పొదుపు సొమ్ము.. రుణార్పణం!
పొదుపు సొమ్ము.. రుణార్పణం!
Published Wed, Jun 25 2014 3:03 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
గార: డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామంటూ సర్కారు ఇప్పటికీ మహిళా సంఘాలను ఊరిస్తోంది. మరోవైపు దానిపై స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తోంది. బ్యాంకర్లు ఈ జాప్యాన్ని సహించలేకపోతున్నారు. స్వయంశక్తి సంఘాల పొదుపు ఖాతాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు మళ్లించి రుణ బకాయిల కింద జమ చేస్తున్నారు. సర్కారు నిర్వాకం మహిళా సంఘాలు, బ్యాంకర్ల మధ్య వివాదాలకు దారి తీస్తోంది. గార మండలం లో తొమ్మిది సంఘాల మొత్తాలు ఇలా మళ్లిపోగా.. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్న ట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ డ్వాక్రా రుణాల మాఫీ హామీని తెరపైకి తెచ్చింది.
రుణ బకాయిలు చెల్లించవద్దని మహిళా సంఘాలకు సూచించింది. దాంతో గత మార్చి నుంచి జిల్లాతోపాటు రాష్ట్రమంతా డ్వాక్రా రుణ వాయిదాల చెల్లింపులు నిలిచిపోయాయి. ఆ తర్వాత ఎన్నికలు జరిగిన టీడీపీ అధికారం చేపట్టింది. ఇటు బ్యాంకులు.. అటు మహిళా సంఘాలు రుణమాఫీపై స్పష్టత కోసం ప్రభుత్వం వైపు చూస్తున్నాయి. అయి తే రోజులు గడుస్తున్నా సర్కారు స్పష్టమైన నిర్ణయం ప్రకటించడం లేదు. రోజుకో రకమైన ప్రకటనతో కాలక్షేపం చేస్తోంది. సుమారు నాలుగు నెలలుగా రుణ బకాయిల వసూళ్లు నిలిచిపోవడంతో స్వయంశక్తి సంఘాల రుణ ఖాతాలు ఎన్‌పీఏ( నాన్ ఫెర్‌ఫార్మెన్స్ అసెట్స్)గా అంటే నిరర్ధక ఆస్తులుగా మారా యి. ఫలితంగా బ్యాంకులపై ఉన్నతాధికారుల నుం చి ఒత్తిళ్లు పెరిగాయి. వారి ఆదేశాల మేరకు డ్వాక్రా సంఘాల పొదుపు ఖాతాల నుంచి నిధులు మళ్లించి రుణ ఖాతాలకు జమ చేయడం మొదలు పెట్టారు.
సంఘాలకు చెప్పకుండానే..
ఈ ప్రక్రియను మహిళా సంఘాలకు చెప్పకుండనే చేపట్టడంతో వివాదం రేగుతోంది. దీనిపై సంఘాల సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ బ్యాంకు అధికారులను నిలదీస్తున్నారు. కళింగపట్నంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో తొమ్మిది సంఘాల రుణ ఖాతాలకు వారి పొదుపు ఖాతాల నుంచి కొంత మొత్తాలను కొద్ది రోజల క్రితం జమ చేశారు. ఈ విషయాన్ని భ్యాంకు సిబ్బంది ఆయా సంఘాలకు తెలియజేయలేదు. ఎప్పటిలాగే నెలవారీ సమావేశాలు నిర్వహించిన ఈ సంఘాల నిర్వాహకులు సభ్యుల నుంచి సేకరించిన పొదుపు మొత్తాలను బ్యాంకులో కట్టేందుకు వెళ్లినప్పుడు నిధులు మళ్లించిన విషయం తెలిసింది. దీంతో ఖంగుతిన్న నిర్వాహకులు మంగళవారం గ్రామ పెద్దలు, గ్రామైక్య సంఘాల దృష్టికి తీసుకె ళ్లారు. బ్యాంకు మేనేజర్ ఎన్‌వీ రామానందం, ఫీల్డ్ ఆఫీసర్ కె.ఆర్.ఎల్.రావులను నిలదీశారు.
తమ పొదుపు సొమ్ము మళ్లించడం అన్యాయమని.. ప్రభుత్వం ఒక పక్క రుణమాఫీ చేస్తామని ప్రకటిస్తుంటే.. బ్యాంకులు ఇలా చేయడమేమిటని ప్రశ్నించారు. ఇప్పటివరకు రుణాలు చెల్లించనివారికే మాఫీ వర్తింపజేస్తామని ప్రభుత్వం నిబంధన పెడితే తమ పరిస్థితి ఏమిటని, తాము అన్యాయమైపోమా? అని ప్రశ్నిస్తూ వినతిపత్రం సమర్పించారు. ఇక నుంచి పొదుపు సొమ్ము మళ్లించబోమని సర్పంచ్ పొట్నూరు కృష్ణమూర్తి, ఎంపీటీసీ గుంటు నాగమణి లక్ష్ముయ్యలకు బ్యాంకు అధికారులు హామీ ఇవ్వడంతో శాంతించారు.
Advertisement