సాక్షి ప్రతినిధి,ఒంగోలు: రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన చెందుతుంటారు. వృథా ఖర్చు తగ్గించి అభివృద్ధికి బాటలు వేయాలని హితబోధ చేస్తారు. అంతేకాదు రాష్ట్రాభివృద్ధికి అందరూ చేయూత నివ్వాలంటూ ఒకడుగు ముందుకేసి చందాలు వసూలు చేస్తారు. కానీ తనుమాత్రం ఆచరించరు. అమరావతి నిర్మాణం కోసం ఒక్కో విద్యార్థి పదిరూపాయలు ఇవ్వాలంటూ చివరకు సెంటిమెంట్‌ను అడ్డుపెట్టి వసూలు చేసిన ఘనత బాబు సర్కార్‌కు దక్కింది. అంతటితో వదలక ఇటుకలు కూడా చందాల రూపంలో సేకరించారు.
రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ తలో చేయి వేయాల్సిందే..! కానీ రాష్ట్రం ఎన్ని కష్టాల్లో ఉన్నా చంద్రబాబు మాత్రం వృథా ఖర్చు తగ్గించుకోరు. ఆద్యంతం ఎంత ఖర్చయినా సరే ఆయన పర్యటనల్లో హంగులు, ఆర్భాటం తగ్గకూడదు. ఇదే అదునుగా అధికారులు పోటీలు పడి మరీ బాబు పర్యటనలకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని తగలేస్తున్నారు. బుధవారం ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఉంది. రెండో విడత రుణమాఫీ పత్రాల పంపిణీ కోసం ఆయన ఒంగోలు వస్తున్నారు. పట్టుమని రెండు గంటలపాటు సభ. ఇందు కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు.
సభా వేదిక, ఆవరణలో సైతం పైకప్పు కార్పొరేట్ స్థాయిలో పర్మినెంట్ స్ట్రక్చర్‌లా నిర్మిస్తున్నారు. ఇందు కోసం అక్షరాలా కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు. హైదరాబాదుకు చెందిన వారికి కాంట్రాక్టు అప్పజెప్పారు. మినీ స్టేడియం ప్రాంతంలో కొత్తరోడ్లు నిర్మిస్తున్నారు. విద్యుత్ సరఫరా కోసం కొత్త ట్రాన్స్‌ఫార్మర్లతోపాటు పెద్ద జనరేటర్లను సిద్ధం చేశారు. నగరంలో ప్రధాన రోడ్ల డివైడర్ల లో మొక్కలు నాటి వాటికి ట్రీగార్డ్సు ఏర్పాటు చేస్తున్నారు. వాటికి పచ్చరంగులు అద్దారు.
ఏడాది క్రితమే డివైడర్లకు రంగులు వేసినా సీఎం పర్యటన సాకుతో మరోమారు పచ్చరంగు వేస్తున్నారు. ఇందు కోసం లక్షల్లో వెచ్చిస్తున్నారు. ఇక జనాల తరలింపునకు వందలాది వాహనాలు ఏర్పాటు చేసి తద్వారా పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు. బాబు రాక ఇక్కడి పచ్చనేతలకు కాసులు కురిపిస్తోంది.
మరోవైపు నగరంలో చాలా ప్రాంతాల్లో డ్రైనేజీలు కూడా శుభ్రం చేయక మురికి పేరుకుపోయింది. ప్రజలు దుర్గంధం, దోమలతో అల్లాడుతున్నా పట్టించుకోని కార్పొరేషన్ అధికారులు అన్నీ గాలికి వదలి అయిదు రోజులుగా సీఎం సభ ఏర్పాట్లలో తరిస్తున్నారు. అధికార పార్టీ నేతలు చెప్పిన వారి ఇళ్లు కూలగొట్టడం, పచ్చ చొక్కా నేతలకు నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు కట్టించడం తప్ప ఒంగోలు కార్పొరేషన్ అధికారులు ప్రజల సంగతి గాలికి వదిలారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2గంటలు 2 కోట్లు
Published Tue, Jun 21 2016 4:42 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement