నిలిచిన ఇసుక అక్రమ తవ్వకాలు
Published Sun, Jun 11 2017 12:51 AM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM
కొవ్వూరు : కొవ్వూరు పరిధిలోని చిడిపి, బల్లిపాడు, గూటాల ర్యాంపులతోపాటు పోలవరంలోని రెండు ఇసుక ర్యాంపులను శనివారం మూసివేశారు. ‘ఈ ర్యాంపుల మాటేమిటో!’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై స్పందించిన అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆ ర్యాంపుల్లో పనిచేస్తున్న యంత్రాలు, లారీలు ఒడ్డుకు చేరాయి. పోలీస్ ఉన్నతాధికారుల నుంచి అందిన మౌఖిక ఆదేశాల మేరకు ర్యాంపుల్ని మూసివేసినట్టు సమాచారం. ఆచంట మండలం కోడేరు ర్యాంపులో నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలను వినియోగించి తవ్వకాలు చేస్తున్న నేపథ్యంలో నరసాపురం సబ్ కలెక్టర్ దాడిచేసి 28 లారీలు, 6 పొక్లెయిన్లను స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. అధికార పార్టీ నేతల అండదండలతో పోలవరం, తాళ్లపూడి, కొవ్వూరు మండలాల్లో యంత్రాలను వినియోగిస్తూ అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్న వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా, నేతల్లో గుబులు రేగింది. మంత్రి కేఎస్ జవహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గంలో సాగుతున్న అక్రమ తంతుకు ‘సాక్షి’ కథనంతో బ్రేక్ పడింది. ర్యాంపులు మూసివేసిన వ్యవహారంపై పోలీస్, రెవెన్యూ అధికారులు నోరు మెదపడం లేదు. ఆ రెండు శాఖల అధికారులతో మాట్లాడగా.. ర్యాంపుల మూసివేత వ్యవహారం తమకేమీ తెలియదని సమాధానమిచ్చారు.
Advertisement