హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్ధిక సంవత్సరంలో దేశీయ ఫార్మా ఎగుమతులు 18 శాతం వృద్ధి చెంది 24.44 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2020 ఆర్ధిక సంవత్సరంలో ఇవి 20.58 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని ఫార్మాసూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మాగ్జిల్) తెలిపింది. ఈ ఏడాది మార్చిలో ఫార్మా ఎగుమతులు 2.3 బిలియన్ డాలర్లను దాటాయని పేర్కొంది. 2020 మార్చి నెలతో పోలిస్తే 48.5 శాతం వృద్ధి అని.. ఆ నెలలో ఎగుమతులు 1.54 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని ఫార్మాగ్జిల్ డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్ తెలిపారు.
2020 మార్చిలో ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా సప్లయి చెయిన్‌లో అంతరాయం ఏర్పడిందని దీంతో ఎగుమతులు క్షీణించాయని.. ఈ కారణంగా ఈ ఏడాది మార్చి ఎగుమతుల్లో పెద్ద వృద్ధి రేటుగా అనిపిస్తున్నాయని చెప్పారు. గతేడాది ప్రపంచ ఫార్మా మార్కెట్ 1–2 శాతం క్షీణంచి.. ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న సమయంలో నాణ్యత, అందుబాటు కారణంగా భారతీయ జనరిక్ మందులకు డిమాండ్ ఏర్పడిందని చెప్పారు. దేశీయ ఫార్మా ఎగుమతులు అత్యధికంగా ఎగుమతి అవుతున్న దేశాల్లో 34 శాతం వాటాతో ఉత్తర అమెరికా ప్రధమ స్థానంలో ఉంటుంది. ఆ తర్వాత కెనడా 30 శాతం, మెక్సికో 21.4 శాతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment