మంత్రులతో తిట్టించడం కాదు..
పట్టిసీమపై సీఎంకు మాజీ ఎంపీ ఉండవల్లి లేఖ
సాక్షి, హైదరాబాద్: పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణంతోపాటు వివిధ అంశాలపై తాను లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రులతో తిట్టించడం కాదు.. సూటిగా జవాబివ్వండి అంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సీఎం చంద్రబాబును కోరారు. ఈ మేరకు ఆయన సీఎంకు ఆదివారం లేఖరాశారు. ‘‘పట్టిసీమ గురించి నాలాంటి వారేదైనా మాట్లాడితే కారుకూతలంటారు. అసెంబ్లీలో ప్రతిపక్షం ప్రశ్నిస్తే.. లక్ష కోట్లు దిగమింగిన మీకు మాట్లాడే అర్హత లేదంటారు.
వట్టి వసంత్‌కుమార్ లాంటివారు పట్టిసీమపై హైకోర్టులో అభ్యంతరాలు లేవనెత్తితే ఆరునెలలైనా కౌంటర్ దాఖలు చేయరు. పాలనలో ఇక మీరు చెప్పే పారదర్శకతకు అర్థమేమిటో మాకర్థం కావట్లేదు’’ అని అన్నారు. ‘‘పట్టిసీమ విషయంలో.. గుడ్డిగూడెం దగ్గర పోలవరం కుడికాల్వలోకి తాడిపూడి నుంచి విడుదలయ్యే నీటిని కలిపారన్నది యథార్థం. 24 పంపులతో 8,500 క్యూసెక్కుల నీటిని పంపు చేయాలన్న పట్టిసీమ ప్రాజెక్టులో ఒకటో, రెండో పంపులు సెప్టెంబర్ 15కు పనిచేస్తాయని మీరే చెబుతున్నారు.
2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి పట్టిసీమ లిఫ్ట్ ద్వారా 80 టీఎంసీలను కృష్ణాలోకి మళ్లిస్తామనేది మీ ఆలోచన. ఈ మూడేళ్ల ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 2015 వరద సమయం అయిపోయింది. ఇక 2016లో నీళ్లు పంపు చేయాలి. ఇది తాత్కాలిక ప్రాజెక్టు. అదీ పదిశాతం పూర్తవకుండా ‘జాతికి అంకితం’ అనే హడావుడి ఎందుకు చేస్తున్నారనే నేను ప్రశ్నిస్తున్నాను’’ అని ఉండవల్లి పేర్కొన్నారు.