టీడీపీ నేతల అండతోనే చెరువుల అక్రమ తవ్వకాలు
Published Fri, Jun 2 2017 2:29 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
భీమవరం : జిల్లాలో సారవంతమైన భూములను విచ్చలవిడిగా రొయ్యల చెరువులుగా తవ్వటానికి టీడీపీ నాయకుల అండదండలే కారణమని వివిధ రాజకీయపార్టీల నేతలు, ప్రజాసంఘాల నాయకులు విమర్శించారు. అక్రమ చెరువుల వల్ల జిల్లా అంతా కాలుష్యకారకంగా మారుతున్నా మత్స్యశాఖాధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని దుయ్యబట్టారు. స్థానిక రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో అక్రమ చెరువుల తవ్వకాలపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ నాయకుడు జుత్తిగ నర్సింహమూర్తి మాట్లాడుతూ మూడు పంటలు పండే సారవంతమైన భూముల్లో చేపల చెరువుల పేరుతో అనుమతులు పొంది రొయ్యల సాగు చేస్తున్నా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. నిబంధనలను తుంగలోకి తొక్కి వేలాది ఎకరాల భూములు రొయ్యల చెరువుగా మార్చివేయడంతో జల, వాయు కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. లక్షల మందికి మంచినీటిని అందించే భీమవరం పైపుల చెరువుకు అతి సమీపంలో చెరువులు తవ్వుతున్నా స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు ఏం చేస్తున్నారంటూ నర్సింహమూర్తి ప్రశ్నించారు. అక్రమంగా తవ్వుతున్న చెరువుల యజమానులపై చర్యలు తీసుకోవాలని లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ మున్సిపల్ కౌన్సిలర్ భూసారపు సాయి సత్యనారాయణ, కాంగ్రెస్ భీమవరం మండలాధ్యక్షుడు బోకూరి విజయరాజు, సీపీఐ పట్టణ కార్యదర్శి మల్లుల సీతారాం ప్రసాద్, మల్లుల శ్రీను, సీపీఎం నాయకుడు, ఎం.వైకుంఠరావు, చేబోలు సత్యనారాయణ, మల్లేశ్వరరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement