Irrigation projects in Telangana
-
Telangana: రూ.786 కోట్లతో కొత్త పథకాలు
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో మొత్తం రూ.786 కోట్లతో పలు కొత్త పథకాలు, పనులు చేపట్టేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. చనాకా కొరాటా బ్యారేజీతో పాటు నలసోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకాల అంచనా వ్యయం పెంపునకు సైతం అనుమతిచ్చింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం ప్రగతిభవన్‌లో సమావేశమైన కేబినెట్ ఈ కింది పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.388.20 కోట్లతో సిద్దిపేట జిల్లాలో మల్లన్నసాగర్ జలాశయం నుండి తపాస్‌పల్లి జలాశయానికి లింక్ కాలువ తవ్వకానికి ఓకే. తపాస్‌పల్లిజలాశయం కింద సిద్దిపేట జిల్లాలో 1,29,630 ఎకరాలకు నికరమైన సాగునీరు అందనుంది. రూ.44.71 కోట్లతో వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్ధారం గ్రామంలోని పెద్దచెరువు పునరుద్ధరణ. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించ తలపెట్టిన ఘన్పూర్ బ్రాంచి కాలువ పనులకు గాను రూ.144.43 కోట్ల మంజూరుకు ఆమోదం. ఈ కాలువ ద్వారా ఘన్పూర్, అడ్డాకుల మండలాల్లో 25 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. ఆదిలాబాద్ జిల్లాలో పెన్‌గంగా నదిపై నిర్మిస్తున్న చనాకా కొరాటా బ్యారేజీ అంచనా వ్యయాన్ని రూ.795.94 కోట్లకు సవరించడానికి ఓకే. బ్యారేజీ నిర్మాణం పూర్తి కాగా, పంప్ హౌస్ నిర్మాణం కొనసాగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో భీమ్‌పూర్, జైనథ్, భేలా, ఆదిలాబాద్ మండలాల్లో 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మెదక్ జిల్లాలో నిజాం కాలంలో నిర్మించిన ఘన్పూర్ ఆనకట్ట కాలువల వ్యవస్థను గతంలో ఆధునీకరించారు. మిగిలిపోయిన పనులను రూ.50.32 కోట్లతో చేపట్టడానికి అనుమతి. మెదక్ జిల్లాలో సుమారు 25 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. రూ. 27.36 కోట్లతో వనపర్తి, గద్వాల జిల్లాల్లో 11 చెక్ డ్యాంల నిర్మాణానికి అనుమతి. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో ఉన్న గోపాల సముద్రం చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులకు రూ.10.01 కోట్లు మంజూరు. గద్వాల జిల్లాలో ప్రతిపాదించిన నలసోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకం అంచనా వ్యయాన్ని రూ.669 కోట్లకు సవరించడానికి ఆమోదం. ప్రా జెక్టు పనులకు టెండర్లు పిలవడానికి అనుమతి. మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటు సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు నిధుల సమీకరణ కోసం కంపెనీల చట్టం కింద మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదముద్ర. ఈ కార్పొరేషన్‌కు ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ/ప్రిన్సిపల్ సెక్రెటరీ చైర్మన్‌గా, ఈఎన్సీ (జనరల్), ఈఎన్సీ(గజ్వేల్), ఆర్థిక శాఖ, నీటిపారుదల శాఖల జాయింట్ సెక్రటరీలు, సంగారెడ్డి చీఫ్ ఇంజనీర్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వెల్లటూరు గ్రామం వద్ద ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ నుంచి నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకంతో పాటు పాల్కేడ్ మండలం గుండెబోయిన గూడెం గ్రామం వద్ద జాన్‌పహాడ్ బ్రాంచ్ కెనాల్ నుండి నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకానికి మొత్తం రూ.16.23 కోట్లతో ఆమోదం. దేవాదుల పథకంలో భాగంగా ఎత్తైన ప్రాంతాలకు సాగు నీరు అందించడానికి గండి రామారం చెరువు నుంచి కన్నారం చెరువు వరకు పంప్ హౌస్, కాలువ పనులకు, గుండ్ల సాగర్ నుంచి లౌక్య తండా వరకు పైప్ లైన్ పనులకు, నశ్కల్ జలాశయం వద్ద పంప్ హౌస్ నిర్మాణానికి మొత్తం రూ.104.92 కోట్లతో ఆమోదం. -
మూల మూలకూ గోదారి పారాలి
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీజలాలు ఒరుసుకుంటూ పోతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రతి గ్రామం, ప్రతి ఎకరం ఆ నీటితో అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అనంతరం, సిరిసిల్ల జిల్లా తెలంగాణ జలకూడలిగా మారిందన్నారు. సిరిసిల్ల సహా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నియోజకవర్గాల పరిధిలో ఏ మూలనా సాగునీటి సమస్య ఉత్పన్నం కాకూడదని సీఎం చెప్పారు. ‘నేను కష్టపడి నీళ్లు తెచ్చిపెట్టిన. వాటిని వినియోగించుకునే బాధ్యత మీదే’అని స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇంజనీర్లకు కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగునీటి పారుదలపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోహిణి కార్తెలోనే నాట్లు వేయాలి ‘జూలై 10 తర్వాత, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, మండల స్థాయి ఇరిగేషన్ అధికారులు కూర్చొని, సాగు నీటిని మూల మూలకు ఎట్లా పారించాలో చర్చలు జరపాలి. ఇకనుంచి జిల్లాలో రైతులు రోహిణీ కార్తెలోనే నాట్లు వేసుకునేలా చూసే బాధ్యత స్థానిక ప్రజా ప్రతినిధులదే..’అని సీఎం చెప్పారు. నిజాంసాగర్ నుంచి నీటి విడుదలకు ఆదేశం మిషన్ కాకతీయ తర్వాత అన్ని నియోజకవర్గాల్లోని చెరువులు, కుంటలు పటిష్టంగా మారిన నేపథ్యంలో వాటిని నూటికి నూరు శాతం నింపాలని సీఎం ఆదేశించారు. మానకొండూరు నియోజకవర్గ పరిధిలో సుమారు పదివేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ప్రతిపాదనలు తయారుచేయాల్సిందిగా అధికారులను కేసీఆర్ ఆదేశించారు. త్వరలోనే మానకొండూరు నియోజకవర్గ పరిధిలోని ఇల్లంతకుంట మండలం అనంతగిరిని సందర్శిస్తానని తెలిపారు. నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలోని రైతుల విజ్ఞప్తి మేరకు నిజాంసాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, సీఎస్ సోమేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. పూర్తి సామర్థ్యంతో వినియోగించుకోవాలి గోదావరి నదీ జలాలను తెలంగాణ సాగు భూములకు మళ్లించడానికి ప్రాణహితను ఆధారంగా చేసుకుని కట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులు, రిజర్వాయర్లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎన్నో కష్టాలు పడి లిప్టుల ద్వారా సాగునీటిని ఎత్తిపోసుకొని తెలంగాణను సస్యశ్యామలం చేసుకుంటున్నాము. ప్రాణహిత నుంచే కాకుండా ఎల్లంపల్లి ఎగువ నుంచి కూడా గోదావరి జలాల లభ్యత పెరుగుతోంది. ఏ కాలం లోనైనా పుష్కలంగా నీళ్లు లభించేలా ఏర్పాట్లు చేసుకున్నాం. ఈ నేపథ్యంలో గోదావరి జలాలను పూర్తి సామర్ధ్యంతో వినియోగించుకోవాల్సిన అవసరముంది. ఇప్పుడు నీళ్ళు మన చేతిలో ఉన్నయ్. వాటిని ఎట్లా వాడుకుంటామనేది మన తెలివితో ముడిపడి ఉంది. గోదావరి పరీవాహక ప్రాంతాలైన కరీంనగర్, వరంగల్, అదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో సాగునీటి సమస్య అనేమాటే వినబడకూడదు. చిన్నపాటి లిఫ్టులు ఏర్పాటు చేసుకొని వానాకాలం ప్రారంభంలోనే నదీజలాలను ముందుగా ఎత్తైన ప్రదేశాలకు ఎత్తి పోసుకోవాలి..’అని కేసీఆర్ సూచించారు. -
బటన్ ఒత్తినమంటే నీరు చివరిదాకా పారాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వరప్రదాయి నిగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, వానా కాలం సీజన్ ప్రారంభం అయిన వెంటనే నీటిని ఎత్తిపోసి.. మేడిగడ్డ నుంచి తుంగతుర్తి దాకా ఉన్న అన్ని చెరువులను, రిజర్వాయర్లను, చెక్ డ్యాములను నింపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే కాళేశ్వరం నీటితో 90 శాతం చెరువులు, కుంటలు నిండి ఉండడంతో భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. బోర్లలో నీరు పుష్కలంగా లభిస్తున్న నేపథ్యంలో రైతులు వరిపంట విస్తృతంగా పండిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం రోహిణి కార్తె ప్రారంభమైనందున, నారుమడి సిద్ధం చేసుకుంటే వరిపంటకు చీడపీడల నుంచి రక్షణ లభిస్తుందని, అధిక దిగుబడి వస్తుందనే విశ్వాసంతో రైతులు ఉంటారనీ, ఈ దృష్ట్యా పంటలకు నీరందించేందుకు ఇరిగేషన్ శాఖ సంసిద్ధం కావాలని సూచించారు. మంగళవారం ప్రగతి భవన్లో ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. గోదావరి బేసిన్లో చేపట్టిన ప్రాజెక్టుల పురోగతి, కృష్ణా బేసిన్‌లోని కొత్త లిఫ్టుల పనులు, వానాకాలం ఆరంభం అవుతున్న నేపథ్యంలో కాల్వల మరమ్మతులు వంటి అంశాలపై కేసీఆర్ చర్చించి పలు ఆదేశాలిచ్చారు. వచ్చిన నీటిని వచ్చినట్టే ఎత్తిపోయాలి ‘ప్రాణహిత ప్రవాహం జూన్ 20 తర్వాత ఉధృతంగా మారుతుంది. అప్పడు వచ్చిన నీటిని వచ్చినట్టే ఎత్తిపోసి కాళేశ్వరం పరిధిలోని చెరువులు, కుంటలు, రిజర్వాయర్లను నింపుకోవాలె. కాల్వల మరమ్మతులు కొంత మిగిలి ఉన్నాయి. వాటిని సత్వరమే పూర్తి చేసుకొని, ఆపరేషన్స్ అండ్ మెయింటినెన్స్ చేపట్టాలి. కాళేశ్వరాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. రూ.4 వేల కోట్లతో నిర్మిస్తున్న చెక్ డ్యామ్‌లు నీటి నిల్వను చేస్తూ అద్భుతమైన ఫలితాలు అందిస్తున్నయి. జూన్ 30 వరకు మొదటి దశ చెక్డ్యామ్లన్నింటినీ పూర్తి చేయాలి. 50 వేల చెరువుల్లో నిరంతరం నిండుకుండల్లా నీటిని నిల్వ ఉంచుకోవాలి..’ అని ముఖ్యమంత్రి సూచించారు. వ్యవసాయంతో 17 శాతం ఆదాయం ‘రైతు పండించే పంట రైతుకు మాత్రమే చెందదని, అది రాష్ట్ర సంపదగా మారుతుందనే విషయాన్ని అంతా గ్రహించాలి. మొదటి దశ కరోనా కష్టకాలంలో రైతు పండించిన పంట ద్వారా 17 శాతం ఆదాయం అందించి రాష్ట్ర జీఎస్డీపీలో తెలంగాణ వ్యవసాయం భాగస్వామ్యం పంచుకుంది. రాష్ట్ర రెవెన్యూకు వెన్నుదన్నుగా నిలిచింది. ఇరిగేషన్ శాఖ కృషితో తెలంగాణ సాగునీటి రంగం, వ్యవసాయ రంగం ముఖచిత్రం మారిపోయింది. ఒక్క కాళేశ్వరం ద్వారానే 35 లక్షల ఎకరాల్లో రెండు పంటలను పండించే స్థాయికి చేరుకున్నామంటే ఆషామాషీ కాదు. ధాన్యం దిగుబడిలో తెలంగాణ నేడు పంజాబ్ తర్వాత రెండో పెద్ద రాష్ట్రంగా అవతరించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ వ్యవసాయాన్ని నాటి పాలకులు నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా రైతులు రూ.50 వేల కోట్ల సొంత ఖర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల బోర్లు వేసుకున్నారు. భార్యల మెడల మీది పుస్తెలమ్మి వ్యవసాయం చేసిన దీనస్థితి నాటి రైతులది. కానీ నేడు కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల నీళ్లతో భూగర్భజలాలు పెరగడం వల్ల నాడు తవ్వుకున్న బోర్లు నేడు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టు నీళ్లతో సాగవుతున్న ఆయకట్టుకు సమానంగా బోర్ల ద్వారా నేడు తెలంగాణ రైతులు పంటలు పండిస్తున్నారు. గోదావరి మీద కట్టుకున్న ప్రాజెక్టుల్లో గోదావరి నదీ గర్భంలోనే 100 టీఎంసీల నీటిని నిల్వచేసుకునే స్థాయికి చేరుకున్నాం..’ అని కేసీఆర్ వివరించారు. 15 లిఫ్టులకు ఒకేసారి టెండర్లు ‘నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో, దేవరకొండ నుంచి కోదాడ వరకు ప్రభుత్వం ఇప్పటికే నిర్మించ తలపెట్టిన 15 లిఫ్టు పథకాల నిర్మాణ అంచనాలను జూన్ 15 వరకు పూర్తి చేసి అన్నింటికీ ఒకేసారి టెండర్లు పిలవాలి. అందుకు సంబంధించి ఇరిగేషన్ అధికారులతో సమన్వయ బాధ్యతలను మంత్రి జగదీష్‌రెడ్డి తీసుకోవాలి. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఇటీవల శంకుస్థాపన చేసిన నెలికల్లు లిప్టు కింద ఆయకట్టును 24 వేల ఎకరాలకు పెంచిన నేపథ్యంలో పాత టెండర్‌ను రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవాలి. ఇందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియను వారంరోజుల్లో పూర్తి చేయాలి..’ అని ఆదేశించారు. ఓఅండ్ఎం పక్కాగా ఉండాలి... ‘కాల్వల మరమ్మతులు, ఇతర అవసరాలకై ఇరిగేషన్ శాఖకు రూ.700 కోట్లు కేటాయించిన దృష్ట్యా ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్ (ఓఅండ్ఎం) పక్కాగా ఉండాలి. రానున్న సీజన్‌కు గేట్ల మరమ్మతులు, కాల్వల మరమ్మతులు పూర్తిచేసి సిద్ధంగా ఉంచాలి. కాళేశ్వరంలో బటన్ ఒత్తినం అంటే చివరి ఆయకట్టు దాకా ఎటువంటి ఆటంకం లేకుండా నీరు ప్రవహించి పొలాలకు చేరాలె. అలా సర్వం సిద్ధం చేసిపెట్టుకోవాలñ...’ అని సూచించారు. ఇరిగేషన్ శాఖలో ఖాళీలన్నీ భర్తీ ‘అత్యంత ప్రాధాన్యత ఉన్న ఇరిగేషన్ శాఖలో ఏ పోస్టు కూడా ఖాళీగా ఉండకూడదు. ఎప్పటికప్పుడు అర్హులకు ప్రమోషన్లు ఇస్తూ ఖాళీలను వెంటవెంటనే భర్తీ చేయాలి. ఇరిగేషన్ శాఖకున్న ప్రత్యేకావసరాల దృష్ట్యా నియామక ప్రక్రియను బోర్డు ద్వారా సొంతంగా నిర్వహించుకునే విధానాన్ని అమలు చేస్తాం. కాల్వల నిర్వహణ కోసం త్వరలో లష్కర్లు, జేఈల నియామకాన్ని చేపడతాం. కింది స్థాయి నుంచి పైస్థాయి దాకా ఖాళీల వివరాలు తక్షణమే అందజేయాలి. మేజర్ లిఫ్టులు, పంపులు ఉన్న దగ్గర స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణం చేపట్టి, తక్షణమే పూర్తి చేయాలి. కాంట్రాక్టర్ల క్యాంపుల నిర్మాణాలకు భూసేకరణ నిలిపివేయాలి..’ అని కేసీఆర్ ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు జి. జగదీష్‌రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, మాదిరెడ్డి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, హన్మంత్ షిండే, శానంపూడి సైదిరెడ్డి, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, ఈఎన్సీ మురళీధర్ రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, ఈఎన్సీలు హరిరామ్, వెంకటేశ్వర్లు, సలహాదారు పెంటారెడ్డి పాల్గొన్నారు. వచ్చే ఏడాదికల్లా ‘సీతమ్మ సాగర్’ ఖమ్మం జిల్లాలో చేపడుతున్న సీతమ్మసాగర్ బ్యారేజీ పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించి తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు స్మితా సభర్వాల్, శ్రీధర్ దేశ్‌పాండే దృష్టి్టకి తీసుకురావాలన్నారు. సీతారామ ఎత్తిపోతలు నిర్మాణంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా బంగారు పంటలతో, బంగారు తునకగా మారుతుందని చెప్పారు. ఇక వీటితో పాటే హుస్నాబాద్, పాత మెదక్, ఆలేరు, భువనగిరి, జనగామ జిల్లాలకు నీరందించే మల్లన్న సాగర్‌ను త్వరగా పూర్తి చేయాలని కేసీఆర్ సూచించారు. -
సాగునీటి వ్యవస్థలను పటిష్టం చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థలను పటిష్టం చేయాలని, ఇందుకోసం ఇరిగేషన్ శాఖ ఓ అండ్ ఎం (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రంలో పంట పొలాలకు నిరంతరం నీరందిస్తున్నామని, రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణలో సాగునీటి రంగానికి ప్రాధాన్యం పెరిగిందని ఆయన అన్నారు. పాలమూరు, కల్వకుర్తి, జూరాల అనుసంధానం, కాలువల నిర్మాణాలు, విస్తరణ మీద బుధవారం మూడో రోజు ప్రగతిభవన్‌లో సీఎం సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బ్యారేజీల నుంచి మొదలుకుని చివరి డిస్ట్రిబ్యూటరీ కెనాల్ దాకా.. నీటిని తీసుకెల్లే అన్ని వ్యవస్థలను పటిష్ట పరుచుకోవాలన్నారు. కాల్వలు, పంపులు, బ్యారేజీల గేట్లు, రిజర్వాయర్లు తదితర అన్నిరకాల వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించుకుంటూ నీటిపారుదలను సక్రమంగా నిర్వహించాలన్నారు. మరమతుల కోసం రెండు పంటల నడుమ ఖాళీ సమయాన్ని వినియోగించుకోవాలని సీఎం సూచిం చారు. ఓఅండ్‌ఎంకు ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు. ప్రతి సాగునీటి కాల్వ చెత్తా, చెదారం లేకుండా అద్దంలా ఉండాలని అన్నారు. -
ఎక్కడికక్కడే నీటి కట్టడి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాగులపై అవసరమైనన్ని చెక్ డ్యామ్‌లు నిర్మించాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. మొత్తం ఎన్ని చెక్ డ్యామ్‌లు అవసరమో గుర్తిం చి, అందులో సగం చెక్ డ్యాములను ఈ ఏడాది, మిగతా సగం వచ్చే ఏడాది నిర్మించాలని చెప్పా రు. మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించిన చెరువుల నిర్వహణను ప్రతి ఏటా చేపట్టాలని ఆదేశిం చారు. చిన్న నీటి వనరుల వినియోగంపై సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌రెడ్డి, భానుప్రసాద్ రావు, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, ఈఎన్సీలు మురళీధర్ రావు, విజయ్ ప్రకాశ్, వెంకటేశ్వర్లు, సీఈలు వీరయ్య, హమీద్ ఖాన్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ‘ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రానికి సాగునీటి సమస్య తీరుతోంది. కాళేశ్వ రం, దేవాదుల, సీతారామ ప్రాజెక్టులతో గోదావరి నది నుంచి మన వాటా ప్రకారం పుష్కలంగా నీటిని తీసుకుంటాం. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 500కు పైగా టీఎంసీల నీటిని తీసుకోవచ్చు. ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు, ఎస్ఆర్ఎస్పీలతో పాటు కొత్తగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్ లాంటి రిజర్వాయర్లు నింపుకుంటాం. అన్ని చెరువులకు ప్రాజెక్టుల ద్వారా నీరిస్తాం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జలధార ఉంటుంది. పంటలు సంవృద్ధిగా పండుతాయి. పంటలకు నీళ్లిచ్చే క్రమంలో పడుబాటు నీళ్లు, వర్షం నీళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ నీళ్లు సహజంగా ఏర్పడిన వాగులు, వంకలు, డొంకల ద్వారా కిందికి వెళ్లిపోతాయి. ఈ నీళ్లను ఎక్కడికక్కడ ఆపడానికి విరివిగా చెక్ డ్యామ్‌లు నిర్మించాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ వాగుకు ఎన్ని చెక్ డ్యామ్‌లున్నాయి? కొత్తగా ఎన్ని మంజూరయ్యాయి? ఇంకా ఎన్ని మంజూరు చేయాలి? అనే లెక్కలు తీయాలి. అవసరమైనన్ని చెక్ డ్యామ్‌లను గుర్తించిన తర్వాత వాటిలో సగం ఈ ఏడాదే నిర్మించాలి. దీని కోసం జనవరి 15 నాటికి టెండర్లు పిలవాలి. మిగతా సగం చెక్ డ్యామ్‌లను వచ్చే ఏడాది నిర్మించాలి. వీటి నిర్మాణం కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తాం’అని ముఖ్యమంత్రి చెప్పారు. చెరువుల నిర్వహణకు నిధులు.. మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించిన చెరువుల నిర్వహణకు బడ్జెట్లో నిధులిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ స్పూర్తితో మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించుకున్నాం. ఈ చెరువులు ఊరికి బతుకు దెరువుగా ఉపయోగపడుతున్నాయి. పునరుద్ధరించుకున్న చెరువుల కట్టలు, తూములు, కాల్వలు, ఇతరత్రా మళ్లీ పాడవకుండా ఎప్పటికప్పుడు అవసరమైన మరమ్మతులు చేయాలి. దీనికోసం ప్రతీ ఏటా బడ్జెట్లో నిధులు కేటాయిస్తాం. ప్రతీ వేసవిలో చెరువులోని పూడిక మట్టిని రైతులు తమ పొలాల్లోకి తీసుకువెళ్లేలా ప్రోత్సహించాలి. వ్యవసాయ శాఖ, రైతు సమన్వయ సమితి, గ్రామ పంచాయతీలు సమన్వయంతో వ్యవహరించి పూడిక మట్టిని పొలాలకు తరలించుకునేలా చూడాలి. గతంలో మాదిరిగా నీరటి కాడు వ్యవస్థను పునరుద్ధరించాలి. వీఆర్ఏలలో ఒకరికి చెరువుల పని అప్పగించాలి. చెరువుల్లో మొలిచే మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి’అని కేసీఆర్ అన్నారు. అక్టోబర్ నాటికే అన్నీ నింపాలి.. వర్షాకాలం ఆరంభంలోనే కడెం నుంచి పెద్ద ఎత్తున నీళ్లు ఎల్లంపల్లికి చేరుకునే అవకాశం ఉన్నందున, వేసవి కాలంలోనే ఎల్లంపల్లి నీటిని ఎస్ఆర్ఎస్పీకి తరలించాలని ముఖ్యమంత్రి ఇంజనీర్లకు సూచించారు. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు ఎప్పుడూ నీటి కొరత లేకుండా చూడాలన్నారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లను అక్టోబర్ నాటికి పూర్తిస్థాయిలో నింపాలని సూచించారు. మిర్యాలగూడ డివిజన్లోని నాగార్జునసాగర్ ఆయకట్టుకు పాలేరు నుంచి నీళ్లివ్వడానికి అనువుగా ఎత్తిపోతల పథకం నిర్మించే అంశాన్ని పరిశీలించాలని, సర్వే నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో మారిన నీటిపారుదల వ్యవస్థ స్వరూపం మేరకు నీటి పారుదల శాఖను ఐదారుగురు ఈఎన్సీల పరిధిలోకి తీసుకురావాలని, దీనికి తగ్గట్టు శాఖను పునర్వ్యవస్థీకరించాలని సూచించారు. అర్హులైన వారికి పదోన్నతులు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈఎన్సీలు తమ పరిధిలోని ప్రాంతంలో అన్ని రకాల నీటి వనరులను పర్యవేక్షించాలని చెప్పారు. భారీ, మధ్య తరహా, చిన్న తరహా అనే తేడా లేకుండా నీటి పారుదల శాఖ ఒకే విభాగంగా పనిచేయాలని సీఎం కేసీఆర్ వివరించారు. -
ఐడీసీ ఎత్తివేత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ సాగునీటి ఎత్తిపోతల పథకాలన్నీ నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి కావస్తుండటం.. అదే సమయంలో కాల్వలు, పంపులు, పంప్‌హౌస్‌లు, బ్యారేజీలు, రిజర్వాయర్ల నిర్వహణ కత్తిమీద సాములా మారనున్న తరుణంలో పలు విప్లవాత్మక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సాగునీటి శాఖను పూర్తిగా పునర్వ్యవస్థీకరించేందుకు సిద్ధమయ్యారు. భారీ, మధ్యతరహా, చిన్నతరహా అనేది లేకుండా అన్నింటినీ ఒకే గూటి కిందకు తేవాలని, ఇప్పటివరకు ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న రాష్ట్ర సాగునీటి అభివృధ్ధి సంస్థ (ఐడీసీ)ని పూర్తిగా ఎత్తివేయాలనే ఆలోచనలో ఉన్నారు. భవిష్యత్తుకు దిక్సూచిగా ప్రక్షాళన.. ప్రస్తుతం సాగునీటి శాఖలో ఐదుగురు ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ)లు ఉన్నారు. వారికి అదనంగా మరో ఇద్దరు, ముగ్గురు ఈఎన్సీలను పెంచి వారి పరిధిలోకి నాలుగేసి జిల్లాల సర్కిళ్లను తేనున్నారు. ఒక్కో సర్కిల్‌కు చీఫ్ ఇంజనీర్‌ను నియమించి వారి కిందే జిల్లాకు సంబంధించిన భారీ, మధ్యతరహా, చిన్ననీటి, ఐడీసీ పథకాల పనులన్నింటినీ తేవాలని సీఎం సూచించారు. ప్రస్తుతం పాలమూరు జిల్లాను తీసుకుంటే జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా వంటి ప్రాజెక్టులకు ఒక సీఈ, మైనర్ వ్యవహారాలు చూసేందుకు మరో సీఈ, ఐడీసీ పథకాలకు మరో సీఈ ఉన్నారు. అయితే అలా కాకుండా జిల్లాకు సంబంధించిన అన్ని విభాగాల పనులు ఒక్క సీఈ కిందకే తేవాలన్నది సీఎం ఉద్దేశంగా ఉంది. దీని ద్వారా జిల్లాకు సంబంధించిన సమగ్ర సమాచారం ఒక్కరి వద్దే నిక్షిప్తంగా ఉంటుందని, నిర్ణయాలు సైతం ఒక్కరే తీసుకుంటారని, నిధుల ఖర్చు సులువుగా ఉంటుందని ఇటీవల సమీక్ష సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంగా ఐడీసీని పూర్తిగా ఎత్తివేయాలని సూచించారు. 10 వేల ఎకరాల వరకు సాగునీటిని అందించేలా ఐడీసీ ద్వారా ఎత్తిపోతల పథకాలు చేపడుతుండగా ప్రస్తుతం ప్రభుత్వం భారీ ఖర్చుతో ప్రాజెక్టులు చేపడుతున్నందున ఐడీసీ ప్రత్యేకంగా అక్కర్లేదన్నది సీఎం అభిప్రాయమని ఇంజనీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. సీఎం సూచనల మేరకు పలు విభాగాలను సమీకృతం చేసేలా సాగునీటి శాఖ కసరత్తు ప్రారంభించింది. దీనిపై ఇంజనీర్లకు మార్గదర్శనం కోసం ఈ నెల 21, 22 తేదీల్లో వర్క్‌షాప్ నిర్వహించనుంది. ఈ మేరకు అందరికీ సమాచారం పంపింది. ఇందులో ఏదో ఒకరోజు వర్క్‌షాప్‌నకు సీఎం హాజరయ్యే అవకాశం ఉంది. ఓ అండ్ ఎంకుపాలసీ.. రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం)కు ప్రత్యేక పాలసీని రూపొందించాలని సీఎం నిర్ణయించారు. నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే చూడాలని, దీనికి ప్రత్యేక బడ్జెట్ ఉండాలని సూచించారు. ఆయన సూచనల మేరకు ఎత్తిపోతల పథకాల పరిధిలో పంప్‌హౌస్‌లలోని పంపులు, మోటార్లు, విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, రిజర్వాయర్, బ్యారేజీల గేట్లు, కాల్వలు, టన్నెళ్లు నిర్వహణ ఓ అండ్ ఎం కిందకే తేనున్నారు. వాటి నిర్వహణ ఖర్చును ఆయా జిల్లా బాధ్యతలు చూసే ఈఎన్సీ, సీఈలు పర్యవేక్షించేలా బాధ్యతలు అప్పగించనున్నారు. ఓ అండ్ ఎంకు అవసరమయ్యే ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు, ఇతర సిబ్బంది అవసరాలపై ప్రాజెక్టులవారీగా లెక్కలు తీసి నిర్ణీత సిబ్బంది నియామకాలు చేపట్టే బాధ్యతలను కట్టబెట్టనున్నారు. -
సంక్షేమం దిశగా ‘సాగు’తున్నాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి కావడంతో వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా తీసుకెళ్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. గురువారం కేబినెట్ సమావేశం అనంతరం ప్రగతి భవన్లో కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ప్రధాన రహదారుల మరమ్మతు, సాగునీటి ప్రాజెక్టులు, ధాన్యం విక్రయం తదితర అంశాలపై ప్రభుత్వ వైఖరిని వెల్లడించారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు అన్ని ప్రాంతాల్లో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయని, వాటిని 2–3 నెలల్లో మరమ్మతు చేసేందుకు రూ. 571 కోట్లను ప్రత్యేకంగా మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. నిబద్ధత ఉన్న కాంట్రాక్టర్లను మాత్రమే పిలిచి పనులు అప్పగించి రహదారులను యథాతథ స్థితికి తెచ్చి ప్రయాణం సజావుగా సాగేలా చూడాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ముఖ్యంగా సంగారెడ్డి–నాందేడ్ రహదారిని ఎన్హెచ్ఏఐకి బదిలీ చేసినా కేంద్రం ఇంకా పనులు చేపట్టకపోవడంతో చాలా చోట్ల గుంతలు తేలాయన్నారు. ఈ విషయాన్ని కేంద్ర రవాణా మంత్రి గడ్కరీ దృష్టికి తీసుకెళ్తే కొన్ని నిధులిచ్చారన్నారు. ఇప్పుడు కూడా 3 వేల కిలోమీటర్ల మేర రోడ్లను ఎన్హెచ్ఏఐకి బదిలీ చేసినా మంజూరైన రోడ్ల పనులు కొన్ని చోట్ల ప్రారంభం కాలేదని, దీనిపై అవసరమైతే కేంద్రంతో మళ్లీ మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఏప్రిల్ వరకు సాగునీరిస్తాం... రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు విజయవంతంగా పూర్తి కావడంతో ధాన్యం దిగుబడి ఇబ్బడి ముబ్బడిగా పెరగనుందని సీఎం కేసీఆర్ తెలిపారు. గతంలో జూరాల కింద లక్ష ఎకరాలు మాత్రమే సాగులో ఉండగా ప్రస్తుతం పాలమూరు జిల్లాలోనే 12 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చిందని చెప్పారు. జూరాలతోపాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిలసాగర్తోపాటు దాదాపు 2 వేల చెరువులు నింపడంతో ప్రత్యక్ష సాగు మాత్రమే కాకుండా భూగర్భ జలాలు పెరిగాయని, నాణ్యమైన విద్యుత్ సరఫరా కూడా రైతులకు కలసి వస్తోందన్నారు. యాసంగి పంటకు సంబంధించి ఎస్సారెస్పీలో భాగంగా ఉన్న మహబూబాబాద్, కోదాడ, నడిగూడెం, తుంగతుర్తి ప్రాంతాలకు రైతుల కోరిక మేరకు ఏప్రిల్ వరకు 110 టీఎంసీల సాగునీటిని అందిస్తామని కేసీఆర్ వివరించారు. నెలన్నరలో మల్లన్నసాగర్‌కు నీళ్లు వస్తాయన్నారు. దేవాదుల ప్రాజెక్టు పనులను త్వరలో పూర్తి చేయడంతోపాటు ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు పనులు, పోడు భూముల అంశాన్ని పరిశీలించేందుకు త్వరలో అక్కడ పర్యటిస్తానని కేసీఆర్ చెప్పారు. త్వరలో పాలసీపై వ్యవసాయ మంత్రి ప్రకటన..రాష్ట్రంలో ధాన్యం విక్రయానికి సంబంధించి డిస్పోజల్ పాలసీని రూపొందిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక వరి ధాన్యాన్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చని, కొనుగోళ్ల కోసం ఎఫ్‌సీఐ, కేంద్రంపై ఆధారపడకుండా ఈ పాలసీ ఉపయోగపడుతుందన్నారు. నూతన పాలసీపై త్వరలో వ్యవసాయ మంత్రి ప్రకటన చేస్తారని చెప్పారు. ఈ సీజన్లో వరి రైతులకు మద్దతు ధర లభించేలా చర్యలు చేపడతామన్నారు. ధాన్యం కొనుగోళ్లకు వీలుగా పౌర సరఫరాల కార్పొరేషన్‌కు ఇప్పటికే రూ. 7 వేల కోట్ల గ్యారెంటీ ఇచ్చామని, అవసరమైతే మరో రూ. 5 వేల కోట్ల గ్యారెంటీ ఇవ్వడంతోపాటు రుణ పరిమితి పెంచాలని కోరతామన్నారు. 28 కార్పొరేషన్ల నియమావళి సవరణకు ఆర్డినెన్స్ మూసీ రివర్ ఫ్రంట్, రైతు సమన్వయ సమితి వంటి కొన్ని ముఖ్యమైన కార్పొరేషన్లకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చైర్మన్లుగా నియమించడంలో ప్రతిబంధకాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇందుకు అడ్డుగా ఉన్న లాభదాయక పదవుల నిబంధనను 28 కార్పొరేషన్లకు వర్తించకుండా త్వరలో ఆర్డినెన్స్ తెస్తామన్నారు. రైతుల పేరిట రికార్డులు ఉండేలా నూతన రెవెన్యూ చట్టాన్ని వంద శాతం తెస్తామని, నీటిపారుదల రంగంలో సాధించిన పురోగతికి కొనసాగింపుగా ఇన్నాళ్లూ సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని సంక్షేమం దిశగా తీసుకెళ్తామన్నారు. -
రూ.91,727 కోట్ల భారం
సాక్షి, హైదరాబాద్ :రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఎత్తిచూపింది. నిర్మాణాలు పూర్తిచేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రస్తావించింది. రెండేళ్లలో పూర్తికావాల్సిన ప్రాజెక్టులు పదేళ్లు దాటినా పూర్తికాలేదని, దీంతో ప్రాజెక్టుల అంచనా వ్యయాలు భారీగా పెరిగాయని తెలి పింది. 19 ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో జరుగుతున్న జాప్యం వల్ల ప్రభుత్వంపై రూ.91,727 కోట్ల భారం పడిందని పేర్కొం ది. ఆదివారం శాసనసభలో 2017– 18 ఏడా దికి సంబంధించి సమర్పించిన కాగ్ నివేదికలో సాగునీటి ప్రాజెక్టుల అంశాన్ని ప్రస్తావించింది. 2018 మార్చి నాటికి రాష్ట్రంలో నిర్మాణ దశలో ప్రాజెక్టులు 36 ఉన్నాయని తెలిపిన కాగ్.. ఇందులో 19 ప్రాజెక్టుల నిర్మాణంలో 3 నుంచి 11 ఏళ్ల మేర జాప్యం జరిగిందని తెలిపింది. దీంతో ఈ 19 ప్రాజెక్టుల అంచనావ్యయం రూ.41,201 కోట్లుకాగా, ఇప్పుడు రూ.1,32,928 కోట్లకు పెరిగిందని, దీంతో రూ.91,727 కోట్ల భారం పడిందని పేర్కొంది. ఈ ప్రాజెక్టుల కింద ఇప్పటికే రూ.70,758 కోట్లు ఖర్చు చేసినా అవి ఇంకా పూర్తికాలేదని తెలిపింది. ప్రాజెక్టులను పూర్తి చేయడంతో జాప్యం, ఖర్చుల మీద ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా, ఆశించిన ప్రయోజనాలను, ఆర్థిక వృద్ధిని రాష్ట్రానికి రాకుండా చేసిందని తెలిపింది. ఏఐబీపీ ప్రాజెక్టులూ అంతే.. కేంద్ర పథకం సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం(ఏఐబీపీ) కింద చేపట్టిన ప్రాజెక్టుల పూర్తిలోనూ జాప్యం జరుగుతోందని కాగ్ తెలిపింది. దేవాదుల, ఎస్సారెస్పీ–2, ఇందిరమ్మ వరద కాల్వ వంటి ప్రాజెక్టులు చేపట్టి దశాబ్దాలు గడిచినా అవి పూర్తి కాలే దని చెప్పింది. నీటిలభ్యతలో కొరత కారణంగా వాటి పనుల స్వరూపాలు, అంచనాలు మారిపోయాయని, ఈ ప్రాజెక్టుల కింద రూ.16,135 కోట్లు ఖర్చు చేసినా, సాగునీటి వసతుల కల్పన, నీటివినియోగంలో అంతంతమాత్రమే ప్రగతి సాధించిందని పేర్కొంది. భూసేకరణ, పర్యావరణ అనుమతులు వంటి కారణాలతో ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం ఏర్పడిందని తెలిపింది. ఈ దృష్ట్యా సాగునీటి రంగం మీద పెడుతున్న భారీ ఖర్చుకు అనుగుణంగా ఏర్పడుతున్న ప్రయోజనాలను మదింపు చేసేందుకు ప్రభుత్వం వాటి ఫలితాలను సంకలనం చేయాలని, ఈ ఫలితాలు సాగునీటి రంగంలో భవిష్యత్తు పెట్టుబడులకు మార్గసూచిక కావాలని పేర్కొంది. -
పూర్తి కానుంది లెండి
సాక్షి, నిజామాబాద్ : అంతర్రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే కొరటా – చనాఖా ప్రాజెక్టును చేపట్టిన సర్కారు.. ఇప్పుడు తెలంగాణ – మహారాష్ట్ర ఉమ్మడి పెండింగ్ ప్రాజెక్టు లెండి నిర్మాణాన్ని పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తోంది. మంగళవారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(అంతర్రాష్ట్ర వ్యవహారాలు) టంకశాల అశోక్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు చర్చలు జరిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే క్షామ పీడిత ప్రాంతమైన కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పరిధిలోని 28 వేల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలం కానుంది. పునరావాసమే ప్రధాన సమస్య.. మంజీర ఉపనది లెండిపై నాందేడ్ జిల్లాలోని గోనేగాం వద్ద ప్రాజెక్టు నిర్మించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టాయి. అయితే ఈ పనులు మూడు దశాబ్దాలు గడుస్తున్నా ఎటూ తేలడం లేదు. ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులుగా మారుతున్న వారికి పునరావాసం కల్పించడమే ప్రధాన అడ్డంకిగా మారింది. తమకు పునరావాసం కల్పించిన తర్వాతే ఈ పనులను చేపట్టాలని నిర్వాసితులు 2011లో పనులను నిలిపేశారు. ప్రాజెక్టుతో మహారాష్ట్రలోని మొత్తం 12 గ్రామాల వాసులు నిర్వాసితులుగా మారతారు. 19 గ్రామాలకు చెందిన రైతుల భూములు నీట మునుగుతాయి. మొదటి విడతలో ఏడు గ్రామాలకు, రెండో విడతలో మరో ఐదు గ్రామాలకు పునరావాసం కల్పించాలని నిర్ణయించారు. నిర్వాసితులు అడ్డుకోవడంతో ఎనిమిదేళ్లుగా ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. రూ.2,183 కోట్లకు పెరిగిన అంచనాలు.. 1985లో లెండి ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. రూ. 54.55 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఇందులో రూ.45.51 కోట్లు మహారాష్ట్ర సర్కారు భరించాల్సి ఉండగా, రూ.9.04 కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంది. అయితే పనులు నత్తనడకన సాగడంతో అంచనా వ్యయం పెరుగుతూ వచ్చింది. 2001లో రివైజ్డ్ అంచనాల ప్రకారం ప్రాజెక్టు వ్యయం రూ. 274.83 కోట్లకు చేరింది. తర్వాత మరో మూడు పర్యాయాలు అంచనాలను పెంచారు. ప్రస్తుతం 2017–18 (డీఎస్ఆర్ ప్రకారం) ప్రాజెక్టు అంచనా వ్యయం ఏకంగా రూ. 2,183.88 కోట్లకు చేరింది. రూ.550 కోట్ల మేర పనులు పూర్తి.. ఇరు రాష్ట్రాలు కలిపి ఈ ప్రాజెక్టుపై ఇప్పటి వరకు రూ. 550.61 కోట్లు ఖర్చు చేశాయి. ఇందులో మన రాష్ట్ర వాటా రూ.232.82 కోట్లు.. మిగిలిన రూ. 317.79 కోట్లు మహారాష్ట్ర సర్కారు వెచ్చించింది. ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి.. ► ఎర్త్‌డ్యాం పనులు 70 శాతం వరకు పూర్తయ్యాయి. ముంపునకు గురవుతున్న నిర్వాసితులకు పునరావాసం కల్పించిన తర్వాతే మిగిలిన 30 శాతం పనులను పూర్తి చేయాల్సి పరిస్థితి నెలకొంది. ► స్పిల్‌వే పనులు 80శాతం, పవర్ అవుట్లెట్ పనులు 90 శాతం పూర్తయ్యా యి. అత్యవసర గేట్ల నిర్మాణం, స్లూయిస్ గేట్ల పనులు చేపట్టాల్సి ఉంది. ► స్పిల్‌వే పై 14 రైడల్ గేట్ల తయారీ పూర్తయింది. పది గేట్లను బిగించారు. ► తెలంగాణకు సాగు నీరందించే కుడి కాలువ మొత్తం పొడువు 35 కి.మీ.లు. ఇందులో 9.43 కి.మీ.లు మహారాష్ట్ర పరి«ధిలో ఉంది. మహారాష్ట్ర పరిధిలోని కాలువల నిర్మాణ పనుల కోసం నిధులను తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర సర్కారుకు డిపాజిట్ చేసింది. లెండి ప్రాజెక్టు నీటి వాటాలు.. ఆయకట్టు మొత్తం నీటి లభ్యత 6.36 టీఎంసీలు తెలంగాణ (38 శాతం) 2.43 టీఎంసీలు మహారాష్ట్ర (62 శాతం) 3.93 టీఎంసీలు -
‘పిల్ల కాల్వ’ల కళకళ!
సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాలనంతా సస్యశ్యామలం చేసే వ్యూహాలకు ప్రభుత్వం మరింత పదును పెట్టింది. ప్రాజెక్టు పరిధిలోని 13.60 లక్షల ఎకరాల్లో చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించే ప్రణాళికను ఇప్పటికే అమల్లో పెట్టగా, దాన్ని మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దే పనిలో పడింది. ప్రాజెక్టు పరిధిలో ముప్పై ఏళ్ల కింద నిర్మించిన కాల్వకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి ఆధునీకరించే పనులను చేస్తున్న ప్రభుత్వం, తాజాగా వాటి పరిధిలోని డిస్ట్రిబ్యూటరీల (పిల్ల కాల్వలు)ను పూర్తి స్థాయిలో ఆధునీకరించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం రూ.419 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రతి ఎకరాకు నీటిబొట్టు ఎస్సారెస్పీలో భాగంగా ఉండే కాకతీయ కాల్వ, సరస్వతి, లక్ష్మీ కాల్వల ద్వారా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాలో మొత్తంగా స్టేజ్–1 కింద 9.68 లక్షలు, స్టేజ్–2 కింద మరో 4లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా ఉండేది. ఇందులో ఎస్సారెస్పీ నుంచి మానేరు వరకు 146 కిలోమీటర్ల వరకు ఉన్న కాల్వ నీటి ప్రవాహ సామర్థ్యం వాస్తవానికి 9,700 క్యూసెక్కులు. కానీ కాల్వలో చాలాచోట్ల పూడిక, పిచ్చిమొక్కలు పెరగడం, సిమెంట్ నిర్మాణాలు దెబ్బతినడంతో దాని ప్రవాహ సామర్థ్యం 5 వేలకు పడిపోయింది. దీంతో ఎగువ మానేరులో ఉన్న సుమారు 4.60 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందడం గగనంగా మారింది. దీంతోపాటే మానేరు దిగువన 146 కిలోమీటర్ నుంచి 234 కిలోమీటర్ వరకు కాల్వ ప్రవాహ సామర్థ్యం 8,505 క్యూసెక్కులు ఉండగా, అది 3 వేల క్యూసెక్కులకు పడిపోయింది. దీంతో దిగువ మానేరులో ఉన్న 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు గడ్డు పరిస్థితి ఏర్పడుతోంది. దీనిపై గతంలోనే సమీక్షించిన సీఎం కేసీఆర్ కాల్వల ఆధునికీకరణ చేపట్టాలని నిర్ణయించి రూ 200 కోట్లతో పనులకు ఆదేశించారు. దీంతో కాల్వల సామర్ధ్యం 5వేల క్యూసెక్కుల వరకు పెరిగింది. అనంతరం కాల్వల ఆధునికీకరణకు అదనంగా రూ.863 కోట్ల వరకు కేటాయించారు. ఈ పనులు కొనసాగుతున్నాయి. రెండోసారి ప్రభుత్వం ఏర్పాటయిన అనంతరం ఫిబ్రవరి 7న మరోమారు కాల్వల ఆధునికీకరణపై సమీక్షించిన ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఖరీఫ్‌లోనే ఎస్సారెస్పీ పూర్తి స్థాయిలో నీరందించనున్న దృష్ట్యా, చివరి ఆయకట్టు వరకు నీరందేలా కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల మరమ్మతుల పనులు పూర్తి చేయా లని ఆదేశించారు. కాల్వలను పూర్తి స్థాయి డిశ్చార్జి సామర్థ్యానికి తెచ్చేందుకు ఆదేశాలిచ్చారు. డిస్ట్రిబ్యూటరీల ఆధునీకరణకు అయ్యే వ్యయ అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో కదిలిన అధికారులు మొత్తంగా డిస్ట్రిబ్యూటరీల పనులకు రూ.419.75 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో కాకతీయ కాల్వ పనులకు రూ.88.39 కోట్లు, దాని కింది డిస్ట్రిబ్యూటరీలకు రూ.263.41 కోట్లు, సరస్వతి కెనాల్‌కు రూ.29.40 కోట్లు, లక్ష్మీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీలకు రూ.19.67 కోట్లు, సదర్‌మట్‌కింద 17.47 కోట్లు, మిగతా పనులకు రూ.1.41కోట్లతో అంచనా లు రూపొందిం చారు. ఈ ప్రతిపాదనల ఆమోదానికై ప్రభుత్వ పరిశీలనకు పంపారు. ఈ పనులను వీలైనంత త్వరగా చేపట్టాల్సి ఉన్నందున తక్కువ సమయంలోనే వీటికి ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు తెలిపాయి. ఈ పనులు పూర్తయితే కాళేశ్వరం నీటితో ప్రతి ఎకరాకు నీరందే అవకాశం ఉంటుందని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. -
కేసీఆర్‌కు టెక్నికల్ నాలెడ్జ్ ఉందా?
సాక్షి, హైదరాబాద్: నూతన ప్రాజెక్టులన్నీ తానే డిజైన్ చేస్తున్నానని చెబుతున్న సీఎం కేసీఆర్‌కు టెక్నికల్ నాలెడ్జ్ ఉందా అంటూ కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టివిక్రమార్క ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టుల మీద రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు చేయడాన్ని దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. దీనిపై ప్రభుత్వం సెకండ్ ఒపీనియన్ తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు ప్రాజెక్టుల మీద లక్ష కోట్ల వరకు ఖర్చు చేశామని ప్రభుత్వం బెబుతుంది.. కానీ ఒక్క ఎకరానికయినా నీళ్లు వచ్చాయా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చేసిన ఖర్చు పనిలో కనపడాలి కదా అని విమర్శించారు. ప్రాజెక్టులపై చేసిన ఖర్చుపై అర్థవంతమైన చర్చ జరగాలన్నారు. భూప్రక్షాళన మీద ఎలాంటి ప్రక్షాళన జరగలేదని, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. భూ ప్రక్షాళన పేరు మీద కొత్త సమస్యలు వచ్చాయని భట్టి విక్రమార్క అన్నారు. -
కన్నీరింకిన చోటే జల కళ
తెలంగాణ ఉద్యమానికి ఆజ్యం పోసిన పాలమూరు ప్రజల కష్టాల కొలిమిని కేసీఆర్ ఉద్యమ సమయంలో ప్రపంచానికి విడమరిచి చాటిచెప్పారు. ఆనాడు నెర్రలుబాసిన ఎర్రసెలకల్లో జలాలను రప్పించేందుకు పాలమూరు ఊరూరా పాదయాత్రలు చేసి ఉద్యమ జలస్వప్నాలను స్వప్నించారు. అదే కేసీఆర్ నేడు నదుల నడకను మార్చి తరాల పాలమూరు కరువును తరిమేస్తున్నారు. నదులను గండికొట్టి బాజాప్తాగా నెర్రలు బారిన భూములకు గంగమ్మను అందిస్తున్నారు. నిన్నటిదాకా కన్నీరు పెట్టిన పాలమూరు పల్లెలు నేడు ఆనంద భాష్పాలను వర్షిస్తున్నాయి. కరువుకు నెర్రలు బాసిన నేలకు ముఖచిత్రంగా తెలంగాణ అంచు చివరన సరిహద్దులో ఎడారిగా మారిన గట్టు, కెటిదొడ్డి, ధరూర్ మండలాలకు సాగునీరందించేందుకు రూ. 553 కోట్ల నిధులతో 33 వేల ఎకరాల సాగు విస్తీర్ణం లక్ష్యంగా నేడు గట్టు ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయబోతున్నారు. పేదరికం వల్ల చదువుకు దూరమైన గట్టుమండలం 34.8% అత్యల్ప అక్షరాస్యత రేటుతో దక్షిణాసియాలోనే దిగువస్థానంలో మిగిలిపోయింది. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తున ఉన్న గట్టు ప్రాంతానికి తెలంగాణ రాష్ట్ర మొచ్చినా, మిగిలిన ప్రాంతానికి నీళ్లు వస్తాయోమో గానీ ఈ ప్రాంత నేలలకు సాగునీరివ్వడం అసాధ్యమనే అభిప్రాయం అందరిలో బలపడి ఉంది. కానీ, తెలంగాణలో పారే ప్రతి నీటిబొట్టుపైన లెక్కలేసి పెట్టుకున్న కేసీఆర్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నారు. దాదాపు రూ. 