పట్టిసీమలో పంపుల పూజ
చెప్పిన సమయానికి ఒక్క పంపూ పూర్తికాని వైనం
* విజయవాడ సమీపంలో కృష్ణా నది ఒడ్డున ప్రత్యేక పూజలు..
* తాడిపూడి నీరు.. వర్షాలవల్ల కలసిన నీరు కుడికాలువ ద్వారా కృష్ణానదికి చేరిన వైనం..
* దాంతోనే కృష్ణా-గోదావరి నదుల అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసినట్టు ఘనంగా ప్రకటన
సాక్షి ప్రతినిధి, ఏలూరు, పోలవరం: రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభం అపహాస్యంగా మారింది. పనులు పూర్తి చేయకుండానే గత నెలలో ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన రీతిలోనే..
ఈ పట్టిసీమ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించేశారు. బుధవారం పట్టిసీమ పథకానికి సంబంధించిన ఒక మోటార్‌ను సీఎం స్విచాన్ చేసి ప్రారంభించాల్సి ఉంది. పంపు బిగించే పని కొలిక్కిరాకపోవడం.. మోటార్ అమర్పూ పూర్తి కాకపోవడంతో పట్టిసీమ నుంచి చుక్కనీటినీ పోలవరం కుడికాలువలోకి ఎత్తిపోసే పరిస్థితి లేకపోయింది. దీంతో మొదటి పంపు వద్ద పూజలతో సీఎం సరిపెట్టారు.
బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు పట్టిసీమకు చేరుకున్న ముఖ్యమంత్రి 4.05 గంటలకు మొదటి పంపు వద్ద పూజలు నిర్వహించి వెనుదిరిగారు. మరోవైపు విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నది ఒడ్డున కృష్ణా-గోదావరి నదుల అనుసంధానాన్ని బుధవారం ఆర్భాటంగా నిర్వహించారు. తాడిపూడి నుంచి వదిలిన గోదావరి నీరు.. వర్షాల కారణంగా వాగులు పొంగి కలసిన నీరు కుడికాలువ ద్వారా కృష్ణా నదికి చేరగా.. దాంతోనే రెండు నదుల అనుసంధానం చేసినట్టు ఘనంగా ప్రకటించుకున్నారు.
వరుస మారిన ప్రారంభాలు..
నిజానికి సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం 9.45 గంటలకు పట్టిసీమను ప్రారంభించాల్సి ఉంది. అనంతరం విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానది ఒడ్డున నదుల అనుసంధాన కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. పట్టిసీమ పనులు కొలిక్కి రాకపోవడం.. సాయంత్రం వరకు మోటారు బిగించే పరిస్థితి లేదని అధికారులు చెప్పడంతో సీఎం కార్యక్రమంలో మార్పులు జరిగాయి. దీంతో తొలుత కృష్ణా జిల్లాలో నదుల అనుసంధాన కార్యక్రమాన్ని ముగించుకుని సాయంత్రం సీఎం పట్టిసీమకు చేరుకున్నారు.
అప్పటికీ.. పనులు కొలిక్కి రాలేదు. దీంతో మొదటి పంపు వద్ద పూజలతో సరిపెట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పైపులైను పనులను పూర్తి చేసి రాత్రికి ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టిసీమ ద్వారా నీటిని విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు.12 ఏళ్లక్రితం తిరుపతి బ్రహ్మోత్సవాల సమయంలో తనపై హత్యాయత్నం జరిగిందని, అధికారంలోకి వచ్చాక మళ్లీ అదే బ్రహ్మోత్సవాల ప్రారంభానికి వెళ్లే ముందు పట్టిసీమతో ఓ మహత్‌కార్యానికి శ్రీకారం చుట్టానని చెప్పారు. ఐదునెలల 19 రోజుల్లో పట్టిసీమ ఎత్తిపోతల పథకం తొలివిడత నిర్మాణం పూర్తి చేయడం ఒక చరిత్ర అని పేర్కొన్నారు. దేశంలోనే నదుల అనుసంధానానికి ఇది చరిత్రగా నిలుస్తుందని చెప్పారు.
పట్టిసీమ వేగంతో పోలవరం పనులు..
సాక్షి, విజయవాడ బ్యూరో: ‘‘ఇకపై ఫోకస్సంతా పోలవరంపైనే. పట్టిసీమ పనుల్ని ఎంత స్పీడ్‌గా చేయించామో, అంతే వేగంతో పోలవరం పనులనూ చేపడతాం. 2018 ఖరీఫ్ నాటికి పొలాలకు ప్రాజెక్టు నీళ్లొచ్చేలా చేస్తాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పోలవరం మన కల అని, దాన్ని సాధించి తీరుతామని, నిధుల విషయంలో కేంద్రం నుంచి పూర్తి సహకారముందని చెప్పారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం సెంటర్‌లో నిర్మించిన కృష్ణా-గోదావరి నదుల అనుసంధాన పైలాన్‌ను సీఎం చంద్రబాబు బుధవారం ప్రారంభించారు.
అనంతరం అక్కడకు సమీపంలోని కృష్ణానది ఒడ్డున కృష్ణా-గోదావరి సంగమ ప్రదేశంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి అక్కడ ఏర్పాటు చేసిన కృష్ణా-గోదావరి అనుసంధాన సభలో మాట్లాడారు. పట్టిసీమ ద్వారా కృష్ణా-గోదావరి నదుల పవిత్ర సం గమం జరిగిందని చెప్పారు. వారానికో పంప్ చొప్పున పట్టిసీమను సిద్ధం చేసి అనుకున్న లక్ష్యం మేరకు గోదావరి జలాల్ని కృష్ణాకు తరలిస్తామని పేర్కొన్నారు.
కరువు రహిత రాష్ట్రంగా మార్చేదాకా విశ్రమించను..
రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చేవరకూ విశ్రమించరాదని తాను సంకల్పం తీసుకున్నట్లు సీఎం చెప్పారు. పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు సాగునీటి సమస్య తొలగుతుందని, వచ్చే ఏడాది జూలై నెలాఖరుకల్లా వరినాట్లు వే సుకునేలా చేస్తామన్నారు. హంద్రీ-నీవా పనులు పూర్తి చేసి ఈ ఏడాదే కుప్పం నియోజకవర్గానికి నీళ్లిచ్చేందుకు ప్రణాళికలు తయారు చేశామన్నారు. రాజధాని కడతామంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయంటూ.. మంచి చెబితే వింటానని, అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం ఖబడ్దార్ అని హెచ్చరించారు.