tax holiday
-
వ్యాపారాలపై ధీమా తగ్గింది
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకి వ్యాపారాలపై కార్పొరేట్ల ధీమా సన్నగిల్లింది. 2008–09 నాటి అంతర్జాతీయ ఆర్థిక మాంద్య స్థాయికి పడిపోయింది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో దేశ ఎకానమీ పరిస్థితులు సాధ్యమైనంత త్వరగా సాధారణ స్థాయికి తిరిగొచ్చేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, వ్యాపారాలకు సహాయక ప్యాకేజీలు ఇవ్వాలని ఫిక్కీ పేర్కొంది. అలాగే కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ మరో 100 బేసిస్ పాయింట్లు (1 శాతం) తగ్గించాలని కోరింది. కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసే దిశగా లాక్డౌన్ అమలు చేస్తుండటంతో భారత్ సహా పలు దేశాల వృద్ధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వ్యాపారవర్గాలపై ఫిక్కీ సర్వే ప్రాధాన్యం సంతరించుకుంది. ‘వ్యాపార విశ్వాస సూచీ ప్రస్తుతం 42.9 పాయింట్లుగా ఉంది. గత సర్వేలో ఇది 59.0గా నమోదైంది‘ అని ఫిక్కీ పేర్కొంది. గతంలో అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం తలెత్తినప్పుడు 2008–09 రెండో త్రైమాసికంలో ఈ సూచీ అత్యంత కనిష్టమైన 37.8 స్థాయికి పడిపోయినట్లు వివరించింది. ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ అవకాశాలపై వ్యాపార వర్గాల్లో ధీమా సడలటాన్ని ఇండెక్స్ సూచిస్తోందని తెలిపింది. వివిధ రంగాలకు చెందిన సుమారు 190 కంపెనీలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. వీటి టర్నోవరు రూ. 1 కోటి నుంచి రూ. 98,800 కోట్ల దాకా ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంపై వ్యాపార వర్గాల అంచనాలను దీని ద్వారా సేకరించారు. సబ్సిడీలు.. ట్యాక్స్ హాలిడేలు కావాలి.. డిమాండ్, సరఫరా, నిధుల కొరత రూపంలో దేశ ఎకానమీ ప్రధానంగా మూడు సమస్యలు ఎదుర్కొంటోందని ఫిక్కీ తెలిపింది. ఈ నేపథ్యంలో మొత్తం పరిశ్రమకు.. ముఖ్యంగా లఘు, చిన్న, మధ్యతరహా సంస్థలు గట్టెక్కడానికి కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని కోరింది. సబ్సిడీలు, విధానపరమైన మద్దతు, ట్యాక్స్ హాలిడేలు, కరోనా పూర్వ స్థాయిల్లో ఉద్యోగాలను కొనసాగించేందుకు ప్రత్యేకంగా నిధులపరమైన తోడ్పాటులాంటివి అందించాలని విజ్ఞప్తి చేసింది. కార్మిక మార్కెట్ సంస్కరణలను తక్షణమే ప్రాధాన్యత అంశంగా పరిశీలించాలని కోరింది. అలాగే, నేరుగా రిజర్వ్ బ్యాంక్ నేరుగా కార్పొరేట్ బాండ్ల కొనుగోలు చేపట్టాలని, రెపో రేటును మరింత తగ్గించాల్సిన అవసరం ఉందని తెలిపింది. సర్వేలో పాల్గొన్న సంస్థల్లో అత్యధికంగా 72 శాతం కంపెనీలు.. కరోనావైరస్ వ్యాప్తి తమ వ్యాపారాలను దెబ్బతీసిందని వెల్లడించాయి. -
న్యూస్‌ప్రింట్‌పై కస్టమ్స్ సుంకాన్ని తొలగించండి
హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడిపరమైన లాక్‌డౌన్‌తో ఆదాయాలు పడిపోయి, సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రింట్ మీడియాను ఆదుకోవాలని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఓవైపు ప్రకటనల ఆదాయాలు కోల్పోయి, మరోవైపు ముడి వస్తువుల వ్యయాలు.. న్యూస్‌ప్రింట్ దిగుమతి సుంకాలు భారీగా పెరిగిపోయి పత్రికా రంగం కుదేలవుతోందని తెలిపింది. ఈ నేపథ్యంలో తక్షణం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని కోరింది. న్యూస్‌ప్రింట్‌పై విధిస్తున్న 5 శాతం కస్టమ్స్ సుంకాన్ని తొలగించాలని, న్యూస్‌పేపర్ సంస్థలకు రెండేళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని ఐఎన్ఎస్ కోరింది. అలాగే, బీవోసీ ప్రకటన రేటును 50 శాతం, ప్రింట్ మీడియాకు బడ్జెట్‌ను 100% పెంచాలని విజ్ఞప్తి చేసింది. దీంతో పాటు ప్రభుత్వ ప్రకటనలకు సంబంధించిన బకాయిలన్నీ తక్షణమే సెటిల్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి రవి మిట్టల్‌కు ఐఎన్ఎస్ ప్రెసిడెంట్ శైలేష్ గుప్తా ఈ మేరకు లేఖ రాశారు. ‘ముద్రణ వ్యయాలు అధికంగా ఉండే పత్రికలకు ప్రకటనల ఆదాయాలే కీలకం. అయితే, లాక్డౌన్ నేపథ్యంలో పలు వ్యాపారాలు మూతబడి, ప్రకటనలు లేకపోవడంతో ఆదాయవనరు కోల్పోయినట్లయింది’ అని గుప్తా వివరించారు. చాలా మటుకు చిన్న, మధ్య స్థాయి పత్రికలు ఇప్పటికే ప్రచురణ నిలిపివేశాయని, మిగతావి పెను సవాళ్లు ఎదుర్కొంటున్నాయన్నారు. ఇవి కూడా కుప్పకూలిన పక్షంలో దేశీ న్యూస్‌ప్రింట్ తయారీ పరిశ్రమపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం పడగలదన్నారు. అనుబంధ పరిశ్రమల్లో పనిచేసే వారితో పాటు డెలివరీ బాయ్స్ దాకా చాలా మంది ఉపాధి కోల్పోయే ముప్పు ఉందని గుప్తా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రింట్ మీడియా కోలుకునేందుకు తక్షణ తోడ్పాటు చర్యలు తీసుకోవాలని కోరారు. -
మొబైల్ఫోన్ల ధరలు తగ్గే ఛాన్స్!
న్యూఢిల్లీ: దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీని ప్రోత్సహించే దిశగా ఆయా కంపెనీలకు 15 ఏళ్ల పాటు పన్నుపరమైన మినహాయింపులు ఇవ్వాలని కేంద్ర టెలికం విభాగం (డాట్) ప్రతిపాదించింది. అలాగే, విలువ ఆధారిత పన్నులనూ (వ్యాట్) తక్కువ స్థాయిలో ఉంచాలని పేర్కొంది. వియత్నాంలో తయారీ రంగానికి 30 ఏళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా అలాంటి విధానమే తీసుకురావాలని డాట్ యోచిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ మేరకు డాట్ ఇన్వెస్ట్మెంట్ సెల్.. ఆర్థిక శాఖకు పలు సిఫార్సులు చేసింది. ప్రస్తుతం 8.8-15 శాతం దాకా ఉంటున్న వ్యాట్‌ను 4 లేదా 5 శాతం స్థాయికి తగ్గించి, ఒకే రీతిగా అమలు చేయాలని పేర్కొంది. దీనివల్ల మొబైల్ ఫోన్ల ధరలు తగ్గగలవని తెలిపింది. అలాగే పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలు కల్పించేలా ఆదాయపు పన్ను చట్టంలోని 35 ఏడీ నిబంధన పరిధిలోకి మొబైల్ ఫోన్లను, ట్యాబ్లెట్ల తయారీ సంస్థలను కూడా తీసుకురావాలని సూచించింది. మరోవైపు, దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పరిశ్రమతో కలిసి ప్రభుత్వం సంయుక్తంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. -
పవర్ కంపెనీలకు పదేళ్ల టాక్స్ హాలీడే
న్యూఢిల్లీ: ఆర్థిక బడ్జెట్ లో విద్యుత్ రంగానికి సముచిత ప్రాధాన్యం కల్పించారు. విద్యుత్ ఉత్పాదన సంస్థలకు అమల్లోవున్న పదేళ్ల టాక్స్ హాలీడేను మరో ఏడాది పొడిగించారు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80-1ఏ కింద విద్యుత్ ఉత్పాదన సంస్థలకు పన్ను మినహాయింపు ఉంది. దీన్ని మార్చి 31, 2015 వరకు పొడిగించారు. మార్చి 31, 2017లోపు ప్రారంభమయ్యే కంపెనీలకు పదేళ్ల టాక్స్ హాలీడే వర్తిస్తుంది. కాగా, ఢిల్లీలో విద్యుత్ సంస్కరణలకు రూ. 200 కోట్లు కేటాయించారు. రాజస్థాన్, తమిళనాడు, జమ్మూ-కాశ్మీర్ లోని సొలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు రూ. 500 కోట్లు ప్రకటించారు. అల్ట్రా మోడరన్ సూపర్ క్రిటికల్ పవర్ ప్రాజెక్టులు నెలకొల్పనున్నట్టు అరుణ్ జైట్లీ తెలిపారు. దేశంలో అన్ని గృహాలకు నిరంతర విద్యుత్ సరఫరాకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. -
తెలంగాణలోనూ పదేళ్ల టాక్స్ హాలిడే!
-
తెలంగాణలోనూ పదేళ్ల టాక్స్ హాలిడే!
సాధ్యం అవుతుందా, లేదా అనే విషయంతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ నోటికి వచ్చిన హామీలన్నీ ఇచ్చేశారు. పదేళ్ల పాటు తెలంగాణలో టాక్స్ హాలిడే అమలుచేస్తామని అన్నారు. కొత్త రాష్ట్రంలోతమకు అధికారం కట్టబెట్టాలని కోరారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ''టీఆర్ఎస్ వాగ్దానాలైతే గట్టిగా చేస్తుంది. రాష్ట్రం ఇస్తే తమ పార్టీని విలీనం చేస్తామని మాకు వాగ్దానం చేస్తామన్నారు. తెలంగాణకు దళిత ముఖ్యమంత్రిని తెస్తామన్నారు. ఈ రెండు మాటలు మర్చిపోయారు. ఇక మీకు చేసిన వాగ్దానాలను కూడా మర్చిపోతుంది. టీఆర్ఎస్కు, వాళ్ల నాయకుడికి కావల్సింది.. అధికారమే. రాష్ట్రం ముందుడాలంటే అనుభవం ఉన్న ప్రభుత్వం రావాలి. అది తెలిసింది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే. ఇక్కడ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అద్భుతమైన ప్రగతిని సాధిస్తాం. మమ్మల్ని అధికారంలోకి తెస్తే అందరికీ న్యాయం జరుగుతుంది, రాష్ట్రం ముందుకెళ్తుంది. దేశంలోనే అతి పెద్దదైన 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంటు ఇక్కడ ఏర్పాటుచేస్తాం. పదేళ్ల పాటు టాక్స్ హాలిడే ఇస్తాం. 