783 కోట్ల నిధులతో 55,600 ఎకరాలకు సాగునీరందించేందుకు నిర్దిష్ట ప్రణాళికతో చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులను కూడా కేసీఆర్ పర్యవేక్షిస్తున్నారు. 2003 జూలైలో ఆలంపూర్ జోగుళాంబ ఆలయం నుంచి గద్వాల వరకు 150 కిలోమీటర్ల మేరకు చేసిన పాదయాత్ర ముగింపు బహిరంగ సభలో ‘‘మల్దకల్’’ వెంకటేశ్వర స్వామి సాక్షిగా నడిగడ్డకు న్యాయంగా దక్కాల్సిన చివరి నీటిబొట్టు దక్కేదాకా విశ్రమించనని చేసిన ప్రకటనను నిజం చేస్తున్నారు. 87,500 ఎకరాలకు నీరందించాల్సిన ఆర్డీయస్ ఏనాడూ 50వేల ఎకరాలకు కూడా కనీసం ఒక పంటకు నీరవ్వని దుస్థితి, ఒక లక్షా రెండు వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన జూరాల ప్రాజెక్టు దశాబ్దాల పాటు ఏనాడూ 40 వేల ఎకరాలను కూడా తడపకుండా తరలిపోయిన చరిత్ర, దాని వెనకున్న పాలకుల వివక్షా పూరిత విధానాలు, వత్తాసుగా నిలిచిన స్థానిక భూస్వామ్య రాజకీయాలు మరిచిపోలేని వాస్తవాలు. కానీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే పాలమూరు పొలాల తరాల దాహం తీర్చే నిర్దిష్ట చర్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. గద్వాల, ఆలంపూర్‌లతో పాటు ఉమ్మడి జిల్లాలోని 14 నియోజక వర్గాల నీటి కష్టాలకు ముగింపు పలుకుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో 35 లక్షల మందికి పైగా మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రజలు కరువు కుంపటిని మోశారు. జురాల, నెట్టెంపాడు, భీమా తదితర ప్రాజెక్టుల నిర్మాణాన్ని తాబేలు నడకలా మార్చిన ఫలితంగా దాదాపు 28 లక్షల సాగుయోగ్యమైన భూమి ఉన్నా పాలమూరు రైతు బక్కచిక్కి బలవన్మరణాల బాధితుడిగా మారాడు. ఇక్కడి జనం దశాబ్దాల పాటు అనుభవించిన దారిద్య్రాన్ని బద్దలు కొడుతూ కేసీఆర్ పల్లెల తలలపై నీటి సంతకాలు చేస్తున్నారు. నెట్టెంపాడు పెండింగ్ పనులు పూర్తి చేసి జోగుళాంబ గద్వాల్ జిల్లాలో, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నాగర్‌కర్నూల్, భీమా2 ద్వారా వనపర్తి, కోయిల్ సాగర్ తదితర ప్రాజెక్టుల ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో నూతనంగా నాలుగు లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 944 కోట్లతో మిషన్ కాకతీయ పథకం ద్వారా మూడు విడతలలో 3,633 చెరువుల పునరుద్ధరణ చేసి మరో 2 లక్షల 38 వేల ఎకరాల ఆయకట్టును అందుబాటులోకి తెచ్చారు. దీంతో పాటు రూ. 35,200 కోట్ల అంచనాలతో పాలమూరు–రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టును ప్రారంభించి కరువును కూకటివేళ్లతో పెకిలించేందుకు పునాదులేశారు. ఇప్పుడు పాలమూరు నేల తల్లి కడుపారా పంటను కంటున్నది. దశాబ్దాల దారిద్య్రం మీద గెలుపు సాధించే దిశగా వడివడిగా అడుగులేస్తున్నది. నాగేటి సాళ్ళల్ల... నా తెలంగాణ...నవ్వేటి బతుకుల్ల... నా తెలంగాణ పాట నిన్నటి జ్ఞాపకం. ఇప్పుడు నాగళ్లు నేలతల్లిపై రేపటి భవితాక్షరాలను దున్నుతున్నాయి. 99% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలున్న పాలమూరు ఉమ్మడి జిల్లా గత చరిత్రను విడిచి తలెత్తుకుని నిలబడుతున్నది. నీటికి అలమటించిన నేలపై కాలువలు పరుగులు పెట్టబోతున్నాయి. ముందు చూపు, ప్రజలపై ప్రేమ, మానవీయ దృక్పథంతో చేపడుతున్న సాగునీటి పథకాలు అతి స్వల్పకాలంలోనే గ్రామాల స్వరూపాన్ని సమగ్రంగా మార్చబోతున్నాయి. (ఈ నెల 29న గట్టు ఎత్తిపోతలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా) డా. ఆంజనేయగౌడ్, వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు 98661 65308 -
ప్రాజెక్టులు చూసి కుళ్లుకుంటున్న కాంగ్రెస్: కర్నె
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం కోసం వేగంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను చూసి కాంగ్రెస్ పార్టీ కుళ్లుకుంటుందని, ఆ పార్టీ నేతల కడుపు మండిపోతుందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, జీవన్‌రెడ్డిలు నోటికొచ్చినట్టు మాట్లాడి తమ మూర్ఖత్వాన్ని బయటపెట్టుకుంటున్నారన్నారు. పచ్చి అబద్ధాలు, అసత్యాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులపై నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతకాలం ఎడారులుగా మారిన ప్రాజెక్టులు, నాలుగేళ్లలోనే నీటితో కళకళలాడుతున్నాయని తెలిపారు. నీటితో నిండిన ప్రాజెక్టులను చూడటానికి అన్ని వర్గాలు వెళ్తే, కాళేశ్వరంను పర్యాటక కేంద్రంగా మార్చారని కాంగ్రెస్ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. -
తెలంగాణ పాలిట విషనాగు చంద్రబాబు
తెలంగాణ బీసీ ఫోరం అధ్యక్షులు ఆంజనేయగౌడ్ ఉస్మానియా యూనివర్సిటీ: ఏపీ సీఎం చంద్రబాబు పగబట్టిన విషనాగులా మారి తెలంగాణ అభివృద్ధిని, ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని రాష్ట్ర బీసీ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు, టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఆంజనేయగౌడ్ ధ్వజమెత్తారు. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ బీసీ ఫోరం, తెలంగాణ పరిరక్షణ ఫోరం, ఓయూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సాగునీటి ప్రాజెక్టుల వివాదంపై గురువారం చర్చ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులను అడ్డుకుంటే హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌ను కూల్చివేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారన్నారు. తెలంగాణలో నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఏపీ క్యాబినెట్ చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ తీర్మానాన్ని కేంద్రప్రభుత్వం తిరస్కరించాలని కోరారు. చంద్రబాబు తన బుద్ధి మార్చుకోకుంటే ప్రజలు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. ప్రాజెక్టుల నిర్మాణాల కోసం నిరంతరం పోరాడుతామని భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. ఈ నెల 8న బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు-ఏపీ ప్రభుత్వ దుశ్చర్యలు’ అనే అంశం పై రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు కిరణ్‌గౌడ్, శ్రావణ్, తెలంగాణ పరిరక్షణ సమితి నేతలు అశోక్, రాజేష్, వెంకట్‌యాదవ్, నర్సింగ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.