పూర్తి కానుంది లెండి | Lendi Irrigation Project Works On Going In Nizamabad | Sakshi
Sakshi News home page

పూర్తి కానుంది లెండి

Published Wed, Jul 31 2019 10:32 AM | Last Updated on Wed, Jul 31 2019 10:32 AM

Lendi Irrigation Project Works On Going In Nizamabad - Sakshi

నిర్మాణంలో ఉన్న లెండి ప్రాజెక్టు

సాక్షి, నిజామాబాద్‌ : అంతర్రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే కొరటా – చనాఖా ప్రాజెక్టును చేపట్టిన సర్కారు.. ఇప్పుడు తెలంగాణ – మహారాష్ట్ర ఉమ్మడి పెండింగ్‌ ప్రాజెక్టు లెండి నిర్మాణాన్ని పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తోంది. మంగళవారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజినీరింగ్‌ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(అంతర్రాష్ట్ర వ్యవహారాలు) టంకశాల అశోక్‌ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు చర్చలు జరిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే క్షామ పీడిత ప్రాంతమైన కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గం పరిధిలోని 28 వేల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలం కానుంది.

పునరావాసమే ప్రధాన సమస్య.. 
మంజీర ఉపనది లెండిపై నాందేడ్‌ జిల్లాలోని గోనేగాం వద్ద ప్రాజెక్టు నిర్మించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టాయి. అయితే ఈ పనులు మూడు దశాబ్దాలు గడుస్తున్నా ఎటూ తేలడం లేదు. ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులుగా మారుతున్న వారికి పునరావాసం కల్పించడమే ప్రధాన అడ్డంకిగా మారింది. తమకు పునరావాసం కల్పించిన తర్వాతే ఈ పనులను చేపట్టాలని నిర్వాసితులు 2011లో పనులను నిలిపేశారు. ప్రాజెక్టుతో మహారాష్ట్రలోని మొత్తం 12 గ్రామాల వాసులు నిర్వాసితులుగా మారతారు. 19 గ్రామాలకు చెందిన రైతుల భూములు నీట మునుగుతాయి. మొదటి విడతలో ఏడు గ్రామాలకు, రెండో విడతలో మరో ఐదు గ్రామాలకు పునరావాసం కల్పించాలని నిర్ణయించారు. నిర్వాసితులు అడ్డుకోవడంతో ఎనిమిదేళ్లుగా ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. 

రూ.2,183 కోట్లకు పెరిగిన అంచనాలు.. 
1985లో లెండి ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. రూ. 54.55 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఇందులో రూ.45.51 కోట్లు మహారాష్ట్ర సర్కారు భరించాల్సి ఉండగా, రూ.9.04 కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంది. అయితే పనులు నత్తనడకన సాగడంతో అంచనా వ్యయం పెరుగుతూ వచ్చింది. 2001లో రివైజ్డ్‌ అంచనాల ప్రకారం ప్రాజెక్టు వ్యయం రూ. 274.83 కోట్లకు చేరింది. తర్వాత మరో మూడు పర్యాయాలు అంచనాలను పెంచారు. ప్రస్తుతం 2017–18 (డీఎస్‌ఆర్‌ ప్రకారం) ప్రాజెక్టు అంచనా వ్యయం ఏకంగా రూ. 2,183.88 కోట్లకు చేరింది. 

రూ.550 కోట్ల మేర పనులు పూర్తి.. 
ఇరు రాష్ట్రాలు కలిపి ఈ ప్రాజెక్టుపై ఇప్పటి వరకు రూ. 550.61 కోట్లు ఖర్చు చేశాయి. ఇందులో మన రాష్ట్ర వాటా రూ.232.82 కోట్లు.. మిగిలిన రూ. 317.79 కోట్లు మహారాష్ట్ర సర్కారు వెచ్చించింది. 
ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి.. 
► ఎర్త్‌డ్యాం పనులు 70 శాతం వరకు పూర్తయ్యాయి. ముంపునకు గురవుతున్న నిర్వాసితులకు పునరావాసం కల్పించిన తర్వాతే మిగిలిన 30 శాతం పనులను పూర్తి చేయాల్సి పరిస్థితి నెలకొంది. 
► స్పిల్‌వే పనులు 80శాతం, పవర్‌ అవుట్‌లెట్‌ పనులు 90 శాతం పూర్తయ్యా యి. అత్యవసర గేట్ల నిర్మాణం, స్లూయిస్‌ గేట్ల పనులు చేపట్టాల్సి ఉంది.  
► స్పిల్‌వే పై 14 రైడల్‌ గేట్ల తయారీ పూర్తయింది. పది గేట్లను బిగించారు.
► తెలంగాణకు సాగు నీరందించే కుడి కాలువ మొత్తం పొడువు 35 కి.మీ.లు. ఇందులో 9.43 కి.మీ.లు మహారాష్ట్ర పరి«ధిలో ఉంది. మహారాష్ట్ర పరిధిలోని కాలువల నిర్మాణ పనుల కోసం నిధులను తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర సర్కారుకు డిపాజిట్‌ చేసింది.   

లెండి ప్రాజెక్టు నీటి వాటాలు.. 

ఆయకట్టు మొత్తం నీటి లభ్యత      6.36 టీఎంసీలు  
తెలంగాణ (38 శాతం)   2.43 టీఎంసీలు 
మహారాష్ట్ర (62 శాతం)   3.93 టీఎంసీలు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement