
మొబైల్‌ఫోన్ల ధరలు తగ్గే ఛాన్స్!
న్యూఢిల్లీ: దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీని ప్రోత్సహించే దిశగా ఆయా కంపెనీలకు 15 ఏళ్ల పాటు పన్నుపరమైన మినహాయింపులు ఇవ్వాలని కేంద్ర టెలికం విభాగం (డాట్) ప్రతిపాదించింది. అలాగే, విలువ ఆధారిత పన్నులనూ (వ్యాట్) తక్కువ స్థాయిలో ఉంచాలని పేర్కొంది. వియత్నాంలో తయారీ రంగానికి 30 ఏళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా అలాంటి విధానమే తీసుకురావాలని డాట్ యోచిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఈ మేరకు డాట్ ఇన్వెస్ట్‌మెంట్ సెల్.. ఆర్థిక శాఖకు పలు సిఫార్సులు చేసింది. ప్రస్తుతం 8.8-15 శాతం దాకా ఉంటున్న వ్యాట్‌ను 4 లేదా 5 శాతం స్థాయికి తగ్గించి, ఒకే రీతిగా అమలు చేయాలని పేర్కొంది. దీనివల్ల మొబైల్ ఫోన్ల ధరలు తగ్గగలవని తెలిపింది.
అలాగే పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలు కల్పించేలా ఆదాయపు పన్ను చట్టంలోని 35 ఏడీ నిబంధన పరిధిలోకి మొబైల్ ఫోన్లను, ట్యాబ్లెట్ల తయారీ సంస్థలను కూడా తీసుకురావాలని సూచించింది. మరోవైపు, దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పరిశ్రమతో కలిసి ప్రభుత్వం సంయుక్తంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.