టెండర్లు రద్దంతే!
జెన్‌కో బోర్డును ఏమార్చిన ప్రభుత్వాధినేత
- అధికారులకే అందని మినిట్స్
- సోలార్ టెండర్ల కహానీలో మరో కోణం
సాక్షి, హైదరాబాద్: సోలార్ టెండర్ల కుంభకోణం వెనుక ప్రభుత్వ పాత్రను తెరమీదకు రాకుండా ప్రభుత్వం ముందే జాగ్రత్తపడింది. టెండర్లను రద్దు చేసిన ప్రభుత్వం అందుకు తగ్గ కారణాలను మాత్రం గోప్యంగా ఉంచింది. వాస్తవాలు ఏమాత్రం బయటకు పొక్కకుండా చూడాలని ముఖ్యమంత్రి కార్యాలయం జెన్‌కో ఉన్నతాధికారులకు స్పష్టమైన మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఆఖరుకు ఏపీ జెన్‌కో బోర్డు సమావేశం మినిట్స్‌ను కూడా సంబంధిత అధికారుల కంటపడకుండా చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అనంతపురం జిల్లా తాడిపత్రికి సమీపంలోని తలారిచెర్వులో ఏపీ జెన్‌కో 500 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఈపీసీ పద్ధతిన టెండర్లు పిలిచింది.
కేవలం ఐదు సంస్థలకే అర్హత ఉండేలా నిబంధనలు పెట్టడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఎన్టీపీసీ ధర కన్నా ఎక్కువగా ఉండటంతో ఈ టెండర్లలో రూ.755 కోట్ల గోల్‌మాల్‌కు అవకాశం ఉందని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ కుంభకోణంపై ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు. మరోవైపు దీనిపై కొంతమంది కోర్టుకెళ్ళేందుకు సిద్ధపడ్డారు. ఇదే జరిగితే టెండర్ల వ్యవహారంలోని అవకతవకలన్నీ బయటకొస్తాయని, అవినీతి మెడకు చుట్టుకుంటుందని ప్రభుత్వం కంగారు పడి టెండర్లను రద్దు చేసింది. ఈమేరకు ఈ నెల 12వ తేదీన టెండర్లు దక్కించుకున్న ఐదు సంస్థలకు రద్దు చేస్తున్నట్టు లేఖలు పంపింది. అయితే, వీటిని ఎందుకు రద్దు చేస్తున్నారనే విషయం మాత్రం అందులో పేర్కొనకుండా, ‘టెండర్లు రద్దు చేస్తున్నాం’ అనే ఏక వాక్యంతో లేఖలు పంపింది.
దొంగతనం బయటకొస్తుందనే...
టెండర్ల రద్దుపై ఏపీ జెన్‌కో బోర్డులో నెల రోజుల క్రితమే చర్చించారు. బోర్డు నిర్ణయాన్ని అమలు చేయాలని అధికారులు హైడల్ ప్రాజెక్ట్స్ కన్‌స్ట్రక్షన్, అండ్ హైడల్ ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజనీర్‌కు ఏక వాక్య తీర్మానంతో లేఖ పంపారు. వాస్తవానికి బోర్డు మినిట్స్ కూడా ఆయనకు ఇవ్వాల్సి ఉంటుందని, దాని ఆధారంగానే రద్దు లేఖలను తయారు చేసి, అందులో ఎందుకు రద్దు చేస్తున్నారో వివరించాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. లేనిపక్షంలో టెండర్‌దారులు కోర్టుకు వెళ్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని చెబుతున్నారు. కానీ చీఫ్ ఇంజనీర్‌కు మినిట్స్ ఇవ్వకపోవడం, ఆయన కూడా రద్దు లేఖల్లో కారణాలు చెప్పకపోవడం వెనుక పెద్ద గూడుపుఠాణీ ఉందనే అనుమానాలు వస్తున్నాయి.
ప్రభుత్వ సూచన మేరకే టెండర్ నిబంధనలు రూపొందించినట్టు ఏపీ జెన్‌కో బోర్డు మినిట్స్‌లో రికార్డు చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత ఆరోపణలు రావడంతో నిపుణుల కమిటీ వేసినట్టు... సోలార్ టెండర్ల ధరలు ఉద్దేశ్యపూర్వకంగా ఎక్కువగా చూపించినట్టు, దీన్ని ప్రాథమిక దశలోనే త్రోసిపుచ్చితే బాగుండేదని కమిటీ అభిప్రాయపడినట్టు తెలిసింది. అయితే, ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా, సీఎం కార్యాలయం టెండర్లను ఖరారు చేయాల్సిందేనని సూచించినట్టు సమాచారం. టెండర్ల రద్దుకు గల కారణాలను అధికారికంగా రద్దు లేఖల్లో పేర్కొంటే తెరవెనుక ఉన్న ప్రభుత్వ పెద్ద బండారం బయటపడే వీలుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అర్థం పర్థంలేని లేఖను కాంట్రాక్టర్లకు పంపినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఇలాంటి లేఖపై ఆయా కాంట్రాక్టర్లు వివరణ కోరాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్‌ఈఎల్ కూడా ఈ నిబంధన పాటించలేదు. దీన్నిబట్టి బీహెచ్‌ఈఎల్‌తో పాటు మిగతా కాంట్రాక్టర్లు రింగ్ అయినట్టు స్పష్టమవుతోంది. ఏదేమైనా సమాచారం వెల్లడించకుండా చేయడంవల్ల తాము చిక్కుల్లో పడే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన పడుతున్నారు.