Lendi project
-
వచ్చే ఏడాదిలోగా లెండి ప్రాజెక్టు పూర్తి చేస్తాం
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర–తెలంగాణ మధ్య నిర్మిస్తున్న లెండి ప్రాజెక్టును వచ్చే ఏడాది చివరినాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. నాందేడ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ రవీంద్రచవాన్, మాజీ ఎమ్మెల్యే హనుమంత్‌రావు పాటిల్ నేతృత్వంలోని ఆ పార్టీ బృందం గురువారం సచివాలయంలో ఉత్తమ్‌ను కలవగా, ఈ మేరకు హామీ ఇచ్చారు.1984లో రూ.2183.88 కోట్ల అంచనావ్యయంతో నాందేడ్ జిల్లా ముఖేడ్ తాలూకా వద్ద ప్రారంభించిన లెండి భారీ ప్రాజెక్ట్ పూర్తయితే తెలంగాణలో 38,573 ఎకరాలు, మహారాష్ట్రలో 27,710 ఎకరాలు సాగులోకి వచ్చేది. రెండు రాష్ట్రాల ఒప్పందం ప్రకారం అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ ఈ ప్రాజెక్ట్‌పై రూ.1040.87 కోట్లు ఖర్చు చేసి ఎర్త్ డ్యామ్ పనులు 70%, స్పిల్‌వే పనులు 80% పూర్తి చేయగా, కాల్వల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయన్నారు. పైపుల ద్వారా నీటి సరఫరాకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు చెప్పారు. భూనిర్వాసితులు అడ్డు పడడంతో 2011లో అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులను తిరిగి పునరుద్ధరించడంతోపాటు నదీగర్భంలోని మట్టి పనులను పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. -
మూడున్నర దశాబ్దాలైనా.. పూర్తికాని ‘లెండి ప్రాజెక్టు’
సాక్షి, కామారెడ్డి : అంతర్రాష్ట్ర ప్రాజెక్టు అయిన ‘లెండి’కి ని ధుల గ్రహణం వీడడం లేదు. మూడున్నర దశాబ్దాలు గడచినా పనులు పూర్తికావడంలేదు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మూడున్నర దశాబ్దాల క్రితం పునాదిరాయి పడింది. ఈ ప్రాజెక్టు కింద ఇరు రాష్ట్రాల్లో కలిపి 60వేల పైచిలుకు ఎకరాల భూములకు సాగునీరు అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. కానీ నిర్మాణ పనులకు, భూసేకరణ, నిధుల సమస్యలతో ప్రాజెక్టు పనులు కొనసాగడం లేదు. ప్రాజెక్టు పనులు పూర్తయితే వెనుకబడిన ప్రాంతమైన కామారెడ్డి జిల్లాలోని మద్నూర్, బిచ్కుంద మండలాల్లో దాదాపు 22వేల ఎకరాల మెట్ట భూములు సాగులోకి వస్తాయి. కేవలం వర్షాధారంపైనే ఆధారపడి ఆరుతడి పంటలు సాగు చేస్తున్న రైతులు లెండి ప్రాజెక్టు కోసం ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రాజెక్టు ముంపు రైతులకు పునరావాసం కింద అందించాల్సిన డబ్బులు అప్పట్లో పూర్తి స్థాయిలో చెల్లించకపోవడంతో ప్రాజెక్టు నిర్మాణం పెండింగులో పడిపోయింది. దీంతో ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్న రైతుల ఆశలు అడియాశలయ్యాయి. ప్రాజెక్టు పూర్తి కాకున్నా కెనాల్ పనులు చేపట్టిన దృశ్యం లెండి సామర్థ్యం 6.36 టీఎంసీలు.. మహారాష్ట్రలోని దెగ్లూర్ తాలూకా గోజేగావ్ గ్రామం వద్ద లెండి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 6.36 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. ఇందులో మహారాష్ట్రకు 3.93 టీఎంసీలు, తెలంగాణ రాష్ట్రానికి 2.43 టీఎంసీల నీటిని వాడుకునేలా నిర్ణయించారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.54.55కోట్లు.. ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టిన 1984 సంవత్సరంలో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.54.55 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అప్పట్లో నిధుల సమస్య, భూసేకరణ వంటి సమస్యలతో పనులకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా పనులు ఆగిపోవడంతో ఇప్పుడు అంచనా వ్యయం రూ.