
కేంద్రం హామీలు నిలబెట్టుకోవడంలేదు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం నిలబెట్టుకోలేదని, తాము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అనంతపురంలోని పోలీసు శిక్షణ కళాశాల (పీటీసీ) మైదానంలో సోమవారం నిర్వహించిన 70వ భారత స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి.. వందనం చేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘విభజన చట్టంలో కేంద్రం ఎన్నో వాగ్దానాలు చేసింది. పార్లమెంట్ సాక్షిగా నాటి ప్రధాని ఇచ్చిన ప్రత్యేకహోదా, రైల్వేజోన్ హామీల జాడలేవు.
తొలి ఏడాది రెవెన్యూ లోటు భర్తీ చేయలేదు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా, అందుకు తగ్గట్టుగా నిధులు విడుదల లేదు. రాజధాని నిర్మాణానికి సాయం చేయడంలేదు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడంలో చొరవ లేదు. విభజన చట్టం కాగితం ముక్కలాగా మిగిలింది. ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలని ప్రధానమంత్రిని కోరాను’’ అని కేంద్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. తాము చెప్పిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీ చేశామన్నారు. నూతన రాష్ట్రంలో తొలి, మలి స్వాతంత్య్రదిన వేడుకలు కర్నూలు, విశాఖలో జరుపుకున్నామని, ఈఏడాది ‘అనంత’లో నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే రెండోస్థానంలో ఉన్నామని, విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో మూడోస్థానంలో ఉన్నామన్నారు.
ఫ్రీజోన్‌గా అమరావతి..
మరో రెండు ట్రిపుల్‌ఐటీలు ప్రారంభిస్తున్నామని, ఎయిమ్స్, వ్యవసాయ, ఉర్దూ విశ్వవిద్యాలయాలకు శంకుస్థాపన చేశామని చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ఈ ఏడాది జనవరిలో విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు ద్వారా రూ. 4.75 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నామన్నారు. అమరావతిని ఫ్రీజోన్‌గా చేసి అందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే నగరంగా రూపొందిస్తామన్నారు.
పౌరసరఫరాలకు ప్రథమ బహుమతి
ప్రభుత్వ పథకాలపై ప్రదర్శించిన శకటాల్లో పౌరసరఫరాలశాఖ శకటానికి ప్రథమ బహుమతి దక్కింది. ఉద్యాన శాఖ శకటానికి ద్వితీయ, పరిశ్రమలు, విద్యుత్‌శాఖ శకటాలకు సంయుక్తంగా తృతీయ బహుమతులు లభించాయి.
ఏపీ సచివాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవాలు
సాక్షి,హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం సచివాలయంలోని ఎల్ బ్లాక్ వద్ద ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. శాంబాబ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
సీఎంవోలోనూ..
సాక్షి, అమరావతి: విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర జాతీయ జెండాను ఎగరేసి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో సీఎం కార్యాలయ కార్యదర్శి జి. సాయిప్రసాద్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.