దూసుకెళ్తున్న ప్రింట్ మీడియా
పదేళ్లలో 2.37 కోట్లు పెరిగిన ప్రతుల సంఖ్య: ఏబీసీ
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో ప్రింట్ మీడియా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతోందని ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్(ఏబీసీ) వెల్లడించింది. అక్షరాస్యత పెరగడం, పత్రికా పఠనం దైనందిన జీవితంలో ఓ భాగంగా మారడం, పత్రికలు, వాటి ధరలు అందుబాటులో ఉండడంతో ప్రింట్ మీడియాకు ఆదరణ పెరుగుతోందని పేర్కొంది. పదేళ్లలో పత్రికల ప్రతుల సంఖ్యలో ఏకంగా 2.37 కోట్ల పెరుగుదల నమోదైందని, వార్షిక వృద్ధిరేటు 4.87 శాతంగా ఉందని తెలిపింది.
2006లో ప్రతుల సంఖ్య రోజుకు 3.91 కోట్లు ఉండగా.. 2016 నాటికి అది 6.28 కోట్లకు చేరిందని సోమవారం ఒక ప్రకటనలో వివరించింది. అలాగే ప్రచురణ కేంద్రాల సంఖ్య 251 మేర పెరిగినట్లు తెలిపింది. 2006లో 659 ప్రచురణ కేంద్రాలు ఉండగా.. 2016 నాటికి 910కి చేరినట్టు పేర్కొంది.