రైతులపై ప్రభుత్వం ఉక్కుపాదం
- హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయరా?
- అక్రమ కేసులు ఎలా బనాయిస్తారు?
- గని గ్రామ సోలార్ బాధితుల భారీ ధర్నా
కర్నూలు(న్యూసిటీ): రైతులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని సీపీఐ జిల్లా కార్యదర్శి కె.రామాంజనేయులు, సీపీఎం జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. గని గ్రామ సోలార్ బాధిత రైతులతో కలిసి వారు సోమవారం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..సోలార్ పరిశ్రమ కోసం భూములు తీసుకున్న ప్రభుత్వం కొంతమందికి పరిహారం ఇచ్చి మరికొంత మంది మరవడం దారుణమన్నారు.
బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించగా అనుకూలంగా తీర్పు వచ్చిందని.. అయితే దానిని జిల్లా కలెక్టర్ అమలు చేయడం లేదన్నారు. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడానికి యత్నించిన గడివేముల తహసీల్దార్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం అన్యాయమన్నారు. పరిహారం అందే వరకు పనులు చేయవద్దని బాధిత రైతులు ఆందోళన చేస్తే అక్రమ కేసులు బనాయించారని ధ్వజమెత్తారు.
ప్రభుత్వం..రైతులపై నిర్బంధంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మద్దయ్య ఆరోపించారు. భూములు కోల్పోయిన రైతులందరికీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం అందించి, పునరావాస చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ధర్నాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జి.చెన్నప్ప, సీపీఎం పాణ్యం డివిజన్ అధ్యక్షుడు రామకృష్ణ, సీపీఐ జిల్లా నాయకుడు కె.జగన్నాథం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.