షి, ఏలూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి సందర్శించనున్నారు. అక్కడి పొగాకు వేలం కేంద్రంలో రైతులతో మాట్లాడతారు. ఈ రైతులు గిట్టుబాటు ధర లభించక నానాఅవస్థలు పడుతున్నారు. పాలకులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు జగన్ వెళ్తున్నారు.
వెన్ను తట్టి.. ధైర్యం చెప్పిన జగన్
* వాయుగుండం, వ్యాన్ ప్రమాద బాధితులకు ఓదార్పు
* బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా
సాక్షి ప్రతినిధి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో వాయుగుండం వేళ సముద్రంలో చిక్కుకుని మరణించిన మత్స్యకారుల కుటుంబాలను, పెళ్లి వ్యాన్ బోల్తా పడ్డ ప్రమాదంలో మత్యువాత పడ్డ వారి కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. వేట నిషేధ కాలం ముగిసిన వెంటనే అల్పపీడనం ఏర్పడినా ప్రభుత్వం ఎటువంటి హెచ్చరికలు చేయకపోవడంవల్లే మత్స్యకారులు వేటకు బలయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు.
దీనికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు పార్టీపరంగా అండగా నిలుస్తామని, ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం అందించేలా ఒత్తిడి చేస్తామని హామీ ఇచ్చారు ప్రతి మృతుని ఇంటికీ వెళ్లి కుటుంబసభ్యులను పలకరించి వారికి కొండంత ధైర్యాన్నిచ్చారు.శుక్రవారం కాకినాడ పర్లోపేటకు చెందిన మత్స్యకారుడు కంటుముర్చి వెంకటేశ్వర్‌రావు కుటుంబాన్ని పరామర్శిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి