ఫార్మా ప్లాంట్లకు రాయితీలిస్తాం
సాక్షి, సిటీబ్యూరో: కొత్తగా తమ దేశంలో ఫార్మా ప్లాంట్లు, గిడ్డంగులు ఏర్పాటు చేస్తే తగిన రాయితీలిస్తామని జంజీబార్ దేశాధ్యక్షుడు డాక్టర్ అలీ మహ్మద్ షీన్ చెప్పారు. ఆఫ్రికా ఖండంలో టాంజానియా పక్కన సముద్రం నడుమ చిన్న దీవిలా ఉండే జంజీబార్‌లో... 11 ఆసుపత్రులు, 134 మెడికల్ సెంటర్లు ఉన్నాయని, ఆ స్థాయిలో ఫార్మా ప్లాంట్లు మాత్రం లేవని చెప్పారాయన.
అందుకే భారత ఫార్మా నిపుణులను ఆహ్వానిస్తున్నామని బుధవారమిక్కడ ఫార్మాస్యూటికల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన చర్చాగోష్టిలో ఆయన చెప్పారు. జంజీబార్ దేశ ప్రతినిధులు, భారత ఫార్మా సంస్థల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో డాక్టర్ అలీ మాట్లాడుతూ తాము వినియోగించే మందుల్లో 90 శాతం భారత్ నుంచే దిగుమతి చేసుకుంటున్నామన్నారు. తమ దేశంలో ప్లాంట్లను నెలకొల్పితే 5 నుంచి 10 సంవత్సరాల ట్యాక్స్ హాలీడే ఇస్తామన్నారు.
భారత ఫార్మాసిస్టుల అనుభవం తమ దేశానికి ఉపయోగపడేలా చూసేందుకే హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఫార్మాక్సిల్ ఇండియా డెరైక్టర్ జనరల్ డాక్టర్ పివి అప్పాజీ మాట్లాడుతూ ఫార్మా రంగంలో భారత్ ప్రపంచంలో 11వ స్థానంలో ఉందన్నారు. కార్యక్రమంలో జంజీబార్ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డి.కె.జదావతో పాటు 40 భారత ఫార్మా కంపెనీల ప్రతినిధులు, ఫార్మాక్సిల్ ఇండియా మాజీ చెర్మైన్ వెంకట్ జాస్తి తదితరులు పాల్గొన్నారు.