పరిశ్రమల ఏర్పాటుకు సహకరించండి
► ఐటీసీ సంస్థ చైర్మన్‌ను కోరిన
► సీఎం చంద్రబాబు
కొరిటెపాడు(గుంటూరు): రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఐటీసీ సంస్థ సహకారించాలని సీఎం చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేశారు. రింగ్‌రోడ్డులో ఐటీసీ సంస్థ నూతనంగా రూ.145 కోట్లతో నిర్మించనున్న మై ఫార్చ్యూన్ హోటల్‌కు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. 1996లో రూ.5 వేల కోట్ల వ్యాపార లావాదేవీలు కలిగి ఉన్న ఐటీసీ కంపెనీ, 2014 నాటికి రూ.46 వేల కోట్ల టర్నోవర్‌కు తీసుకురావటంలో సంస్థ సీఈవో వైసీ దేవేశ్వర్ కృషి దాగి ఉందని చెప్పారు. పొగాకు ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలపై ఐటీసీ కంపెనీ దృష్టి సారించిందని, 32 వేల మందికి ఉపాధి కల్పిస్తోందని తెలిపారు. తిరుపతిని సిటీ ఆఫ్ లేక్స్‌గా గుర్తిస్తున్నారని, తిరుమలలో బాలాజీని కింగ్ ఆఫ్ గాడ్స్‌గా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ప్రపంచంలోనే రొయ్యల ఎగుమతుల్లో ఏపీని ప్రథమ స్థానంలో నిలబెట్టాలనేదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.
గుంటూరు జిల్లాలో టెక్స్‌టైల్, సిమెంట్ రంగాలకు మంచి అవకాశాలున్నాయని తెలిపారు. లండన్‌లోని బ్రిటీష్ మ్యూజియంలో అమరావతి విశిష్టతను ప్రతిబింబించే వందల శిల్పాలు ఉన్నాయన్నారు. ఐటీసీ సంస్థ చైర్మన్ వైసీ దేవేశ్వర్ మాట్లాడుతూ నవ్యాంధ్రలో పెట్టుడులకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మిరపలో ఫెస్టిసైడ్స్, కెమికల్స్ అధిక శాతం ఉన్నట్లు గుర్తించామన్నారు. రొయ్యల ఎగుమతికి సంస్థ ప్రాధాన్యమిస్తోందని వెల్లడించారు. సంస్థ వివిధ రంగాల్లో 40 బిలియన్ డాలర్లు మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిందని వెల్లడించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం మైఫార్చ్యూన్ హోటల్ శంస్థాపన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు, గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్, రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, ఎమ్మెల్సీ రామకృష్ణ, జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే, ఐటీసీ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.