సాక్షి, న్యూఢిల్లీ: రైళ్లలో అనధికారికంగా వాటర్ బాటిళ్లను అమ్ముతున్న వారికి రైల్వే అధికారులు చెక్ చెప్పారు. భారతీయ రైల్వే ఒక స్పెషల్ ఆపరేషన్‌లో భాగంగా అక్రమంగా తాగు నీటిని అమ్ముతున్న వారిని అదుపులోకి తీసుకున్నామని ప్రభుత్వం గురువారం ప్రకటించింది. “ఆపరేషన్ థర్స్ట్’ అనే పేరుతో జూలై 8, 9 తేదీల్లో ఈ దాడులను నిర్వహిచామని వెల్లడించింది.
రైళ్లలో, ప్లాట్‌పాంలలో అనుమతి లేకుండా తాగునీరు బాటిళ్లను విక్రయిస్తున్న 1371 మందిని అరెస్టు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. రైల్వే ప్లాట్‌ఫారమ్‌లపై అనధికారిక బ్రాండ్ల ప్యాకేజ్డ్ తాగునీటి బాటిల్‌ను విక్రయించే స్టాళ్లను గుర్తించినట్టు ప్రభుత్వం తెలిపింది. నిందితులనుంచి మొత్తం 69,294 బాటిళ్లను, 6లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. అలాగే నలుగురు ప్యాంట్రీ కార్ల నిర్వాహకులను కూడా అరెస్టు చేశామనీ, సంబంధిత చర‍్యలు కొనసాగుతాయని పేర్కొంది.
రైల్వేలలో అనధికార పీడీడబ్ల్యు (ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్) ఆందోళనల నేపథ్యంలో, న్యూఢిల్లీలోని ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఈ డ్రైవ్ చేపట్టారు. ఇలాంటి అనధికార కార్యకలాపాలను అణిచివేసేందుకు చర్యలు తీసుకోవాలని జోనల్ ప్రిన్సిపాల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్లను (పీసీఎస్‌సీ) రైల్వేబోర్డు డీజీ ఆదేశించారు. దాదాపు అన్ని ప్రధాన స్టేషన్లలో ఈ తనిఖీలు చేపట్టినట్టు అధికారిక ప్రకటన తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment