సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష పోరాటానికి దిగింది. ‘సేవ్ డెమోక్రసీ (ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి)’ అంటూ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులన్నీ శనివారం కాకినాడకు కదిలిరానున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఇచ్చిన తీర్పును పరిహసించేలా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఫిరాయింపునకు ప్రోత్సహిస్తున్న చంద్రబాబు తీరును ఎండగట్టనున్నాయి.
చట్టాలు చేయాల్సిన ప్రభుత్వాధినేతే ఉన్న చట్టాలకు స్వయంగా తూట్లు పొడవడాన్ని నిరసిస్తూ శనివారం సాయంత్రం 6 గంటలకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు వెల్లడించారు. తొలుత కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్‌కు సమీపంలోని కోకిల సెంటర్‌లోనున్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నాయకులు నివాళి అర్పించనున్నట్లు చెప్పారు.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ కోకిల సెంటర్ నుంచి భానుగుడి జంక్షన్ వరకూ కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తామన్నారు. పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా కమిటీల నాయకులు, అనుబంధ సంఘాల నేతలు పాల్గొంటారని తెలిపారు. ప్రజలు కూడా భారీ ఎత్తున పాల్గొని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
టీడీపీ నాయకులది భ్రమే
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరాటపటిమలను మెచ్చే ప్రజలు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారని కన్నబాబు అన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ప్రజాస్వామ్యానికి చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారని దుయ్యబట్టారు. పది మంది ఎమ్మెల్యేలను లాక్కొన్నంత మాత్రాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలహీనమవుతుందని టీడీపీ నాయకులు భావిస్తున్నారని, వారిది కేవలం భ్రమ మాత్రమేనని అన్నారు. కానీ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ పొరుగు రాష్ట్రాల దృష్టిలో రాష్ట్రాన్ని చులకన చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలను రకరకాలుగా ప్రలోభపెట్టి లాక్కొని తన బలంగా చూపించుకోవడానికి చంద్రబాబు పడుతున్న పాట్లు చూసి ఇతర రాష్ట్రాల నాయకులంతా నవ్వుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా నియోజకవర్గ అభివృద్ధి ముసుగులో పార్టీ ఫిరాయిస్తున్న నాయకులు కూడా ప్రజల్లో చులకనైపోయారని వ్యాఖ్యానించారు. ప్రజలంతా ప్రజాస్వామ్య పరిరక్షణకు సమష్టిగా పోరాడాలని కన్నబాబు పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు.. పోరుబాట
Published Sat, Apr 23 2016 12:48 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM
Advertisement