తెలంగాణలోనూ పదేళ్ల టాక్స్ హాలిడే! | will give tax holiday for telangana says rahul gandhi | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 21 2014 4:27 PM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM

సాధ్యం అవుతుందా, లేదా అనే విషయంతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ నోటికి వచ్చిన హామీలన్నీ ఇచ్చేశారు. పదేళ్ల పాటు తెలంగాణలో టాక్స్ హాలిడే అమలుచేస్తామని అన్నారు. కొత్త రాష్ట్రంలోతమకు అధికారం కట్టబెట్టాలని కోరారు. మహబూబ్నగర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ''టీఆర్ఎస్ వాగ్దానాలైతే గట్టిగా చేస్తుంది. రాష్ట్రం ఇస్తే తమ పార్టీని విలీనం చేస్తామని మాకు వాగ్దానం చేస్తామన్నారు. తెలంగాణకు దళిత ముఖ్యమంత్రిని తెస్తామన్నారు. ఈ రెండు మాటలు మర్చిపోయారు. ఇక మీకు చేసిన వాగ్దానాలను కూడా మర్చిపోతుంది. టీఆర్ఎస్కు, వాళ్ల నాయకుడికి కావల్సింది.. అధికారమే. రాష్ట్రం ముందుడాలంటే అనుభవం ఉన్న ప్రభుత్వం రావాలి. అది తెలిసింది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే. ఇక్కడ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అద్భుతమైన ప్రగతిని సాధిస్తాం. మమ్మల్ని అధికారంలోకి తెస్తే అందరికీ న్యాయం జరుగుతుంది, రాష్ట్రం ముందుకెళ్తుంది. దేశంలోనే అతి పెద్దదైన 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంటు ఇక్కడ ఏర్పాటుచేస్తాం. పదేళ్ల పాటు టాక్స్ హాలిడే ఇస్తాం. 60 ఏళ్ల కల ఈ సంవత్సరం జూన్ రెండో తేదీన నెరవేరబోతోంది. రైతులు, మహిళలు, విద్యార్థులు, టీచర్లు, న్యాయవాదులు అందరూ కలిసి పోరాడారు. వందలాదిమంది అమరుల త్యాగఫలితంగా రాష్ట్రం సిద్ధించింది. కాంగ్రెస్ లేనిదే ఈ స్వప్నం నెరవేరేదే కాదు. మీ మాట విన్నాం.. ప్రజాస్వామిక పద్ధతిని పాటించాం.. త్వరలోనే మీ కల నెరవేరనుంది. రెండు రాష్ట్రాల కలలనూ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చబోతోంది. ఇచ్చిన మాటకు కట్టుబడే నైజం మాది. అందుకే రెండు ప్రాంతాలవాసుల కోరికలను మేం తీరుస్తాం. ఇతర పార్టీలన్నీ తెలంగాణ రాకుండా అడ్డుపడ్డాయి. బిల్లు విషయంలో టీఆర్ఎస్ పాత్ర ఏమాత్రం లేదు. సామాజిక న్యాయాన్ని సాధించే ఉద్దేశంతోనే మేమున్నాం. కవ్వింపు, ఉద్రిక్తతలు సృష్టించే ఉద్దేశం మాకు లేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలకు తెలంగాణలో చోటుండాలి. అత్యంత బలహీనవర్గాలకు కూడా న్యాయం జరగాలన్నదే సామాజిక న్యాయం. తెలంగాణలో అన్ని మతాలనూ గౌరవిస్తాం, లౌకికవాదానికి కట్టుబడతాం. బీజేపీ వాళ్లు హిందూ ముస్లింల మధ్య తగాదా పెడదామని చూస్తారు. ఈ రాష్ట్రం బాగుండాలంటే అందరూ సోదరభావంతో ఉండాలి'' అని ఆయన చెప్పారు. కాగా, రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ తెలుగులోకి అనువదించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement