Drought-Free State
-
కరువు రహిత రాష్ట్రంగా చేస్తా
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్‌ను కరువు రహిత రాష్ర్టంగా తీర్చిదిద్దుతానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలోని నదుల్ని అనుసంధానించి సాగునీటి ఇక్కట్లు లేకుండా చేస్తానన్నారు. కేవలం ఐదునెలల 15 రోజుల వ్యవధిలో పూర్తిచేసిన పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల 16న ప్రారంభిస్తానని, తద్వారా గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తానని చెప్పారు. ఏపీలోని విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర వద్ద గురువారం తోటపల్లి ప్రాజెక్టును ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టుకు స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న పేరు పెట్టారు. సీఎం మాట్లాడుతూ.. గౌతులచ్చన్న పేరు పెట్టడం ఆనందదాయకమన్నారు. 2003లో తాను శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును మళ్లీ తానే ప్రారంభించడం, అదీ తన వివాహం రోజున ఈ కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. జీవితంలో ఇది మరిచిపోలేని రోజని చెప్పారు. నాటి పాలకుల అశ్రద్ధవల్లే జాప్యం.. ఈ ప్రాజెక్టుద్వారా రెండేళ్లలో నీరిస్తానని శంకుస్థాపనప్పుడు చెప్పానని, కానీ పదేళ్లైనా పూర్తికాకపోవడం బాధాకరమని ఏపీ సీఎం అన్నారు. దీనిద్వారా విజయనగరం జిల్లాలో పది, శ్రీకాకుళం జిల్లాలో ఏడుమండలాలకు నీరందుతుందన్నారు. దీనిపై ఆనాటి పాలకులు అశ్రద్ధ వహించారన్నారు. తనపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఈ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలన్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని వంశధార, నాగావళి నదుల్ని అనుసంధానిస్తే శాశ్వతంగా కరువు ఉండదన్నారు. అవసరమైతే గోదావరి ఎడమ కాలువవద్ద ఎత్తిపోతలద్వారా ఈ జిల్లాకు నీరందిస్తానని హామీఇచ్చారు. విమానాశ్రయంతో విజయనగరం అభివృద్ధి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వల్ల విశాఖకంటే విజయనగరం జిల్లా అభివృద్ధి చెందుతుందని ఏపీ సీఎం అన్నారు. తనపై నమ్మకముంచి ఎయిర్పోర్టుకోసం భూములివ్వాలని రైతుల్ని కోరారు. ఈ విషయంలో విపక్షాల మాటల్ని నమ్మవద్దన్నారు. రాష్ట్రంలో భూసేకరణ అవసరమన్నారు. భూములిచ్చిన రైతులకు పునరావాసం కల్పిస్తామన్నారు. అభివృద్ధి జరిగితేనే సంపదతోపాటు భూముల విలువా పెరుగుతుందన్నారు. తన తండ్రి జ్ఞాపకార్థం తోటపల్లి ప్రాజెక్టుకు గౌతులచ్చన్న పేరుపెట్టడం అభినందనీయమని శ్రీకాకుళంజిల్లా సోంపేట ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్ శివాజి అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వంశధార ప్రాజెక్టుకు తన తండ్రి పేరుపెట్టాలని అసెంబ్లీలో చర్చ జరిగిందని, అప్పటికే మరొకరి పేరు పెట్టడంతో తోటపల్లికి గౌతులచ్చన్న పేరు పెడదామని వైఎస్సార్ హామీఇచ్చారని, అదిప్పుడు సాకారమవడం సంతోషదాయకమన్నారు. వ్యవసాయంతో అంత ఆదాయం రాదు సాక్షి ప్రతినిధి, ఏలూరు: వ్యవసాయాన్ని ఎంత అభివృద్ధి చేసినా అంత ఆదాయం రాదని, ఆ రంగంలో ఒక స్థాయి వరకే వృద్ధి సాధించగలమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల సమీపంలోని లక్ష్మీపురంలో రాజు వేగేశ్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.15కోట్లతో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రిహేబిలిటేషన్ ఫర్ డిజేబుల్డ్(విర్డ్) ఆసుపత్రిని గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘పంట వేసిన తర్వాత రైతులకు దిగుబడి వస్తుందన్న నమ్మకం లేదు. పంటచేతికొచ్చినా గిట్టుబాటు ధర సమస్య వస్తోంది’ అని అన్నారు. పరిశ్రమల స్థాపనతోనే సంపద, ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పశ్చిమను విస్మరిస్తున్నారు.. రాజు వేగేశ్న ఫౌండేషన్ చైర్మన్ అనంత కోటి పశ్చిమగోదావరి జిల్లాను విస్మరిస్తున్నారని రాజు వేగేశ్న ఫౌండేషన్ చైర్మన్ అనంతకోటి రాజు బహిరంగసభలో సూటిగా మాట్లాడటంతో సీఎం ఒకింత ఇబ్బందికి గురయ్యారు. ‘జిల్లా నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎంతమంది ఉన్నా మీకు చెప్పేందుకు మొహమాట పడుతున్నారు. అభివృద్ధి అంతా విజయవాడ, అమరావతిలకు తరలిపోతోంది. మేం రాజధాని కావాలని అడగం. కనీసం భీమవరం ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌గా ప్రకటించండి’ అని ఆయన సీఎంకు సూచించారు. వెంటనే సీఎం మైకు తీసుకుని.. భూముల కొరత ఉందని, దాని గురించి తర్వాత మాట్లాడతానని అన్నారు. -
పట్టిసీమతో చరిత్ర సృష్టిస్తాం
పట్టిసీమ ఎత్తిపోతల శంకుస్థాపన సభలో చంద్రబాబు పనులు పూర్తయ్యే వరకు ప్రాజెక్టు వద్దే పడుకుంటానని వ్యాఖ్య (పోలవరం నుంచి సాక్షి ప్రతినిధి) పశ్చిమగోదావరి జిల్లాలోని పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తిచేసి చరిత్ర సృష్టిస్తామని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు చెప్పారు. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలోని పట్టిసీమ వద్ద గోదావరి జలాలను కృష్ణానదికి తరలించేందుకు రూపొందించిన ఎత్తిపోతల పథకానికి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగసభలో బాబు సుదీర్ఘంగా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలుగా నిలిచే ఉభయగోదావరి జిల్లాల రైతులకు ఎట్టి పరిస్థితుల్లోను అన్యాయం చే యబోమని, సముద్రంలోకి వృథాగా పోతున్న వరద నీటిని మాత్రమే పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు తరలిస్తామని చెప్పారు. రెండు జిల్లాల్లో నీటి అవసరాలు తీరిన తర్వాత, ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతి ఎకరం తడిపిన తర్వాతే మిగులు జలాలను పట్టిసీమ ద్వారా మళ్లిస్తామన్నారు. అది కూడా గోదావరిలో 14 మీటర్లు పైబడిన వరద నీటిని మాత్రమే తరలిస్తామని పేర్కొన్నారు. వాస్తవానికి ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 13.67 మీటర్ల ఎత్తువరకు నీళ్లుంటే గోదావరి జిల్లాల డెల్టా ప్రాంతానికి సరిపడా సాగు, తాగునీరు అందుతుందని చెప్పారు. పట్టిసీమతో పాటు రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులూ వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు అవసరమైతే తాను గతంలో చేసిన పాదయాత్రలో మాదిరిగా ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు అక్కడే పడుకుంటానని వ్యాఖ్యానించారు. పోలవరం నాలుగేళ్లలో పూర్తి కేంద్రం సహకారంతో పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తిచేస్తామని చంద్రబాబు ప్రకటించారు. పోలవరం పూర్తయ్యేలోగా గోదావరి డెల్టాలో రబీ సాగుకు ఇబ్బందులు తలెత్తకుండా సీలేరు జలాలను ఉపయోగిస్తామన్నారు. అవసరమైతే సీలేరులో విద్యుత్ ఉత్పత్తిని కూడా నిలిపేసి గోదావరి జిల్లాలకు నీరు తరలిస్తామని చెప్పారు. ధాన్యం అమ్మిన రైతులకు 48 గంటల్లోనే సొమ్ము బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నా వల్లే తెలంగాణ ముందుంది.. విభజనతో దివాళా తీసిన రాష్ట్రానికి ఉదారంగా నిధులిచ్చి ఆదుకోవాలని చంద్రబాబు తన ప్రసంగంలో పదేపదే కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రం సహకరిస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, తన హయాంలో హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి వల్లే ఇప్పుడు తెలంగాణ రాష్ర్టం ఆదాయంలో ముందుందని చెప్పారు. కేంద్రం సహకారంతో రాష్ట్రాభివృద్ధికి పూర్తి విజన్‌తో ముందుకెళుతున్నామన్నారు. సొంతూరు కంటే నాకు పశ్చిమగోదావరే ఎక్కువ మా సొంత జిల్లా, సొంతూరు కంటే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో గెలిపించిన పశ్చిమగోదావరి జిల్లానే తనకు ఎక్కువని చెప్పారు. ఎప్పటికీ జిల్లాకు రుణపడి ఉంటానని పదేపదే పేర్కొన్న చంద్రబాబు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. ప్రతిష్టాత్మక నిట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ను ఈ జిల్లాలోనే నెలకొల్పుతామని, చేపల, రొయ్యల ఎగుమతులను ప్రోత్సహించేందుకు మెరైన్ యూనివర్సిటీని కూడా పశ్చిమలోనే నెలకొల్పుతామని ప్రకటించారు. ‘సాక్షి’పై అక్కసు సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో ‘సాక్షి’ దినపత్రికపై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. ప్రజలను మభ్యపెట్టేందుకు తప్పుడు వార్తలు రాస్తున్నారు.చేసిన అవినీతికి ఆస్తులు అటాచ్మెంట్లు చేసే పరిస్థితిలో ఉన్నా.. ‘సాక్షి’ పేపర్లో అయితే దుర్మార్గంగా రాస్తున్నారు.. పట్టిసీమతో గోదావరి నీళ్లు ఎత్తి ఎక్కడ నిల్వ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. పోలవరం, పులిచింతల ఉంది.. నాగార్జునసాగర్, గాలేరు నగరి.. కడపలో 70 టీఎంసీలు నిల్వ చేసే పరిస్థితి ఉంది.. వీటన్నింటిలో కృష్ణానది స్థిరీకరణను బట్టి నీటిని నిల్వ చేసే అవకాశముంది అని చెప్పుకొచ్చారు. ఏయ్ పోలీస్.. వాళ్లను కంట్రోల్ చేయండి సభలో ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఆందోళనకారులు నినాదాలు చేయగా, బాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏయ్ పోలీస్.. వాళ్లను కంట్రోల్ చేయండి.. ఇలాంటివి ఇక్కడొద్దు.. ఏమన్నా ఉంటే నా వద్దకు తీసుకురండి.. అని ఆదేశించారు. అయితే పోలీసులు ఆందోళనకారులను సభ నుంచి బలవంతంగా పంపించివేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పట్టిసీమ ఎత్తిపోతలను వ్యతిరేకిస్తున్న రైతులను పదుల సంఖ్యలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు పర్యటనలో అడుగడుగునా పోలీసులు కనిపించారు. శ్రీకృష్ణరాజ్యం ఎవరూ కోరుకోరు: టీడీపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం బాబు పట్టిసీమ సభలో మాట్లాడుతూ రామరాజ్యం కావాలని అందరూ కోరుకుంటారు.. శ్రీకృష్ణరాజ్యం కావాలని ఎవరూ కోరుకోరని వ్యాఖ్యానించారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టిఆర్ తన పాలనలో శ్రీరామరాజ్యాన్ని నెలకొల్పారని చెప్పారు. పోలవరం పనుల పరిశీలన: పట్టిసీమ బహిరంగ సభ అనంతరం బాబు పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్దకు హెలికాప్టర్లో వెళ్లి అక్కడి నుంచి వ్యూ పాయింట్‌కు చేరుకున్నారు. నిర్మాణ ప్రాంతాలను పరిశీలించి ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావును అడిగి వివరాలు తెలుసుకున్నారు.