జిల్లా వ్యాప్తంగా 200 మందికిపైగా బైండోవర్
సీఎం స్వగ్రామం కార్యకర్తలు
వెళ్లకుండా అడ్డుకట్ట
అయినా వెళ్లేందుకు కొందరు నేతల యత్నం
ప్రజాస్వామ్యం ఖూనీ :బ్రహ్మయ్య మాదిగ
ఒంగోలు క్రైం : ఎస్సీల రిజర్వేషన్ వర్గీకరణ కోసం సీఎం చంద్రబాబు స్వగ్రామం చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో సమరభేరి మోగించాలనుకున్న ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ ఈ నెల 10న సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె ముట్టడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా రెండు రోజులుగా పోలీసు యంత్రాంగం ఎమ్మార్పీఎస్ నాయకుల కదలికలపై డేగ కన్ను వేసింది. శనివారం, ఆదివారాల్లో మొత్తం 200 మందికిపైగా ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుంది. ఒక్క ఒంగోలు నగరంలోనే దాదాపు 50 మందికిపైగా నాయకులు, కార్యకర్తలను బైండోవర్ చేయించుకున్నారు.
కొన్ని చోట్ల నేరుగా పోలీసుస్టేషన్లలోనే బైండోవర్ చేయగా జిల్లాలోని మరికొన్ని చోట్ల తహసీల్దార్ల ముందు హాజరు పరిచి బైండోవర్ చేయించుకున్నారు. నారావారిపల్లెకు వె ళ్తే నాన్ బెయిల్‌బుల్ కేసులు పెడతామన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది. చంద్రబాబు గత ప్రభుత్వంలోనే ఎస్సీలను వర్గీకరిస్తామని చెప్పి మోసం చేశాడంటూ ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ కొన్నేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే.
రథయూత్రకు బ్రేకులు
అందులో భాగంగా వర్గీకరణ సాధించుకునేందుకు చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె నుంచి రథయాత్ర చేపట్టాలని ఎమ్మెర్పీఎస్ నేతలు తీర్మానించారు. అందుకు ఈ నెల 10న ముహూర్తంగా నిర్ణయించారు. ఆ కార్యక్రమానికి వెళ్లకుండా కార్యకర్తలను అడ్డుకోవాలని పోలీసులపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. జిల్లా నుంచి ఒక్క కార్యకర్త కూడా నారావారిపల్లెకు వెళ్లకూడదని డీఎస్పీలను ఆదేశించింది. పోలీసుస్టేషన్లవారీగా ఎవరెవరు రథయాత్రకు వెళుతున్నారన్న సమాచారాన్ని నిఘా వ్యవస్థ ద్వారా సమాచారం తెప్పించుకున్న జిల్లా పోలీస్ యంత్రాంగం.. అన్ని పోలీసుస్టేషన్ల హెచ్‌ఎస్‌ఓలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అందులో భాగంగా ఎమ్మార్పీఎస్‌లో చురుకుగా పనిచేసే కార్యకర్తలు, నాయకులను లక్ష్యంగా చేసుకొని రెండు రోజులుగా వారి కదలికలపై నిఘా ఉంచింది. కొంతమంది ఏ విధంగానైనా నారావారిపల్లెకు చేరుకోవాలని నిర్ణయించుకొని ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ ప్రభుత్వ చర్య ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయటమేనని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.