మొబైల్ ఫోన్ ఆపరేటర్లపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కన్నెర్ర చేసింది. తమకు తెలియకుండా కస్టమర్లకు ఎటువంటి ఆఫర్లు ఇవ్వొద్దంటూ తేల్చి చెప్పింది. తమ ఆదేశాలు హద్దు మీరితే చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయంటూ ట్రాయ్ వెల్లడించింది.
ఫిర్యాదుల వెల్లువ
ఇండియన్ మొబైల్ మార్కెట్‌లో తీవ్రమైన పోటీ నెలకొంది. కొత్త చందాదారులను ఆకట్టుకోవడానికి మొబైల్ కంపెనీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీని కోసం వినియోగదారులను ఆకట్టుకునేలా రకరకాల టారిఫ్‌లను ప్రకటిస్తున్నాయి. అయితే ఈ టారిఫ్‌లు ప్రకటించే ముందు ట్రాయ్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధన సరిగా అమలు కావడం లేదని, ట్రాయ్ అనుమతి తీసుకోకుండానే మొబైల్ ఆపరేటర్లు ప్రత్యేక టారిఫ్‌లు అమలు చేస్తున్నారంటూ ఒక సంస్థపై మరో సంస్థ తరచుగా ఫిర్యాదులు చేసుకుంటున్నాయి.
కారణం ఏంటీ
మొబైల్ నంబర్ పోర్టబులిటీ (ఎంఎన్‌పీ) ద్వారా కస్టమర్లు తమ నంబర్ మారకుండానే ఆపరేటర్‌ను మార్చుకునే వీలుంది. అయితే ఎంఎన్‌పీ అమలు చేసే సమయంలో ప్రత్యర్థి కంపెనీకి చెందిన చందాదారున్ని ఆకట్టుకునేందుకు ట్రాయ్ దగ్గర అనుమతి తీసుకోని పలు రకాల ఆఫర్లు కస్టమర్లకు ప్రకటిస్తున్నాయి. ఇదే సందర్భంలో తమ దగ్గరి నుంచి కస్టమర్ బయటకు వెళ్లకుండా కూడా అనుమతి లేని ఆఫర్లను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇదంతా థర్డ్‌పార్టీల ద్వారా జరుగుతోంది. ఇంత కాలం ఈ వ్యవహారం జరుగుతూ వస్తోన్నా .. ఇటీవల మొబైల్ ఆపరేటర్లు ఈ అనధికారిక టారిఫ్‌లపై చర్యలు తీసుకోవాలంటూ ట్రాయ్‌ని ఆశ్రయించారు.
తక్షణమే అమలు
మొబైల్ సర్వీస్ ఆపరేటర్ల నుంచి వస్తున్న ఫిర్యాదులపై స్పందించిన ట్రాయ్ అనధికారిక టారిఫ్‌లను అమలు చేయోద్దంటూ ఆదేశించింది. ఈ టారిఫ్ అమలు చేయాలన్నా తమ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయంది.
Comments
Please login to add a commentAdd a comment