unauthorised
-
అనధికారిక రుణ యాప్‌ల పని పట్టండి
న్యూఢిల్లీ: అనధికారిక రుణాల యాప్‌లను కట్టడి చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఆర్థిక స్థిరత్వానికి పొంచి ఉన్న రిస్కులను గుర్తించేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, క్రియాశీలకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. బుధవారం జరిగిన ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) 28వ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ మేరకు సూచనలు చేశారు. స్థూల ఆర్థిక స్థిరత్వం, సవాళ్లను ఎదుర్కొనడంలో భారత్ సన్నద్ధత, నియంత్రణ సంస్థల మధ్య సమస్యాత్మక అంశాలు మొదలైన వాటి గురించి ఈ సమావేశంలో చర్చించినట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. సమ్మిళిత వృద్ధి సాధనకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చేలా ఆర్థిక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు నియంత్రణ సంస్థల మధ్య సమన్వయాన్ని మరింత పటిష్టం చేయాలని ఎఫ్ఎస్డీసీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్, సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్, ఐఆర్డీఏఐ చైర్మన్ దేవాశీష్ పాండా, ఆర్థిక సాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
అలాంటి సంస్థలతో తస్మాత్ జాగ్రత్త: ఆర్బీఐ
న్యూఢిల్లీ: ప్రింట్ మీడియాతో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ‘రుణమాఫీ’ ఆఫర్లకు సంబంధించిన తప్పుదోవ పట్టించే ప్రకటనల బారిన పడవద్దని రిజర్వ్ బ్యాంక్ ప్రజలను హెచ్చరించింది. రుణమాఫీని ఆఫర్ చేస్తూ రుణగ్రహీతలను ప్రలోభపెట్టే కొన్ని తప్పుదోవ పట్టించే ప్రకటనలను గమనించినట్లు బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఒక ప్రకటనలో తెలిపింది. కొన్ని సంస్థలు, ప్రింట్ మీడియాతో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఇలాంటి పలు ప్రచారాలు చురుకుగా చేస్తున్నట్లు కనిపిస్తోందని పేర్కొంది. అటువంటి సంస్థలు ఎలాంటి అధికారం లేకుండా ‘రుణ మాఫీ సర్టిఫికెట్లు’ జారీ చేయడానికి సేవా/చట్టపరమైన రుసుమును వసూలు చేస్తున్నాయని కూడా వార్తలు వస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. కొంతమంది వ్యక్తులు రుణ గ్రహీతలను తప్పుదారిపట్టించే విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొంది. అలాంటి సంస్థలతో లావాదేవీలు జరిపితే ఆర్థిక నష్టాలు తప్పవని వినియోగదారులకు హెచ్చరించింది. ‘‘బ్యాంకులతోసహా ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని అటువంటి సంస్థలు లేదా వ్యక్తులు తప్పుగా సూచిస్తున్నారు. తద్వారా బ్యాంకింగ్ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. ఇటువంటి కార్యకలాపాలు ఆర్థిక సంస్థల స్థిరత్వాన్ని ముఖ్యంగా డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తాయి‘ అని ఆర్బీఐ ప్రకటన వివరించింది. ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మి నష్టపోవద్దని, ఈ తరహా తప్పుడు ప్రచారం తమ దృష్టికి వస్తే, విచారణా సంస్థల దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది. -
టెలికాం కంపెనీలపై ట్రాయ్ కన్నెర్ర! ఇష్టారీతిగా ఆఫర్లు ఇవ్వొద్దంటూ ఆదేశం!!
