
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రింట్ మీడియా ఆదాయం 35 శాతం వృద్ధి చెందుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేస్తోంది. కరోనా ముందస్తు కాలంతో పోలిస్తే 2021–22లో పరిశ్రమ ఆదాయం 75 శాతమే ఉంటుందని వెల్లడించింది. ‘2019–20లో ప్రింట్ మీడియా ఆదాయం రూ.31,000 కోట్లు. ఇందులో ప్రకటనల ద్వారా 70%, మిగిలినది చందాల (సబ్‌స్క్రిప్షన్స్) ద్వారా సమకూరింది. మహమ్మారి కారణంగా పరిశ్రమ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 40% పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.24,000–25,000 కోట్లకు చేరవచ్చు. వ్యయ నియంత్రణ చర్యలు, కంటెంట్ డిజిటలైజేషన్‌తో లాభదాయకత 9–10 శాతానికి పునరుద్ధరించడానికి దారితీస్తుంది. ఆరు నెలలుగా న్యూస్‌ప్రింట్ ధరలు 20–30% అధికమైనప్పటికీ లాభం పెరుగుతుంది’ అని క్రిసిల్ తన నివేదిక ద్వారా తెలిపింది.
ఆదాయాలు మెరుగుపడతాయి..
ఏప్రిల్–జూన్ కాలంలో ప్రకటన ఆదాయాలపై సెకండ్ వేవ్ ప్రభావం చూపింది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నందున ప్రస్తుత త్రైమాసికం నుండి ప్రకటన ఆదాయాలు మెరుగవుతాయి. ఆంగ్లేతర వార్తా పత్రికలు సెకండ్ వేవ్‌లో కూడా చందా ఆదాయాన్ని నిలబెట్టుకోగలిగాయి. బలమైన మూలాలు కలిగి ఉండడమే ఇందుకు కారణం. కోవిడ్–19 ముందస్తు కాలంతో పోలిస్తే 2021–22లో సబ్‌స్క్రిప్షన్స్ ఆదాయ నష్టం 12–15 శాతానికి పరిమితం అవుతుంది. పాశ్చాత్య దేశాల మాదిరిగా కాకుండా తక్కువ ధర, నమ్మదగిన కంటెంట్‌ను అందించగల సామర్థ్యం, వార్తా పత్రికలను చదివే ప్రజల అలవాటు వంటి అంశాల కారణంగా భారత్‌లో ప్రింట్ మీడియా ప్రాచుర్యం పొందిందని క్రిసిల్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment