పుట్టగొడుగుల్లా కోచింగ్ సెంటర్లు
ఫంక్షన్ హాళ్లలో నిర్వహణ
అనుమతుల్లేకుండా ఏర్పాటు
కనీస సౌకర్యాలు కరువు ధనార్జనే ధ్యేయం
సంగారెడ్డి మున్సిపాలిటీ: ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు రోజురోజుకూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నిరుద్యోగుల నుంచి కోచింగ్ కోసం వేలల్లో ఫీజులు గుంజుతూ అభ్యర్థులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. త్వరలోనే డీఎస్సీ, టెట్, పోలీసుశాఖలోని కానిస్టేబుల్, ఎక్సైజ్, ఫైర్, రె వెన్యూ. హౌసింగ్ తదితర శాఖల్లోని పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్లను జారీ చేస్తుందనే సంకేతాలు రావడంతో కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.
చివరకు తమ కార్యాలయాలు ఒక దగ్గర ఉంటే అభ్యర్థులకు శిక్షణా తరగతులు మరో చోట నిర్వహిస్తున్నారు. దీనికి ఉదాహరణ అన్నట్టుగా బుధవారం పట్టణంలోని ఓ కోచింగ్ సెంటర్ యజమానులు తమ తరగతులను వీరభద్రనగర్ కాలనీలోని కేమింట్రీ భవనంలో నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోచింగ్ సెంటర్లు నిర్వహించాలంటే ముందుగా విద్యాశాఖ అనుమతి తీసుకోవాలని గత ఏడాది విద్యాశాఖ డెరైక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. శిక్షణ ఇచ్చే సంస్థలు తప్పని సరిగా విద్యాశాఖ కార్యాలయంలో పేర్లను నమోదు చేసుకోవాలనే నిబంధనలు విధించారు. కానీ సంగారెడ్డిలో ఉన్న ఏ ఒక్క కోచింగ్ సెంటర్ యజమానీ తమ సంస్థ పేరునే రిజిష్టర్ చేసుకోలేదు. అయినా అధికారులు అటు వైపు చూడడం లేదు.
కనీస సౌకర్యాలు కరువు
కనీస సౌకర్యాలు లేకుండా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తుండడంతో వాటిలో చేరిన యువకులు వారి అవసరాలు తీర్చుకునేందుకు బస్టాండ్లు, పబ్లిక్ టాయిలెట్లకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పోటీ పరీక్షలకు ఉన్నతస్థాయి శిక్షణ ఇస్తామంటూ నెలకు వేల కొద్ది ఫీజులు లాగుతున్నారు. ఇరుకు, చీకటి గదుల్లోనే తరగతులు కొనసాగిస్తున్నారు. అంతే కాకుండా మహిళా అభ్యర్థులకు శిక్షణ కేంద్రం వద్ద కనీసం భద్రతను సైతం ఏర్పాటు చేయడం లేదు. పట్టణంలోని ప్రధాన రహదారిపై ఉన్న ఒక ప్రధాన సంస్థకు చెందిన కోచింగ్ సెంటర్ దగ్గరకు ప్రతి రోజూ కొందరు తమను వేధించేందుకే వస్తున్నారని ఓ మహిళా అభ్యర్థిని ఆవేదన వ్యక్తం చేసింది.
లక్షలు దండుకుంటున్న వైనం..
త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతుందనే వార్తలు రావడంతో కోచింగ్ సెంటర్లు గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. అంతేకాకుండా అనుమతులు లేకపోయినా కోచింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. పట్టణంలోని ఓ కోచింగ్ సెంటర్‌లో 200 మందికి పైగా అభ్యర్థులు టెట్‌లో శిక్షణ పొందేందుకు చేరారు. ఒక్కొకరికి రూ. 6వేల చొప్పున రూ.12 లక్షలను ఫీజుల రూపంలో తీసుకున్న ఆ కోచింగ్ సెంటర్ అభ్యర్థులకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోయారు. అంతే కాకుండా సెంటర్ల వద్ద శిక్షణ ఇవ్వకుండా ఫంక్షన్‌హాల్‌లో ఇవ్వడం వల్ల మహిళ అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఫ్యాకల్టీలకే శిక్షణ...
కాగా ఫంక్షన్ హాల్‌లో ఓ సెంటర్ కోచింగ్ ఇస్తున్న విషయమై ప్రశ్నించగా తాము అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం లేదని, ఫ్యాకల్టీలకు ఎలా శిక్షణ ఇవ్వాలో తెలియజేయడం కోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకుడు తెలిపారు.