మొబైల్ ఫోన్ ఆపరేటర్లపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కన్నెర్ర చేసింది. తమకు తెలియకుండా కస్టమర్లకు ఎటువంటి ఆఫర్లు ఇవ్వొద్దంటూ తేల్చి చెప్పింది. తమ ఆదేశాలు హద్దు మీరితే చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయంటూ ట్రాయ్ వెల్లడించింది. ఫిర్యాదుల వెల్లువ ఇండియన్ మొబైల్ మార్కెట్లో తీవ్రమైన పోటీ నెలకొంది. కొత్త చందాదారులను ఆకట్టుకోవడానికి మొబైల్ కంపెనీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీని కోసం వినియోగదారులను ఆకట్టుకునేలా రకరకాల టారిఫ్‌లను ప్రకటిస్తున్నాయి. అయితే ఈ టారిఫ్‌లు ప్రకటించే ముందు ట్రాయ్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధన సరిగా అమలు కావడం లేదని, ట్రాయ్ అనుమతి తీసుకోకుండానే మొబైల్ ఆపరేటర్లు ప్రత్యేక టారిఫ్‌లు అమలు చేస్తున్నారంటూ ఒక సంస్థపై మరో సంస్థ తరచుగా ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. కారణం ఏంటీ మొబైల్ నంబర్ పోర్టబులిటీ (ఎంఎన్‌పీ) ద్వారా కస్టమర్లు తమ నంబర్ మారకుండానే ఆపరేటర్‌ను మార్చుకునే వీలుంది. అయితే ఎంఎన్‌పీ అమలు చేసే సమయంలో ప్రత్యర్థి కంపెనీకి చెందిన చందాదారున్ని ఆకట్టుకునేందుకు ట్రాయ్ దగ్గర అనుమతి తీసుకోని పలు రకాల ఆఫర్లు కస్టమర్లకు ప్రకటిస్తున్నాయి. ఇదే సందర్భంలో తమ దగ్గరి నుంచి కస్టమర్ బయటకు వెళ్లకుండా కూడా అనుమతి లేని ఆఫర్లను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇదంతా థర్డ్‌పార్టీల ద్వారా జరుగుతోంది. ఇంత కాలం ఈ వ్యవహారం జరుగుతూ వస్తోన్నా .. ఇటీవల మొబైల్ ఆపరేటర్లు ఈ అనధికారిక టారిఫ్‌లపై చర్యలు తీసుకోవాలంటూ ట్రాయ్‌ని ఆశ్రయించారు. తక్షణమే అమలు మొబైల్ సర్వీస్ ఆపరేటర్ల నుంచి వస్తున్న ఫిర్యాదులపై స్పందించిన ట్రాయ్ అనధికారిక టారిఫ్‌లను అమలు చేయోద్దంటూ ఆదేశించింది. ఈ టారిఫ్ అమలు చేయాలన్నా తమ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయంది. చదవండి : హైదరాబాద్‌కి వస్తున్న మరో అంతర్జాతీయ సంస్థ -
ఆస్తి పన్ను స్వీయ మదింపు అక్రమాలకు చెక్ ?
సాక్షి, హైదరాబాద్: అనధికార/అనుమతి లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్ల కోసం కొందరు అక్రమార్కులు ఆస్తి పన్నుల స్వీయ మదింపు (సెల్ఫ్ అసెస్మెంట్) ప్రక్రియను దుర్వినియోగపరుస్తుండడాన్ని రాష్ట్ర పురపాలక శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ అక్రమాలను అడ్డుకునే దిశగా చర్యలు చేపట్టింది. ఆస్తిపన్ను పేరు చెప్పి అక్రమ లేఅవుట్లు/ ప్లాట్లకు చెక్ పెట్టేందుకు కనీసం ఒకసారి రిజిస్టర్ అయిన ప్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అనుమతి లేని ప్లాట్లను కొందరు అక్రమార్కులు గృహాలు/భవనాలుగా పేర్కొంటూ, వాటికి ఆస్తి పన్నుల స్వీయ మదింపు నిర్వహిస్తున్నారు. తద్వారా వచ్చిన ఆస్తి పన్ను నంబర్ ఆధారంగా వాటికి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. దీనిపై పురపాలక శాఖకు ఫిర్యాదులు కూడా అందాయి. వాస్తవానికి ఆన్లైన్లో ఆస్తి పన్ను స్వీయ మదింపు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఆటోమెటిక్‌గా ప్రాపర్టీ ట్యాక్స్ నంబర్‌తో కూడిన ఆస్తి పన్ను డిమాండ్ నోటీసును ప్రింట్ చేసుకోవడానికి పురపాలక శాఖే అవకాశం కల్పించింది. అయితే ఈ డిమాండ్ నోటీసులోని ఆస్తి పన్ను నంబర్ ఆధారంగా అక్రమ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఫిర్యాదుల నేపథ్యంలో పురపాలక శాఖ గుర్తించింది. 15 రోజుల తర్వాతే ప్రింట్ అక్రమాలకు చెక్ పెట్టేలా ఇకపై ఆస్తి పన్నుల స్వీయ మదింపు పూర్తి చేసిన 15 రోజుల తర్వాతే డిమాండ్ నోటీస్ ప్రింట్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. ఆ 15 రోజుల్లోగా సంబంధిత పురపాలికల అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి వాస్తవ స్థితిని నిర్థారించుకోనున్నారు. అలా నిర్ధారించుకున్న తర్వాతే ఆస్తి పన్ను డిమాండ్ నోటీస్‌ను ప్రింట్ చేసుకునేలా అవకాశం కల్పించనున్నామని పురపాలకశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు మార్గదర్శకాలను త్వరలోనే అన్ని పురపాలికలకు జారీ చేయనున్నామని చెప్పారు. -
రైళ్లలో అనుమతిలేని వాటర్ బాటిల్స్
సాక్షి, న్యూఢిల్లీ: రైళ్లలో అనధికారికంగా వాటర్ బాటిళ్లను అమ్ముతున్న వారికి రైల్వే అధికారులు చెక్ చెప్పారు. భారతీయ రైల్వే ఒక స్పెషల్ ఆపరేషన్‌లో భాగంగా అక్రమంగా తాగు నీటిని అమ్ముతున్న వారిని అదుపులోకి తీసుకున్నామని ప్రభుత్వం గురువారం ప్రకటించింది. “ఆపరేషన్ థర్స్ట్’ అనే పేరుతో జూలై 8, 9 తేదీల్లో ఈ దాడులను నిర్వహిచామని వెల్లడించింది. రైళ్లలో, ప్లాట్‌పాంలలో అనుమతి లేకుండా తాగునీరు బాటిళ్లను విక్రయిస్తున్న 1371 మందిని అరెస్టు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. రైల్వే ప్లాట్‌ఫారమ్‌లపై అనధికారిక బ్రాండ్ల ప్యాకేజ్డ్ తాగునీటి బాటిల్‌ను విక్రయించే స్టాళ్లను గుర్తించినట్టు ప్రభుత్వం తెలిపింది. నిందితులనుంచి మొత్తం 69,294 బాటిళ్లను, 6లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. అలాగే నలుగురు ప్యాంట్రీ కార్ల నిర్వాహకులను కూడా అరెస్టు చేశామనీ, సంబంధిత చర్యలు కొనసాగుతాయని పేర్కొంది. రైల్వేలలో అనధికార పీడీడబ్ల్యు (ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్) ఆందోళనల నేపథ్యంలో, న్యూఢిల్లీలోని ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఈ డ్రైవ్ చేపట్టారు. ఇలాంటి అనధికార కార్యకలాపాలను అణిచివేసేందుకు చర్యలు తీసుకోవాలని జోనల్ ప్రిన్సిపాల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్లను (పీసీఎస్సీ) రైల్వేబోర్డు డీజీ ఆదేశించారు. దాదాపు అన్ని ప్రధాన స్టేషన్లలో ఈ తనిఖీలు చేపట్టినట్టు అధికారిక ప్రకటన తెలిపింది. -
జర్నలిస్టుపై దాడి, నోట్లో మూత్రం పోసి : వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్టులపై ఆగడాలకు సంబంధించిన మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ అధికారి ఓ పాత్రికేయుడిపై అమానుషంగా దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైలులో అనధికారిక వ్యాపారుల (హాకర్స్) పై కథనాన్ని ప్రచురించినందుకు గాను రైల్వే పోలీసు ఇన్స్పెక్టర్ రాకేష్ కుమార్ జర్నలిస్టు అమిత్‌శర్మపై దాడి చేసి తీవ్రంగా కొడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో రికార్డయ్యాయి. దీంతో పలు విమర్శలు వెల్లువెత్తాయి. తనను దారుణంగా కొట్టి, కెమెరాను ధ్వంసం చేశారని జర్నలిస్టు వాపోయారు. అంతేకాదు లాకప్‌లో వేసి బట్టూడదీసి, నోటిలో మూత్రం పోసారని ఆరోపించారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియో విరివిగా షేర్ అవుతూ వైరల్ కావడంతో రైల్వే అధికారులు స్పందించారు. ఈ ఘటనకు బాధ్యుడైన అధికారి రాకేష్‌కుమార్‌తోపాటు మరో రైల్వే కానిస్టేబుల్ సునీల్ కుమార్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. Journalist thrashed by GRP personnel in Shamli case: Rakesh Kumar, Station House Officer (SHO), Government Railway Police (GRP) & constable Sunil Kumar, have been suspended https://t.co/i8OO17FKyl — ANI UP (@ANINewsUP) June 12, 2019 -
