కృష్ణమ్మకు హారతులతో పుష్కరుడికి స్వాగతం | welcomes to pushakaralu with krishnamma to harati | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మకు హారతులతో పుష్కరుడికి స్వాగతం

Published Fri, Aug 12 2016 3:56 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM

కృష్ణమ్మకు హారతులతో పుష్కరుడికి స్వాగతం - Sakshi

కృష్ణమ్మకు హారతులతో పుష్కరుడికి స్వాగతం

* లక్ష ఒత్తుల హారతిచ్చిన చంద్రబాబు
* బోయపాటి శ్రీను బృందం లేజర్ షో

సాక్షి, విజయవాడ: బృహస్పతి కన్యారాశిలోకి ప్రవేశించే సమయంలో కృష్ణానదికి పుష్కరాలు వస్తాయని పండితులు చెబుతారు. గురువారం రాత్రి 9.30 గంటల శుభముహూర్తంలో పవిత్ర కృష్ణానదిలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై నుంచి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అర్చకులు నవహారతులు ఇవ్వడంతో పాటు కృష్ణమ్మను పూజించి పుష్కరుడ్ని ఆహ్వానించారు. అంతకు ముందు తొమ్మిది గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భార్య భువనేశ్వరితో కలసి  కృష్ణా-గోదావరి సంగమ ప్రదేశానికి వచ్చారు.

అక్కడే ఏర్పాటు చేసిన నమూనా దేవాలయాల్లోని శ్రీ దుర్గమ్మవారితో పాటు ఇతర దేవతామూర్తులు దర్శించుకుని పూజించారు. అక్కడ నుంచి కృష్ణానదీ తీరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశానికి వచ్చి కృష్ణమ్మకు లక్షఒత్తుల హారతిని ఇచ్చారు. గోదావరి-కృష్ణా సంగమాన్ని సినీదర్శకుడు బోయపాటి శ్రీను బృందం రంగురంగుల బాణసంచాతో, విద్యుత్ దీపాలతో సందర్శకుల్ని ఆకట్టుకునేలా వివరించారు. చంద్రబాబు లక్షఒత్తుల హారతి ఇవ్వగానే ఆకాశంలో మిరమిట్లుగొలిపేలా, రంగురంగుల విద్యుత్ కాంతులతో, అనేక రకాల శబ్దాలతోబాణసంచాను కాల్చారు.

కృష్ణానదిపై లేజర్ షోను ప్రదర్శించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు తనయుడు లోకేష్, మంత్రులు పి.మాణిక్యాలరావు, అచ్చెన్నాయుడు, నారాయణ, దేవినేని ఉమా, కొల్లురవీంద్ర, ఎంపీ కేశినేని శ్రీనివాస్, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ పాల్గొన్నారు.
 
మొదలైన కృష్ణా పుష్కరాలు
సాక్షి, అమరావతి: పుష్కరుడు కృష్ణా నదిలోకి ప్రవేశించాడు. పుణ్యస్నానాలకు కృష్ణవేణి సిద్ధమైంది. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కృష్ణా -గోదావరి సంగమం ప్రాంతంలో గురువారం రాత్రి కృష్ణా హారతి ఆరంభంతో పుష్కర వేడుకలకు ప్రభుత్వం నాంది పలికింది.
 
పిండ ప్రదానం పూజ ధర రూ. 300
కృష్ణా పుష్కరాల సందర్భంగా పిండ ప్రదానం పూజకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 300 ధరను నిర్ణయించింది. పిండ ప్రదానంతో పాటు పుష్కర స్నాన ఘాట్ల వద్ద జరిగే వివి ద రకాల పూజలకు రాష్ట్ర ప్రభుత్వం ధరలను నిర్ణయించింది. ఘాట్ల వద్ద పూజల నిర్వహణకు  దేవాదాయ శాఖ ప్రత్యేకంగా పాస్‌లు జారీ చేయడంతోపాటు భక్తుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే పూజా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. పూజను బట్టి మహా సంకల్పం, సరిగంగ స్నానం, ప్రాయశ్చితం, గౌరీ పూజ, గంగ పూజ- రూ.150 చొప్పున ధర నిర్ణయించారు. స్వయంపాకం/పోతారు- మూ సివాయనం పూజకు రూ. 200 ధరగా నిర్ణయించారు. పూజా సామగ్రి కిట్లను ఘాట్ల వద్దే చౌక ధరలకు విక్రయించేందుకు ప్రత్యేకంగా డ్వాక్రా బజార్లను ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement