Genco Board
-
శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ఆపండి
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో తక్షణమే విద్యుదుత్పత్తి నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కృష్ణాబోర్డు ఆదేశించింది. బోర్డు జారీ చేసే నీటి కేటాయింపుల ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని సూచించింది. ఈ మేరకు కృష్ణాబోర్డు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో)కు లేఖ రాసింది. నీటి అవసరాల కోసం తెలంగాణకు ఇంకా ఎలాంటి ఇండెంట్ ఇవ్వలేదని గుర్తు చేసింది. సాగర్‌కు నీటి విడుదల కోరుతూ ఇండెంట్ ఇస్తేనే శ్రీశైలంలో జలవిద్యుదుత్పత్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో తీవ్ర వర్షాభావం నెలకొని ఉన్న నేపథ్యంలో, వార్షిక సగటు వర్షపాతం కన్నా తక్కువగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అభిప్రాయపడింది. ప్రస్తుతం జలాశయాలు పూర్తిగా నిండకపోవచ్చని, ఈ నేపథ్యంలో నీటిని సంరక్షించాల్సిన అవసరముందని చెప్పింది. కృష్ణా బోర్డుకు సంబంధం లేదు సాగర్‌కు నీటి విడుదల కోరుతూ ఇండెంట్ ఇస్తేనే శ్రీశైలంలో జలవిద్యుదుత్పత్తి జరపాలని కృష్ణాబోర్డు కోరడం పట్ల తెలంగాణ నీటిపారుదలశాఖ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సాగర్‌కు నీటి విడుదల కోసమే శ్రీశైలం జలాశయం నిర్మించాలని ప్రణాళిక సంఘం అనుమతిచ్చిందని, శ్రీశైలం నిండిన తర్వాతే సాగర్‌కు నీటిని విడుదల చేయాలని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేస్తున్నాయి. పూర్తిగా జలవిద్యుదుత్పత్తి అవసరాల కోసమే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించారని గుర్తు చేస్తున్నాయి. ఈ విషయంలో కృష్ణాబోర్డు తన పరిధిని దాటి వ్యవహరించిందని, జలవిద్యుదుత్పత్తి బోర్డు పరిధిలోకి రాదని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు నీటిపారుదలశాఖ త్వరలో కృష్ణా బోర్డుకు లేఖ రాయనున్నట్టు తెలిసింది. జల విద్యుదుత్పత్తి కొనసాగుతుంది ప్రస్తుతం వర్షాభావం నెలకొని ఉండడంతో రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్‌కు డిమాండ్ భారీ పెరిగింది. విద్యుత్ డిమాండ్ గరిష్ట స్థాయికి చేరినప్పుడు లోటును పూడ్చుకోవడానికి మాత్రమే శ్రీశైలం జలాశయంలో విద్యుదుత్పత్తి చేస్తున్నామని జెన్కో ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. నిరంతర విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా విద్యుత్ కొరత నెలకొన్న సమయంలో జలవిద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. -
అవి సీఎం చెప్పిన టెండర్లు
* రద్దు చేయడానికి వీల్లేదు * ఆ అవినీతి టెండర్లు రద్దు చేయాల్సిందే * జెన్కో బోర్డు భేటీలో అధికారుల వాడివేడి చర్చ సాక్షి, హైదరాబాద్: కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం థర్మల్ ప్రాజెక్టుల టెండర్ల (బీవోసీ)లో భారీ ఎత్తున అవినీతి ఉన్నందువల్ల ఆ కాంట్రాక్టులను రద్దు చేయాలని ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ చెప్పినా.. దానిని ఏపీ జెన్కో ఎండీ విజయానంద్ వ్యతిరేకించారు. ఈ కాంట్రాక్టుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ఆసక్తి ఉన్నందువల్ల రద్దు చేయడం సరికాదంటూ ఆయన టెండర్ల ప్రక్రియను సమర్థించారు. అజయ్‌జైన్ నేతృత్వంలో గురువారం జరిగిన ఏపీ జెన్కో బోర్డు మీటింగ్‌లో ఈ అంశంపై వాడివేడిగా చర్చ జరిగింది. విజయానంద్ వాదనతో బోర్డు సభ్యులు ఆశ్చర్యపోయారు. అవినీతి ఆరోపణలు వచ్చిన కాంట్రాక్టులను రద్దు చేయాల్సిందేనని, టెండర్ అర్హత నిబంధనలను మార్చాలని అజయ్‌జైన్ గట్టిగా అభిప్రాయపడినా.. విజయానంద్ మాత్రం సీఎం అవినీతిని సమర్థించడాన్ని వారు తప్పుపట్టినట్లు తెలిసింది. విజయానంద్ తీరుపై జైన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. టెండర్లలో దాదాపు రూ. 2,860 కోట్లు ఎక్కువ చెల్లింపులు జరుగుతోందన్న విమర్శలొచ్చాయని సమావేశంలో జైన్ ప్రస్తావించారు. ఎల్-1గా నిలిచిన బీజీఆర్, టాటాతో రెండు దఫాలు చర్చలు జరిపామని, వారు కొంతమేర తగ్గించుకునేందుకు ఒప్పుకున్నారని విజయానంద్ సమావేశం దృష్టికి తెచ్చారు. కొద్దిగా తగ్గించుకోవడంపై బోర్డు సభ్యులు ప్రశ్నించడంతో విజయానంద్ మనస్తాపానికి గురైనట్టు సమాచారం.అవినీతి కాంట్రాక్టులైనా సీఎం చెప్పబట్టే ముందుకెళ్లామని, దీన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని సమావేశం తర్వాత ఎండీ.. తన వెంటే ఉన్న ఫైనాన్స్ డెరైక్టర్‌తో చెప్పినట్టు తెలిసింది. ఏపీ జెన్కో కార్యాలయం విజయవాడకు తరలింపుపై చర్చకు వచ్చింది. టీడీపీకి చెందిన ఓ నేత భవనాన్ని చదరపు అడుగు రూ. 70కి ఇవ్వడానికి ముందుకొచ్చారని, ఆరు నెలల్లో అన్ని వసతులు కల్పించేందుకు హామీ ఇచ్చారని ఎండీ విజయానంద్ అన్నట్టు తెలిసింది. దీనికి బోర్డు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీటికి టెండర్లు..: కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నంలో ఒక్కొక్కటీ 800 మెగావాట్ల సామర్థ్యంతో రెండు థర్మల్ ప్రాజెక్టులను నెలకొల్పాలని ఏపీ జెన్కో నిర్ణయించింది. దీనికోసం టెండర్లు పిలిచింది. కొన్ని కంపెనీలు మాత్రమే అర్హత పొందేలా నిబంధనలు పెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలు ఇతర రాష్ట్రాల్లో తాము కట్టిన ప్రాజెక్టుల కన్నా రూ. 2,860 కోట్ల మేర ఎక్కువ కోట్ చేశాయి. ఇందులో ప్రభుత్వాధినేతకు పెద్ద ఎత్తున ముడుపులు అందాయనే విమర్శలొచ్చాయి. ఈ కుంభకోణాన్ని గతంలో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. -
టెండర్లు రద్దంతే!
