బుచ్చయ్య చౌదరి వాహనం ముందు బైటాయించిన టీడీపీ కార్యకర్తలు
కొవ్వూరు: టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నిమిత్తం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం తెలుగు తమ్ముళ్ల తన్నులాటకు దారి తీసింది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో లిటరరీ క్లబ్ కళ్యాణ మండపం ఇందుకు వేదికయ్యింది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి సమక్షంలో ద్విసభ్య కమిటీ సభ్యులను వేదికపైకి ఆహ్వానించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కేఎస్ జవహర్‌ను వేదికపైకి ఆహ్వానించాలని కమిటీ సభ్యులకు బుచ్చయ్య చౌదరి సూచించారు. దీంతో ఆయన వ్యతిరేక వర్గీయులు జవహర్ గోబ్యాక్ అంటూ నినాదాలు ప్రారంభించారు.
అదే సమయంలో జవహర్ వర్గీయులు గొంతెత్తారు. అరుపులతో సమావేశం రసాభాసగా మారింది. ఇరు పక్షాల మద్ధతుదారులు వేదికను చుట్టుముట్టి పరస్పరం నెట్టుకున్నారు. దీంతో మైక్ బాక్సులు, సోఫా సెట్లు కిందపడి పోయాయి. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బుచ్చయ్య చౌదరి, ద్విసభ్య కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, ఇరుపక్షాలకు చెందిన ఇతర ముఖ్య నేతలతో రహస్యంగా గదిలో చర్చించారు. కాగా, ఇటీవల నిర్వహించిన అమరావతి పాదయాత్రలోనూ ఇరు పక్షాల మధ్య విభేదాలు వెలుగు చూశాయి.
చర్చల అనంతరం బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ నాయకులంతా విభేదాలను పక్కన పెట్టి చంద్రబాబు యాత్రను విజయవంతం చేయాలని కోరారు. దీంతో జవహర్, ఆయన వర్గీయులు జిల్లా పార్టీ అధ్యక్షుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ బుచ్చయ్య చౌదరిని ప్రశ్నించారు. దళితులంటే చిన్నచూపా అంటూ ఆయన వర్గీయులు కేకలు వేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నందుకేనా వేదికపై పిలవలేదంటూ నిలదీశారు.
జవహర్ వర్గీయులు ఆగ్రహంతో సభ ప్రాంగణం నుంచి నిష్క్రమించారు. ద్విసభ్య కమిటీ సభ్యుడు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరిని వెంట బెట్టుకుని జవహర్, ఆయన వర్గీయులు బుచ్చయ్య చౌదరి బయటికి వెళ్లిపోయారు. ప్రాంగణంలో బుచ్చయ్య చౌదరి కారుకు అడ్డంగా టీడీపీ కార్యకర్తలు బైఠాయించారు. బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ సమావేశంలో జరిగిన విషయాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. చంద్రబాబు దృష్టికీ తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. దీంతో పరిస్ధితి సద్దుమణిగింది.
Comments
Please login to add a commentAdd a comment