కరువు రహిత రాష్ట్రంగా చేస్తా
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్‌ను కరువు రహిత రాష్ర్టంగా తీర్చిదిద్దుతానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలోని నదుల్ని అనుసంధానించి సాగునీటి ఇక్కట్లు లేకుండా చేస్తానన్నారు. కేవలం ఐదునెలల 15 రోజుల వ్యవధిలో పూర్తిచేసిన పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల 16న ప్రారంభిస్తానని, తద్వారా గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తానని చెప్పారు. ఏపీలోని విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర వద్ద గురువారం తోటపల్లి ప్రాజెక్టును ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
ఈ ప్రాజెక్టుకు స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న పేరు పెట్టారు. సీఎం మాట్లాడుతూ.. గౌతులచ్చన్న పేరు పెట్టడం ఆనందదాయకమన్నారు. 2003లో తాను శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును మళ్లీ తానే ప్రారంభించడం, అదీ తన వివాహం రోజున ఈ కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. జీవితంలో ఇది మరిచిపోలేని రోజని చెప్పారు.
నాటి పాలకుల అశ్రద్ధవల్లే జాప్యం..
ఈ ప్రాజెక్టుద్వారా రెండేళ్లలో నీరిస్తానని శంకుస్థాపనప్పుడు చెప్పానని, కానీ పదేళ్లైనా పూర్తికాకపోవడం బాధాకరమని ఏపీ సీఎం అన్నారు. దీనిద్వారా విజయనగరం జిల్లాలో పది, శ్రీకాకుళం జిల్లాలో ఏడుమండలాలకు నీరందుతుందన్నారు. దీనిపై ఆనాటి పాలకులు అశ్రద్ధ వహించారన్నారు. తనపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఈ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలన్నారు.
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని వంశధార, నాగావళి నదుల్ని అనుసంధానిస్తే శాశ్వతంగా కరువు ఉండదన్నారు. అవసరమైతే గోదావరి ఎడమ కాలువవద్ద ఎత్తిపోతలద్వారా ఈ జిల్లాకు నీరందిస్తానని హామీఇచ్చారు.
విమానాశ్రయంతో విజయనగరం అభివృద్ధి
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వల్ల విశాఖకంటే విజయనగరం జిల్లా అభివృద్ధి చెందుతుందని ఏపీ సీఎం అన్నారు. తనపై నమ్మకముంచి ఎయిర్‌పోర్టుకోసం భూములివ్వాలని రైతుల్ని కోరారు. ఈ విషయంలో విపక్షాల మాటల్ని నమ్మవద్దన్నారు. రాష్ట్రంలో భూసేకరణ అవసరమన్నారు. భూములిచ్చిన రైతులకు పునరావాసం కల్పిస్తామన్నారు. అభివృద్ధి జరిగితేనే సంపదతోపాటు భూముల విలువా పెరుగుతుందన్నారు.
తన తండ్రి జ్ఞాపకార్థం తోటపల్లి ప్రాజెక్టుకు గౌతులచ్చన్న పేరుపెట్టడం అభినందనీయమని శ్రీకాకుళంజిల్లా సోంపేట ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్ శివాజి అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వంశధార ప్రాజెక్టుకు తన తండ్రి పేరుపెట్టాలని అసెంబ్లీలో చర్చ జరిగిందని, అప్పటికే మరొకరి పేరు పెట్టడంతో తోటపల్లికి గౌతులచ్చన్న పేరు పెడదామని వైఎస్సార్ హామీఇచ్చారని, అదిప్పుడు సాకారమవడం సంతోషదాయకమన్నారు.
వ్యవసాయంతో అంత ఆదాయం రాదు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వ్యవసాయాన్ని ఎంత అభివృద్ధి చేసినా అంత ఆదాయం రాదని, ఆ రంగంలో ఒక స్థాయి వరకే వృద్ధి సాధించగలమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల సమీపంలోని లక్ష్మీపురంలో రాజు వేగేశ్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.15కోట్లతో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రిహేబిలిటేషన్ ఫర్ డిజేబుల్డ్(విర్డ్) ఆసుపత్రిని గురువారం ఆయన ప్రారంభించారు.
అనంతరం జరిగిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘పంట వేసిన తర్వాత రైతులకు దిగుబడి వస్తుందన్న నమ్మకం లేదు. పంటచేతికొచ్చినా గిట్టుబాటు ధర సమస్య వస్తోంది’ అని అన్నారు. పరిశ్రమల స్థాపనతోనే సంపద, ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
పశ్చిమను విస్మరిస్తున్నారు..
రాజు వేగేశ్న ఫౌండేషన్ చైర్మన్ అనంత కోటి
పశ్చిమగోదావరి జిల్లాను విస్మరిస్తున్నారని రాజు వేగేశ్న ఫౌండేషన్ చైర్మన్ అనంతకోటి రాజు బహిరంగసభలో సూటిగా మాట్లాడటంతో సీఎం ఒకింత ఇబ్బందికి గురయ్యారు. ‘జిల్లా నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎంతమంది ఉన్నా మీకు చెప్పేందుకు మొహమాట పడుతున్నారు. అభివృద్ధి అంతా విజయవాడ, అమరావతిలకు తరలిపోతోంది. మేం రాజధాని కావాలని అడగం. కనీసం భీమవరం ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌గా ప్రకటించండి’ అని ఆయన సీఎంకు సూచించారు. వెంటనే సీఎం మైకు తీసుకుని.. భూముల కొరత ఉందని, దాని గురించి తర్వాత మాట్లాడతానని అన్నారు.