నిలిచిన ఇసుక అక్రమ తవ్వకాలు
కొవ్వూరు : కొవ్వూరు పరిధిలోని చిడిపి, బల్లిపాడు, గూటాల ర్యాంపులతోపాటు పోలవరంలోని రెండు ఇసుక ర్యాంపులను శనివారం మూసివేశారు. ‘ఈ ర్యాంపుల మాటేమిటో!’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై స్పందించిన అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆ ర్యాంపుల్లో పనిచేస్తున్న యంత్రాలు, లారీలు ఒడ్డుకు చేరాయి. పోలీస్ ఉన్నతాధికారుల నుంచి అందిన మౌఖిక ఆదేశాల మేరకు ర్యాంపుల్ని మూసివేసినట్టు సమాచారం. ఆచంట మండలం కోడేరు ర్యాంపులో నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలను వినియోగించి తవ్వకాలు చేస్తున్న నేపథ్యంలో నరసాపురం సబ్ కలెక్టర్ దాడిచేసి 28 లారీలు, 6 పొక్లెయిన్లను స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. అధికార పార్టీ నేతల అండదండలతో పోలవరం, తాళ్లపూడి, కొవ్వూరు మండలాల్లో యంత్రాలను వినియోగిస్తూ అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్న వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా, నేతల్లో గుబులు రేగింది. మంత్రి కేఎస్ జవహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గంలో సాగుతున్న అక్రమ తంతుకు ‘సాక్షి’ కథనంతో బ్రేక్ పడింది. ర్యాంపులు మూసివేసిన వ్యవహారంపై పోలీస్, రెవెన్యూ అధికారులు నోరు మెదపడం లేదు. ఆ రెండు శాఖల అధికారులతో మాట్లాడగా.. ర్యాంపుల మూసివేత వ్యవహారం తమకేమీ తెలియదని సమాధానమిచ్చారు. -
టీడీపీ నేతల అండతోనే చెరువుల అక్రమ తవ్వకాలు
భీమవరం : జిల్లాలో సారవంతమైన భూములను విచ్చలవిడిగా రొయ్యల చెరువులుగా తవ్వటానికి టీడీపీ నాయకుల అండదండలే కారణమని వివిధ రాజకీయపార్టీల నేతలు, ప్రజాసంఘాల నాయకులు విమర్శించారు. అక్రమ చెరువుల వల్ల జిల్లా అంతా కాలుష్యకారకంగా మారుతున్నా మత్స్యశాఖాధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని దుయ్యబట్టారు. స్థానిక రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో అక్రమ చెరువుల తవ్వకాలపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ నాయకుడు జుత్తిగ నర్సింహమూర్తి మాట్లాడుతూ మూడు పంటలు పండే సారవంతమైన భూముల్లో చేపల చెరువుల పేరుతో అనుమతులు పొంది రొయ్యల సాగు చేస్తున్నా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. నిబంధనలను తుంగలోకి తొక్కి వేలాది ఎకరాల భూములు రొయ్యల చెరువుగా మార్చివేయడంతో జల, వాయు కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. లక్షల మందికి మంచినీటిని అందించే భీమవరం పైపుల చెరువుకు అతి సమీపంలో చెరువులు తవ్వుతున్నా స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు ఏం చేస్తున్నారంటూ నర్సింహమూర్తి ప్రశ్నించారు. అక్రమంగా తవ్వుతున్న చెరువుల యజమానులపై చర్యలు తీసుకోవాలని లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ మున్సిపల్ కౌన్సిలర్ భూసారపు సాయి సత్యనారాయణ, కాంగ్రెస్ భీమవరం మండలాధ్యక్షుడు బోకూరి విజయరాజు, సీపీఐ పట్టణ కార్యదర్శి మల్లుల సీతారాం ప్రసాద్, మల్లుల శ్రీను, సీపీఎం నాయకుడు, ఎం.వైకుంఠరావు, చేబోలు సత్యనారాయణ, మల్లేశ్వరరావు పాల్గొన్నారు. -