జెన్కో బోర్డును ఏమార్చిన ప్రభుత్వాధినేత - అధికారులకే అందని మినిట్స్ - సోలార్ టెండర్ల కహానీలో మరో కోణం సాక్షి, హైదరాబాద్: సోలార్ టెండర్ల కుంభకోణం వెనుక ప్రభుత్వ పాత్రను తెరమీదకు రాకుండా ప్రభుత్వం ముందే జాగ్రత్తపడింది. టెండర్లను రద్దు చేసిన ప్రభుత్వం అందుకు తగ్గ కారణాలను మాత్రం గోప్యంగా ఉంచింది. వాస్తవాలు ఏమాత్రం బయటకు పొక్కకుండా చూడాలని ముఖ్యమంత్రి కార్యాలయం జెన్కో ఉన్నతాధికారులకు స్పష్టమైన మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఆఖరుకు ఏపీ జెన్కో బోర్డు సమావేశం మినిట్స్‌ను కూడా సంబంధిత అధికారుల కంటపడకుండా చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అనంతపురం జిల్లా తాడిపత్రికి సమీపంలోని తలారిచెర్వులో ఏపీ జెన్కో 500 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఈపీసీ పద్ధతిన టెండర్లు పిలిచింది. కేవలం ఐదు సంస్థలకే అర్హత ఉండేలా నిబంధనలు పెట్టడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఎన్టీపీసీ ధర కన్నా ఎక్కువగా ఉండటంతో ఈ టెండర్లలో రూ.755 కోట్ల గోల్‌మాల్‌కు అవకాశం ఉందని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ కుంభకోణంపై ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు. మరోవైపు దీనిపై కొంతమంది కోర్టుకెళ్ళేందుకు సిద్ధపడ్డారు. ఇదే జరిగితే టెండర్ల వ్యవహారంలోని అవకతవకలన్నీ బయటకొస్తాయని, అవినీతి మెడకు చుట్టుకుంటుందని ప్రభుత్వం కంగారు పడి టెండర్లను రద్దు చేసింది. ఈమేరకు ఈ నెల 12వ తేదీన టెండర్లు దక్కించుకున్న ఐదు సంస్థలకు రద్దు చేస్తున్నట్టు లేఖలు పంపింది. అయితే, వీటిని ఎందుకు రద్దు చేస్తున్నారనే విషయం మాత్రం అందులో పేర్కొనకుండా, ‘టెండర్లు రద్దు చేస్తున్నాం’ అనే ఏక వాక్యంతో లేఖలు పంపింది. దొంగతనం బయటకొస్తుందనే... టెండర్ల రద్దుపై ఏపీ జెన్కో బోర్డులో నెల రోజుల క్రితమే చర్చించారు. బోర్డు నిర్ణయాన్ని అమలు చేయాలని అధికారులు హైడల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్, అండ్ హైడల్ ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజనీర్‌కు ఏక వాక్య తీర్మానంతో లేఖ పంపారు. వాస్తవానికి బోర్డు మినిట్స్ కూడా ఆయనకు ఇవ్వాల్సి ఉంటుందని, దాని ఆధారంగానే రద్దు లేఖలను తయారు చేసి, అందులో ఎందుకు రద్దు చేస్తున్నారో వివరించాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. లేనిపక్షంలో టెండర్‌దారులు కోర్టుకు వెళ్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని చెబుతున్నారు. కానీ చీఫ్ ఇంజనీర్‌కు మినిట్స్ ఇవ్వకపోవడం, ఆయన కూడా రద్దు లేఖల్లో కారణాలు చెప్పకపోవడం వెనుక పెద్ద గూడుపుఠాణీ ఉందనే అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వ సూచన మేరకే టెండర్ నిబంధనలు రూపొందించినట్టు ఏపీ జెన్కో బోర్డు మినిట్స్‌లో రికార్డు చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత ఆరోపణలు రావడంతో నిపుణుల కమిటీ వేసినట్టు... సోలార్ టెండర్ల ధరలు ఉద్దేశ్యపూర్వకంగా ఎక్కువగా చూపించినట్టు, దీన్ని ప్రాథమిక దశలోనే త్రోసిపుచ్చితే బాగుండేదని కమిటీ అభిప్రాయపడినట్టు తెలిసింది. అయితే, ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా, సీఎం కార్యాలయం టెండర్లను ఖరారు చేయాల్సిందేనని సూచించినట్టు సమాచారం. టెండర్ల రద్దుకు గల కారణాలను అధికారికంగా రద్దు లేఖల్లో పేర్కొంటే తెరవెనుక ఉన్న ప్రభుత్వ పెద్ద బండారం బయటపడే వీలుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అర్థం పర్థంలేని లేఖను కాంట్రాక్టర్లకు పంపినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఇలాంటి లేఖపై ఆయా కాంట్రాక్టర్లు వివరణ కోరాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్ఈఎల్ కూడా ఈ నిబంధన పాటించలేదు. దీన్నిబట్టి బీహెచ్ఈఎల్తో పాటు మిగతా కాంట్రాక్టర్లు రింగ్ అయినట్టు స్పష్టమవుతోంది. ఏదేమైనా సమాచారం వెల్లడించకుండా చేయడంవల్ల తాము చిక్కుల్లో పడే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన పడుతున్నారు.