60 ఏళ్ల కల ఈ సంవత్సరం జూన్ రెండో తేదీన నెరవేరబోతోంది. రైతులు, మహిళలు, విద్యార్థులు, టీచర్లు, న్యాయవాదులు అందరూ కలిసి పోరాడారు. వందలాదిమంది అమరుల త్యాగఫలితంగా రాష్ట్రం సిద్ధించింది. కాంగ్రెస్ లేనిదే ఈ స్వప్నం నెరవేరేదే కాదు. మీ మాట విన్నాం.. ప్రజాస్వామిక పద్ధతిని పాటించాం.. త్వరలోనే మీ కల నెరవేరనుంది. రెండు రాష్ట్రాల కలలనూ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చబోతోంది. ఇచ్చిన మాటకు కట్టుబడే నైజం మాది. అందుకే రెండు ప్రాంతాలవాసుల కోరికలను మేం తీరుస్తాం. ఇతర పార్టీలన్నీ తెలంగాణ రాకుండా అడ్డుపడ్డాయి. బిల్లు విషయంలో టీఆర్ఎస్ పాత్ర ఏమాత్రం లేదు. సామాజిక న్యాయాన్ని సాధించే ఉద్దేశంతోనే మేమున్నాం. కవ్వింపు, ఉద్రిక్తతలు సృష్టించే ఉద్దేశం మాకు లేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలకు తెలంగాణలో చోటుండాలి. అత్యంత బలహీనవర్గాలకు కూడా న్యాయం జరగాలన్నదే సామాజిక న్యాయం. తెలంగాణలో అన్ని మతాలనూ గౌరవిస్తాం, లౌకికవాదానికి కట్టుబడతాం. బీజేపీ వాళ్లు హిందూ ముస్లింల మధ్య తగాదా పెడదామని చూస్తారు. ఈ రాష్ట్రం బాగుండాలంటే అందరూ సోదరభావంతో ఉండాలి'' అని ఆయన చెప్పారు. కాగా, రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ తెలుగులోకి అనువదించారు. -
ఫార్మా ప్లాంట్లకు రాయితీలిస్తాం
సాక్షి, సిటీబ్యూరో: కొత్తగా తమ దేశంలో ఫార్మా ప్లాంట్లు, గిడ్డంగులు ఏర్పాటు చేస్తే తగిన రాయితీలిస్తామని జంజీబార్ దేశాధ్యక్షుడు డాక్టర్ అలీ మహ్మద్ షీన్ చెప్పారు. ఆఫ్రికా ఖండంలో టాంజానియా పక్కన సముద్రం నడుమ చిన్న దీవిలా ఉండే జంజీబార్‌లో... 11 ఆసుపత్రులు, 134 మెడికల్ సెంటర్లు ఉన్నాయని, ఆ స్థాయిలో ఫార్మా ప్లాంట్లు మాత్రం లేవని చెప్పారాయన. అందుకే భారత ఫార్మా నిపుణులను ఆహ్వానిస్తున్నామని బుధవారమిక్కడ ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన చర్చాగోష్టిలో ఆయన చెప్పారు. జంజీబార్ దేశ ప్రతినిధులు, భారత ఫార్మా సంస్థల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో డాక్టర్ అలీ మాట్లాడుతూ తాము వినియోగించే మందుల్లో 90 శాతం భారత్ నుంచే దిగుమతి చేసుకుంటున్నామన్నారు. తమ దేశంలో ప్లాంట్లను నెలకొల్పితే 5 నుంచి 10 సంవత్సరాల ట్యాక్స్ హాలీడే ఇస్తామన్నారు. భారత ఫార్మాసిస్టుల అనుభవం తమ దేశానికి ఉపయోగపడేలా చూసేందుకే హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఫార్మాక్సిల్ ఇండియా డెరైక్టర్ జనరల్ డాక్టర్ పివి అప్పాజీ మాట్లాడుతూ ఫార్మా రంగంలో భారత్ ప్రపంచంలో 11వ స్థానంలో ఉందన్నారు. కార్యక్రమంలో జంజీబార్ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డి.కె.జదావతో పాటు 40 భారత ఫార్మా కంపెనీల ప్రతినిధులు, ఫార్మాక్సిల్ ఇండియా మాజీ చెర్మైన్ వెంకట్ జాస్తి తదితరులు పాల్గొన్నారు.