Pharmexcil
-
ఫార్మా ఎగుమతులు 4 శాతం అప్
హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్–అక్టోబర్) ఫార్మా ఎగుమతులు 4.22 శాతం వృద్ధి చెంది 14.57 బిలియన్ డాలర్లకు చేరాయి. గత ఏడాది ఇదే వ్యవధిలో ఎగుమతులు 13.98 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఇవి 27 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనాలు నెలకొన్నాయి. కేంద్ర వాణిజ్య శాఖలో భాగమైన ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్) డైరెక్టర్ జనరల్ ఉదయ భాస్కర్ ఈ విషయాలు వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఫార్మా ఎగుమతులు 24.62 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. జూలై, అక్టోబర్ ఎగుమతులు కాస్త తగ్గినప్పటికీ సెప్టెంబర్‌లో సానుకూలంగానే ఉన్నాయని, ఇదే ధోరణి పూర్తి ఆర్థిక సంవత్సరంలోను కొనసాగవచ్చని భాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అక్టోబర్‌లో ఫార్మా ఎగుమతులు 5.45 శాతం క్షీణించి 1.95 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలతో పాటు కొన్ని కీలక కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడటం కూడా ఎగుమతుల తగ్గుదలకు కారణమైనట్లు భాస్కర్ చెప్పారు. ‘ఉదాహరణకు భారత ఫార్మాకు టాప్ 5 మార్కెట్లలో నైజీరియా కూడా ఒకటి. అమెరికా డాలర్‌తో పోలిస్తే నైజీరియా నైరా క్షీణత కొనసాగుతుండటంతో ఆ దేశం దిగుమతులను తగ్గించుకోవాల్సి వస్తోంది‘ అని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత్‌కు అమెరికా, కెనడా, మెక్సికోతో పాటు యూరప్, ఆఫ్రికా దేశాలు టాప్ మార్కెట్లుగా ఉంటున్నాయి. -
24.44 బిలియన్ డాలర్లకు దేశీయ ఫార్మా ఎగుమతులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్ధిక సంవత్సరంలో దేశీయ ఫార్మా ఎగుమతులు 18 శాతం వృద్ధి చెంది 24.44 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2020 ఆర్ధిక సంవత్సరంలో ఇవి 20.58 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని ఫార్మాసూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మాగ్జిల్) తెలిపింది. ఈ ఏడాది మార్చిలో ఫార్మా ఎగుమతులు 2.3 బిలియన్ డాలర్లను దాటాయని పేర్కొంది. 2020 మార్చి నెలతో పోలిస్తే 48.5 శాతం వృద్ధి అని.. ఆ నెలలో ఎగుమతులు 1.54 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని ఫార్మాగ్జిల్ డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. 2020 మార్చిలో ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా సప్లయి చెయిన్‌లో అంతరాయం ఏర్పడిందని దీంతో ఎగుమతులు క్షీణించాయని.. ఈ కారణంగా ఈ ఏడాది మార్చి ఎగుమతుల్లో పెద్ద వృద్ధి రేటుగా అనిపిస్తున్నాయని చెప్పారు. గతేడాది ప్రపంచ ఫార్మా మార్కెట్ 1–2 శాతం క్షీణంచి.. ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న సమయంలో నాణ్యత, అందుబాటు కారణంగా భారతీయ జనరిక్ మందులకు డిమాండ్ ఏర్పడిందని చెప్పారు. దేశీయ ఫార్మా ఎగుమతులు అత్యధికంగా ఎగుమతి అవుతున్న దేశాల్లో 34 శాతం వాటాతో ఉత్తర అమెరికా ప్రధమ స్థానంలో ఉంటుంది. ఆ తర్వాత కెనడా 30 శాతం, మెక్సికో 21.4 శాతంగా ఉన్నాయి. -
ఫార్మాకు కలిసొచ్చిన ఉత్తర అమెరికా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19, లాక్డౌన్ అడ్డంకులు ఉన్నప్పటికీ భారత్ నుంచి ఔషధ ఎగుమతులు ఏప్రిల్–జూన్‌లో వృద్ధి చెందాయి. ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) గణాంకాల ప్రకారం గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఎగుమతులు 7.16 శాతం అధికమై రూ.37,875 కోట్ల నుంచి రూ.40,590 కోట్లకు చేరాయి. డ్రగ్ ఫార్ములేషన్స్, బయాలాజిక్స్ ఒక్కటే వృద్ధికి తోడైంది. ఇతర విభాగాలన్నీ నిరాశపరిచాయి. డ్రగ్ ఫార్ములేషన్స్, బయాలాజిక్స్ విభాగం 15.14 శాతం వృద్ధితో రూ.31,042 కోట్లు నమోదైంది. మొత్తం ఎగుమతుల విలువలో ఈ విభాగం వాటా ఏకంగా 76.48 శాతం ఉండడం గమనార్హం. వ్యాక్సిన్స్ 30 శాతం, ఆయుష్ 25, సర్జికల్స్ 15.8, బల్క్ డ్రగ్స్, డ్రగ్ ఇంటర్మీడియేట్స్ 8 శాతం, హెర్బల్ ప్రొడక్ట్స్ 2.5 శాతం తిరోగమన వృద్ధి సాధించాయి. ఎగుమతులకు ఊతమిచ్చే బల్క్ డ్రగ్స్, ఇంటర్మీడియేట్స్ ఈ త్రైమాసికంలో మాత్రం 8.38 శాతం మైనస్‌లోకి వెళ్లాయని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ ఆర్.ఉదయ భాస్కర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. దేశీయంగా ఫార్మా రంగం తిరోగమనంలో ఉన్నప్పటికీ ఏప్రిల్–జూన్‌లో ఎగుమతుల వృద్ధి సాధించడం విశేషమన్నారు. కొన్ని ప్రాంతాలు మినహా..: ఎగుమతుల్లో కొన్ని ప్రాంతాలు (రీజియన్లు) మినహా మిగిలినవన్నీ వృద్ధిని నమోదు చేశాయి. మధ్యప్రాచ్య మినహా ఆసియా, లాటిన్ అమెరికా దేశాలు, దక్షిణాసియా, కొన్ని యూరప్ దేశాలు నిరాశపరిచాయి. అయితే 2020 ఏప్రిల్–జూన్‌లో ఉత్తర అమెరికా మార్కెట్ ఎగుమతులకు ఊతమిచ్చింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ రీజియన్ 15.67 శాతం వృద్ధితో రూ.15,450 కోట్ల ఎగుమతులను నమోదు చేసింది. మొత్తం ఎక్స్‌పోర్ట్స్‌లో ఉత్తర అమెరికా వాటా అత్యధికంగా 38 శాతం ఉంది. వృద్ధి పరంగా మధ్య ప్రాచ్య దేశాలు 14 శాతం అధికమై రూ.2,220 కోట్లు, ఆసియాన్ ప్రాంతం 10.5 శాతం హెచ్చి రూ.2,580 కోట్లు సాధించాయి. పరిమాణంలో రెండో స్థానంలో ఉన్న ఆఫ్రికా మార్కెట్లు 0.4 శాతం పెరిగి రూ.6,510 కోట్లు, మూడో స్థానంలో ఉన్న యురోపియన్ యూనియన్ 6.9 శాతం అధికమై రూ.6,000 కోట్ల ఎగుమతులను నమోదు చేశాయి. -
ఫార్మా ఎగుమతులకు వైరస్ దెబ్బ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఫార్మా ఎగుమతుల మీద కరోనా గట్టి దెబ్బే వేసింది. కేంద్రం కొన్ని రకాల ఔషధాల ఎగుమతుల మీద నియంత్రణ పెట్టడం, దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో దేశీయ ఫార్మా పరిశ్రమ 22 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకోలేదని ఫార్మాసూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(ఫార్మెక్సిల్) తెలిపింది. గత ఆర్ధిక సంవత్సరంలో ఫార్మా ఎగుమతులు 19.14 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని.. 2020 ఆర్ధిక సంవత్సరంలో 22 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేశామని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. గతేడాది మార్చి ఒక్క నెలలోనే 2.1 బిలియన్ డాలర్ల ఫార్మా ఎగుమతులు జరిగాయన్నారు. 2017–18లో ఫార్మా ఎగుమతులు 17.28 బిలియన్ డాలర్లు. పారాసిటమల్, హైడ్రాక్సిక్లోరోక్విన్ వంటి కరోనా నియంత్రణలో వినియోగించే ఔషదాల ఎగమతుల మీద కేంద్రం నియంత్రణ విధించిన సంగతి తెలిసిందే. ఫార్మా ఎగుమతుల్లో వీటి వాటా 600 మిలియన్ డాలర్లుంటుందని పరిశ్రమ వర్గాల సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 18.74 బిలియన్ డాలర్ల ఎగుమతులను సాధించామని తెలిపారు. -
ఫార్మా ప్లాంట్లకు రాయితీలిస్తాం
సాక్షి, సిటీబ్యూరో: కొత్తగా తమ దేశంలో ఫార్మా ప్లాంట్లు, గిడ్డంగులు ఏర్పాటు చేస్తే తగిన రాయితీలిస్తామని జంజీబార్ దేశాధ్యక్షుడు డాక్టర్ అలీ మహ్మద్ షీన్ చెప్పారు. ఆఫ్రికా ఖండంలో టాంజానియా పక్కన సముద్రం నడుమ చిన్న దీవిలా ఉండే జంజీబార్‌లో... 11 ఆసుపత్రులు, 134 మెడికల్ సెంటర్లు ఉన్నాయని, ఆ స్థాయిలో ఫార్మా ప్లాంట్లు మాత్రం లేవని చెప్పారాయన. అందుకే భారత ఫార్మా నిపుణులను ఆహ్వానిస్తున్నామని బుధవారమిక్కడ ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన చర్చాగోష్టిలో ఆయన చెప్పారు. జంజీబార్ దేశ ప్రతినిధులు, భారత ఫార్మా సంస్థల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో డాక్టర్ అలీ మాట్లాడుతూ తాము వినియోగించే మందుల్లో 90 శాతం భారత్ నుంచే దిగుమతి చేసుకుంటున్నామన్నారు. తమ దేశంలో ప్లాంట్లను నెలకొల్పితే 5 నుంచి 10 సంవత్సరాల ట్యాక్స్ హాలీడే ఇస్తామన్నారు. భారత ఫార్మాసిస్టుల అనుభవం తమ దేశానికి ఉపయోగపడేలా చూసేందుకే హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఫార్మాక్సిల్ ఇండియా డెరైక్టర్ జనరల్ డాక్టర్ పివి అప్పాజీ మాట్లాడుతూ ఫార్మా రంగంలో భారత్ ప్రపంచంలో 11వ స్థానంలో ఉందన్నారు. కార్యక్రమంలో జంజీబార్ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డి.కె.జదావతో పాటు 40 భారత ఫార్మా కంపెనీల ప్రతినిధులు, ఫార్మాక్సిల్ ఇండియా మాజీ చెర్మైన్ వెంకట్ జాస్తి తదితరులు పాల్గొన్నారు.