పుట్టగొడుగుల్లా కోచింగ్ సెంటర్లు
ఫంక్షన్ హాళ్లలో నిర్వహణ అనుమతుల్లేకుండా ఏర్పాటు కనీస సౌకర్యాలు కరువు ధనార్జనే ధ్యేయం సంగారెడ్డి మున్సిపాలిటీ: ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు రోజురోజుకూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నిరుద్యోగుల నుంచి కోచింగ్ కోసం వేలల్లో ఫీజులు గుంజుతూ అభ్యర్థులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. త్వరలోనే డీఎస్సీ, టెట్, పోలీసుశాఖలోని కానిస్టేబుల్, ఎక్సైజ్, ఫైర్, రె వెన్యూ. హౌసింగ్ తదితర శాఖల్లోని పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్లను జారీ చేస్తుందనే సంకేతాలు రావడంతో కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. చివరకు తమ కార్యాలయాలు ఒక దగ్గర ఉంటే అభ్యర్థులకు శిక్షణా తరగతులు మరో చోట నిర్వహిస్తున్నారు. దీనికి ఉదాహరణ అన్నట్టుగా బుధవారం పట్టణంలోని ఓ కోచింగ్ సెంటర్ యజమానులు తమ తరగతులను వీరభద్రనగర్ కాలనీలోని కేమింట్రీ భవనంలో నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోచింగ్ సెంటర్లు నిర్వహించాలంటే ముందుగా విద్యాశాఖ అనుమతి తీసుకోవాలని గత ఏడాది విద్యాశాఖ డెరైక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. శిక్షణ ఇచ్చే సంస్థలు తప్పని సరిగా విద్యాశాఖ కార్యాలయంలో పేర్లను నమోదు చేసుకోవాలనే నిబంధనలు విధించారు. కానీ సంగారెడ్డిలో ఉన్న ఏ ఒక్క కోచింగ్ సెంటర్ యజమానీ తమ సంస్థ పేరునే రిజిష్టర్ చేసుకోలేదు. అయినా అధికారులు అటు వైపు చూడడం లేదు. కనీస సౌకర్యాలు కరువు కనీస సౌకర్యాలు లేకుండా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తుండడంతో వాటిలో చేరిన యువకులు వారి అవసరాలు తీర్చుకునేందుకు బస్టాండ్లు, పబ్లిక్ టాయిలెట్లకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పోటీ పరీక్షలకు ఉన్నతస్థాయి శిక్షణ ఇస్తామంటూ నెలకు వేల కొద్ది ఫీజులు లాగుతున్నారు. ఇరుకు, చీకటి గదుల్లోనే తరగతులు కొనసాగిస్తున్నారు. అంతే కాకుండా మహిళా అభ్యర్థులకు శిక్షణ కేంద్రం వద్ద కనీసం భద్రతను సైతం ఏర్పాటు చేయడం లేదు. పట్టణంలోని ప్రధాన రహదారిపై ఉన్న ఒక ప్రధాన సంస్థకు చెందిన కోచింగ్ సెంటర్ దగ్గరకు ప్రతి రోజూ కొందరు తమను వేధించేందుకే వస్తున్నారని ఓ మహిళా అభ్యర్థిని ఆవేదన వ్యక్తం చేసింది. లక్షలు దండుకుంటున్న వైనం.. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతుందనే వార్తలు రావడంతో కోచింగ్ సెంటర్లు గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. అంతేకాకుండా అనుమతులు లేకపోయినా కోచింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. పట్టణంలోని ఓ కోచింగ్ సెంటర్లో 200 మందికి పైగా అభ్యర్థులు టెట్‌లో శిక్షణ పొందేందుకు చేరారు. ఒక్కొకరికి రూ. 6వేల చొప్పున రూ.12 లక్షలను ఫీజుల రూపంలో తీసుకున్న ఆ కోచింగ్ సెంటర్ అభ్యర్థులకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోయారు. అంతే కాకుండా సెంటర్ల వద్ద శిక్షణ ఇవ్వకుండా ఫంక్షన్హాల్లో ఇవ్వడం వల్ల మహిళ అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఫ్యాకల్టీలకే శిక్షణ... కాగా ఫంక్షన్ హాల్లో ఓ సెంటర్ కోచింగ్ ఇస్తున్న విషయమై ప్రశ్నించగా తాము అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం లేదని, ఫ్యాకల్టీలకు ఎలా శిక్షణ ఇవ్వాలో తెలియజేయడం కోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకుడు తెలిపారు.