KOVVUR AREA
-
తెలుగు తమ్ముళ్ల తన్నులాట!
కొవ్వూరు: టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నిమిత్తం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం తెలుగు తమ్ముళ్ల తన్నులాటకు దారి తీసింది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో లిటరరీ క్లబ్ కళ్యాణ మండపం ఇందుకు వేదికయ్యింది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి సమక్షంలో ద్విసభ్య కమిటీ సభ్యులను వేదికపైకి ఆహ్వానించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కేఎస్ జవహర్‌ను వేదికపైకి ఆహ్వానించాలని కమిటీ సభ్యులకు బుచ్చయ్య చౌదరి సూచించారు. దీంతో ఆయన వ్యతిరేక వర్గీయులు జవహర్ గోబ్యాక్ అంటూ నినాదాలు ప్రారంభించారు. అదే సమయంలో జవహర్ వర్గీయులు గొంతెత్తారు. అరుపులతో సమావేశం రసాభాసగా మారింది. ఇరు పక్షాల మద్ధతుదారులు వేదికను చుట్టుముట్టి పరస్పరం నెట్టుకున్నారు. దీంతో మైక్ బాక్సులు, సోఫా సెట్లు కిందపడి పోయాయి. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బుచ్చయ్య చౌదరి, ద్విసభ్య కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, ఇరుపక్షాలకు చెందిన ఇతర ముఖ్య నేతలతో రహస్యంగా గదిలో చర్చించారు. కాగా, ఇటీవల నిర్వహించిన అమరావతి పాదయాత్రలోనూ ఇరు పక్షాల మధ్య విభేదాలు వెలుగు చూశాయి. చర్చల అనంతరం బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ నాయకులంతా విభేదాలను పక్కన పెట్టి చంద్రబాబు యాత్రను విజయవంతం చేయాలని కోరారు. దీంతో జవహర్, ఆయన వర్గీయులు జిల్లా పార్టీ అధ్యక్షుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ బుచ్చయ్య చౌదరిని ప్రశ్నించారు. దళితులంటే చిన్నచూపా అంటూ ఆయన వర్గీయులు కేకలు వేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నందుకేనా వేదికపై పిలవలేదంటూ నిలదీశారు. జవహర్ వర్గీయులు ఆగ్రహంతో సభ ప్రాంగణం నుంచి నిష్క్రమించారు. ద్విసభ్య కమిటీ సభ్యుడు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరిని వెంట బెట్టుకుని జవహర్, ఆయన వర్గీయులు బుచ్చయ్య చౌదరి బయటికి వెళ్లిపోయారు. ప్రాంగణంలో బుచ్చయ్య చౌదరి కారుకు అడ్డంగా టీడీపీ కార్యకర్తలు బైఠాయించారు. బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ సమావేశంలో జరిగిన విషయాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. చంద్రబాబు దృష్టికీ తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. దీంతో పరిస్ధితి సద్దుమణిగింది. -
కారు డోర్ లాక్ అయి బాలుడు మృతి
సాక్షి, కొవ్వూరు రూరల్: కారులోకి వెళ్లి తలుపులు వేసుకున్న ఏడేళ్ల బాలుడు సాయిబాబా ఊపిరి ఆడక మృతిచెందిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరులో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన కళ్లేపల్లి రాధా కుమార్తె లక్ష్మికి దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన అనిశెట్టి శ్రీనివాసరావుతో వివాహం జరిపించారు. వారికి ఇద్దరు పిల్లలు. సాయిబాబా (7), రెండేళ్ల కుమార్తె వైసు ఉన్నారు. శ్రీనివాసరావు ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో లక్ష్మి ఇద్దరు పిల్లలతోపాటు దొమ్మేరులో తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. సోమవారం సాయిబాబా ఆడుకుంటూ అక్కడ పార్క్ చేసి ఉన్న కారులోకి ఎక్కాడు. డోర్ వేసుకోవడంతో లాక్‌పడింది. కొంతసేపటికి ఊపిరి ఆడక మృతిచెందాడు. సాయంత్రం కారు వద్దకు వచ్చి డోర్ తీసిన యజమాని లోపల బాలుడు మరణించి ఉండటాన్ని గుర్తించారు. చిన్నారి మరణంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. -
కొవ్వూరు టోల్‌ప్లాజా వద్ద ఉద్రిక్తత
సాక్షి, కొవ్వూరు : పశ్చిమగోదావరి కొవ్వూరు టోల్ గేట్ వద్ద బుధవారం సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కొవ్వూరు రోడ్లు అధ్వానంగా ఉన్నా టోల్ ఫీజులు వసూలు చేస్తుండటంపై కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో టోల్గేట్ వద్దకు చేరుకుని కాపు ఉద్యమనేత ముద్రగడకు మద్దతుగా నిలిచారు. గుంతలతో నిండిన రోడ్లపై ప్రయాణం చేయలేకపోతున్నామని వారు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి రోడ్డు నిర్వహణ లేకుండానే టోల్ వసూలు చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
నిలిచిన ఇసుక అక్రమ తవ్వకాలు
కొవ్వూరు : కొవ్వూరు పరిధిలోని చిడిపి, బల్లిపాడు, గూటాల ర్యాంపులతోపాటు పోలవరంలోని రెండు ఇసుక ర్యాంపులను శనివారం మూసివేశారు. ‘ఈ ర్యాంపుల మాటేమిటో!’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై స్పందించిన అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆ ర్యాంపుల్లో పనిచేస్తున్న యంత్రాలు, లారీలు ఒడ్డుకు చేరాయి. పోలీస్ ఉన్నతాధికారుల నుంచి అందిన మౌఖిక ఆదేశాల మేరకు ర్యాంపుల్ని మూసివేసినట్టు సమాచారం. ఆచంట మండలం కోడేరు ర్యాంపులో నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలను వినియోగించి తవ్వకాలు చేస్తున్న నేపథ్యంలో నరసాపురం సబ్ కలెక్టర్ దాడిచేసి 28 లారీలు, 6 పొక్లెయిన్లను స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. అధికార పార్టీ నేతల అండదండలతో పోలవరం, తాళ్లపూడి, కొవ్వూరు మండలాల్లో యంత్రాలను వినియోగిస్తూ అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్న వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా, నేతల్లో గుబులు రేగింది. మంత్రి కేఎస్ జవహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గంలో సాగుతున్న అక్రమ తంతుకు ‘సాక్షి’ కథనంతో బ్రేక్ పడింది. ర్యాంపులు మూసివేసిన వ్యవహారంపై పోలీస్, రెవెన్యూ అధికారులు నోరు మెదపడం లేదు. ఆ రెండు శాఖల అధికారులతో మాట్లాడగా.. ర్యాంపుల మూసివేత వ్యవహారం తమకేమీ తెలియదని సమాధానమిచ్చారు.