Domestic pharma exports
-
దేశీయ ఫార్మా జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఔషధ పరిశ్రమ 2024 మార్చి నెలలో మెరుగైన ప్రతిభ కనబరిచింది. ఫిబ్రవరితో పోలిస్తే గత నెల 9.5 శాతం వృద్ధి నమోదు చేసింది. అన్ని ప్రధాన చికిత్సా విభాగాల్లో అమ్మకాల విలువ పెరగడం ఈ జోరుకు కారణం అని మార్కెట్ రిసర్చ్ కంపెనీ ఫార్మాట్రాక్ తెలిపింది. 2023–24లో భారతీయ ఔషధ పరిశ్రమ 6.5 శాతం వృద్ధితో రూ.1.98 లక్షల కోట్లు నమోదు చేసిందని వెల్లడించింది. ‘శ్వాసకోశ మినహా దాదాపు అన్ని చికిత్సలకు సంబంధించిన ఉత్పత్తుల విక్రయాల్లో సానుకూల విలువ పెరుగుదలను చూపించాయి. ధరల వృద్ధి శాతం సానుకూలంగా కొనసాగింది. అయితే మార్చి నెలలో పరిమాణంలో వృద్ధి శాతం చాలా తక్కువగా ఉంది. గత నెలలో కార్డియాక్ 15 శాతం, యాంటీ–ఇన్ఫెక్టివ్స్ 9, గ్యాస్ట్రో–ఇంటెస్టినల్ 9 శాతం విలువ వృద్ధి సాధించాయి. అమ్మకాల్లో ఈ మూడు విభాగాలే ఏకంగా 37.5 శాతం కైవసం చేసుకున్నాయి. విక్రయాల విలువ పరంగా యాంటీ డయాబెటిక్ 12.4 శాతం, విటమిన్స్, మినరల్స్, న్యూట్రాస్యూటికల్స్ 7.2 శాతం దూసుకెళ్లాయి’ అని వివరించింది. -
24.44 బిలియన్ డాలర్లకు దేశీయ ఫార్మా ఎగుమతులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్ధిక సంవత్సరంలో దేశీయ ఫార్మా ఎగుమతులు 18 శాతం వృద్ధి చెంది 24.44 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2020 ఆర్ధిక సంవత్సరంలో ఇవి 20.58 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని ఫార్మాసూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మాగ్జిల్) తెలిపింది. ఈ ఏడాది మార్చిలో ఫార్మా ఎగుమతులు 2.3 బిలియన్ డాలర్లను దాటాయని పేర్కొంది. 2020 మార్చి నెలతో పోలిస్తే 48.5 శాతం వృద్ధి అని.. ఆ నెలలో ఎగుమతులు 1.54 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని ఫార్మాగ్జిల్ డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. 2020 మార్చిలో ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా సప్లయి చెయిన్‌లో అంతరాయం ఏర్పడిందని దీంతో ఎగుమతులు క్షీణించాయని.. ఈ కారణంగా ఈ ఏడాది మార్చి ఎగుమతుల్లో పెద్ద వృద్ధి రేటుగా అనిపిస్తున్నాయని చెప్పారు. గతేడాది ప్రపంచ ఫార్మా మార్కెట్ 1–2 శాతం క్షీణంచి.. ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న సమయంలో నాణ్యత, అందుబాటు కారణంగా భారతీయ జనరిక్ మందులకు డిమాండ్ ఏర్పడిందని చెప్పారు. దేశీయ ఫార్మా ఎగుమతులు అత్యధికంగా ఎగుమతి అవుతున్న దేశాల్లో 34 శాతం వాటాతో ఉత్తర అమెరికా ప్రధమ స్థానంలో ఉంటుంది. ఆ తర్వాత కెనడా 30 శాతం, మెక్సికో 21.4 శాతంగా ఉన్నాయి. -
ఫార్మా ఎగుమతులు.. మూడేళ్లలో 25 బిలియన్ డాలర్లకి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఫార్మా ఎగుమతులు వేగంగా వృద్ధి చెందుతున్నాయని, వచ్చే మూడేళ్లలో వీటి విలువ 25 బిలియన్ డాలర్లు దాటుతుందని ఫార్మెక్సిల్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం 15 బిలియన్ డాలర్లుగా ఉన్న ఫార్మా ఎగుమతులు ఏటా 20 శాతం చొప్పున వృద్ధి చెంది 25 బిలియన్ డాలర్లు దాటతాయని ఫార్మెక్సిల్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ పి.వి.అప్పాజీ తెలిపారు. ఫార్మెక్సిల్ 10వ వార్షిక సర్వసభ్య సమావేశ వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మొత్తం ఎగుమతుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా 30 శాతంగా ఉందన్నారు. ఇందులో తెలంగాణా రాష్ట్రానికి 65 శాతం, ఆంధ్రప్రదేశ్‌కి 35 శాతం వాటా ఉండొచ్చన్నారు. దేశ ఫార్మా ఎగుమతుల్లో ఆయుర్వేద ఎగుమతుల వాటా 5 శాతం వరకు ఉందన్నారు. పదేళ్ల క్రితం రూ.17,000 కోట్లుగా ఉన్న ఫార్మా ఎగుమతులు ఈ ఏడాది తొలిసారిగా లక్ష కోట్ల మార్కును అధిగమిస్తోందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఫార్మెక్సిల్ చైర్మన్ అశితోష్ గుప్తా మాట్లాడుతూ నైజీరియాలో ఉన్న ఎగుమతుల అవకాశాలను అందిపుచ్చుకునేలా ఒక మార్కెటింగ్ స్కీంను ప్రవేశపెడుతున్నామని, కాని ఇది ఎబోలో వ్యాధి కారణం గా 2015కి వాయిదాపడిందన్నారు. ఈ పథకం కింద ఫార్మెక్సిల్ గిడ్డంగులను నిర్మించి చిన్న కంపెనీలకు తక్కువ అద్దెకు ఇస్తుందన్నారు. తొలి ఏడాది 75%, రెండో ఏడాది 50%, మూడో ఏడాది 33% రెంటల్ సబ్సిడీ అందించనున్నట్లు తెలిపారు.