![తెలంగాణ పాలిట విషనాగు చంద్రబాబు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/81462481307_625x300.jpg.webp?itok=mwz3rL28)
తెలంగాణ పాలిట విషనాగు చంద్రబాబు
తెలంగాణ బీసీ ఫోరం అధ్యక్షులు ఆంజనేయగౌడ్
ఉస్మానియా యూనివర్సిటీ: ఏపీ సీఎం చంద్రబాబు పగబట్టిన విషనాగులా మారి తెలంగాణ అభివృద్ధిని, ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని రాష్ట్ర బీసీ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు, టీఆర్‌ఎస్ నాయకులు డాక్టర్ ఆంజనేయగౌడ్ ధ్వజమెత్తారు. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ బీసీ ఫోరం, తెలంగాణ పరిరక్షణ ఫోరం, ఓయూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సాగునీటి ప్రాజెక్టుల వివాదంపై గురువారం చర్చ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులను అడ్డుకుంటే హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్ భవన్‌ను కూల్చివేస్తామని హెచ్చరించారు.
చంద్రబాబు తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారన్నారు. తెలంగాణలో నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఏపీ క్యాబినెట్ చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ తీర్మానాన్ని కేంద్రప్రభుత్వం తిరస్కరించాలని కోరారు. చంద్రబాబు తన బుద్ధి మార్చుకోకుంటే ప్రజలు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. ప్రాజెక్టుల నిర్మాణాల కోసం నిరంతరం పోరాడుతామని భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు.
ఈ నెల 8న బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు-ఏపీ ప్రభుత్వ దుశ్చర్యలు’ అనే అంశం పై రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు కిరణ్‌గౌడ్, శ్రావణ్, తెలంగాణ పరిరక్షణ సమితి నేతలు అశోక్, రాజేష్, వెంకట్‌యాదవ్, నర్సింగ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.