వెయ్యి కోట్లు దాటింది. అప్పట్లో ముంపు గ్రామాల రైతులకు పరిహారం విషయంలో అసంపూర్తి చెల్లింపులు జరగడంతో నిర్మాణానికి ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ ప్రాజెక్టు ద్వారా మహారాష్ట్రలోని దెగ్లూర్, ముఖేడ్ తాలూకాల పరిధిలోని గ్రామాల్లో 39,275 ఎకరాల ఆయకట్టుకు, తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాలోని మద్నూర్, బిచ్కుంద మండలాల్లోని గ్రామాల పరిధిలో 22 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు ప్రతిపాదించారు. 75శాతం పనులు పూర్తి.... గోజేగావ్ వద్ద చేపట్టిన లెండి ప్రాజెక్టు నిర్మాణ పనులు దాదాపు 75 శాతం పూర్తయ్యాయి. ప్రాజెక్టుకు 14 గేట్లు నిర్మించాల్సి ఉండగా, 10 గేట్ల నిర్మాణం అప్పుడే పూర్తయ్యింది. మరో నాలుగు గేట్ల నిర్మాణాలు పూర్తి కావలసి ఉంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత లెండి ప్రాజెక్టు పనులను కొలిక్కి తెచ్చే ప్రయత్నం జరిగింది. ప్రాజెక్టు కోసం రూ . 43.14 కోట్లు ఖర్చు చేశారు. అప్పుడు కామారెడ్డి జిల్లా పరిధిలోని మద్నూర్, బిచ్కుంద మండలాలకు సంబంధించి కెనాల్స్ పనులు జరిగాయి. కాని ప్రాజెక్టు పనులు మాత్రం అసంపూర్తిగానే ఉండిపోయాయి. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత లెండి ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.554.54 కోట్లని తేల్చారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 42 శాతం కింద రూ.236.10 కోట్లు, మిగతా మొత్తం రూ.318.45 కోట్లు మహారాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. రాష్ట్ర వాటాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.189.73 కోట్లు విడుదల చేసింది. అయినా పనులు మాత్రం ముందుకు సాగలేదు. దీంతో ప్రాజెక్టు అంచనా వ్యయం ఏటేటా పెరుగుతూనే ఉంది. పరిహారమే అసలు సమస్య... మహారాష్ట్రలో ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలకు పరిహారం విషయంలో అక్కడి ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడం వల్లే సమస్య పరిష్కారం కావడంలేదని అంటున్నారు. ఏటేటా అంచనా వ్యయం పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం రూ.వెయ్యి కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. అక్కడి ప్రభుత్వం చేస్తున్న జాప్యం వల్లే లెండి పనులు పూర్తి కాలేదని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్రఫడ్నవీస్తో ప్రాజెక్టులపై జరిగిన చర్చల సందర్భంగా సీఎం కేసీఆర్ లెండి ప్రాజెక్టు సమస్యపై కూడా చర్చించారు. అయినప్పటికీ సమస్య కొలిక్కిరావడం లేదు. రైతుల ఆశలు నెరవేరడం లేదు. జల వనరుల శాఖతోనైనా న్యాయం జరిగేనా.... రాష్ట్ర ప్రభుత్వం నీటి పారుదల శాఖలోని ఆయా విభాగాలన్నింటినీ కలిపి జలవనరుల శాఖను ఏర్పాటు చేసింది. కామారెడ్డి జిల్లా పరిధిలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, ఎత్తిపోతల పథకాలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 22వ ప్యాకేజీతో సహా అన్నింటినీ కామారెడ్డిలో ఏర్పాటు చేయబోయే చీఫ్ ఇంజనీర్ పరిధిలోకి తీసుకువచ్చారు. పరిపాలనా సౌలభ్యం కలుగనున్నందున లెండి ప్రాజెక్టు సమస్యపై పర్యవేక్షణ, పరిశీలనకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం లెండి ప్రాజెక్టుపై దృష్టి సారించాలని మద్నూర్, బిచ్కుంద ప్రాంత రైతాంగం వేడుకుంటోంది. ఏండ్ల సంది ఎదురు చూస్తున్నం... మాకు ఎలాంటి నీటి సౌకర్యం లేదు. లెండి ప్రాజెక్టు కడితే నీళ్లు వస్తయని ఏండ్ల సంది ఎదురు చూస్తున్నం. అప్పట్లో కాలువలు తవ్వి, లైనింగ్ జేసిండ్రు. నీళ్లు వచ్చినట్టేనని సంబరపడ్డం. ఏండ్లు గడుస్తున్నా పనులు పూర్తి కాలేదు. నీళ్ల సౌకర్యం లేక వానల మీద ఆధారపడి ఆరుతడి పంటలు వేస్తున్నం. కాలువలు వస్తే మా కష్టాలు తీరుతయి. –రాములు, రైతు, మద్నూర్ లెండి నీళ్లు వస్తయని చెపుతూనే ఉన్నరు... లెండి నీళ్లు వస్తయని, నీళ్లొస్తే మా భూములకు నీటి కష్టం తీరుతదని ఎదురు చూస్తున్నం. మస్తు సంవత్సరాల నుంచి లెండి ముచ్చట చెప్పుతనే ఉన్నరు. ఎప్పుడు కట్టుడు అయిపోతుందో, నీళ్లు ఎప్పుడు వస్తయో తెలుస్తలేదు. వానలు పడితేనే మాకు పంటలు, లేకుంటే ఇబ్బందులు తప్పడం లేదు. సర్కారు ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ఆదుకోవాలె. –నాగనాథ్, రైతు, మద్నూర్ -
పూర్తి కానుంది లెండి
సాక్షి, నిజామాబాద్ : అంతర్రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే కొరటా – చనాఖా ప్రాజెక్టును చేపట్టిన సర్కారు.. ఇప్పుడు తెలంగాణ – మహారాష్ట్ర ఉమ్మడి పెండింగ్ ప్రాజెక్టు లెండి నిర్మాణాన్ని పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తోంది. మంగళవారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(అంతర్రాష్ట్ర వ్యవహారాలు) టంకశాల అశోక్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు చర్చలు జరిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే క్షామ పీడిత ప్రాంతమైన కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పరిధిలోని 28 వేల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలం కానుంది. పునరావాసమే ప్రధాన సమస్య.. మంజీర ఉపనది లెండిపై నాందేడ్ జిల్లాలోని గోనేగాం వద్ద ప్రాజెక్టు నిర్మించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టాయి. అయితే ఈ పనులు మూడు దశాబ్దాలు గడుస్తున్నా ఎటూ తేలడం లేదు. ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులుగా మారుతున్న వారికి పునరావాసం కల్పించడమే ప్రధాన అడ్డంకిగా మారింది. తమకు పునరావాసం కల్పించిన తర్వాతే ఈ పనులను చేపట్టాలని నిర్వాసితులు 2011లో పనులను నిలిపేశారు. ప్రాజెక్టుతో మహారాష్ట్రలోని మొత్తం 12 గ్రామాల వాసులు నిర్వాసితులుగా మారతారు. 19 గ్రామాలకు చెందిన రైతుల భూములు నీట మునుగుతాయి. మొదటి విడతలో ఏడు గ్రామాలకు, రెండో విడతలో మరో ఐదు గ్రామాలకు పునరావాసం కల్పించాలని నిర్ణయించారు. నిర్వాసితులు అడ్డుకోవడంతో ఎనిమిదేళ్లుగా ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. రూ.2,183 కోట్లకు పెరిగిన అంచనాలు.. 1985లో లెండి ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. రూ. 54.55 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఇందులో రూ.45.51 కోట్లు మహారాష్ట్ర సర్కారు భరించాల్సి ఉండగా, రూ.9.04 కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంది. అయితే పనులు నత్తనడకన సాగడంతో అంచనా వ్యయం పెరుగుతూ వచ్చింది. 2001లో రివైజ్డ్ అంచనాల ప్రకారం ప్రాజెక్టు వ్యయం రూ. 274.83 కోట్లకు చేరింది. తర్వాత మరో మూడు పర్యాయాలు అంచనాలను పెంచారు. ప్రస్తుతం 2017–18 (డీఎస్ఆర్ ప్రకారం) ప్రాజెక్టు అంచనా వ్యయం ఏకంగా రూ. 2,183.88 కోట్లకు చేరింది. రూ.550 కోట్ల మేర పనులు పూర్తి.. ఇరు రాష్ట్రాలు కలిపి ఈ ప్రాజెక్టుపై ఇప్పటి వరకు రూ. 550.61 కోట్లు ఖర్చు చేశాయి. ఇందులో మన రాష్ట్ర వాటా రూ.232.82 కోట్లు.. మిగిలిన రూ. 317.79 కోట్లు మహారాష్ట్ర సర్కారు వెచ్చించింది. ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి.. ► ఎర్త్‌డ్యాం పనులు 70 శాతం వరకు పూర్తయ్యాయి. ముంపునకు గురవుతున్న నిర్వాసితులకు పునరావాసం కల్పించిన తర్వాతే మిగిలిన 30 శాతం పనులను పూర్తి చేయాల్సి పరిస్థితి నెలకొంది. ► స్పిల్‌వే పనులు 80శాతం, పవర్ అవుట్లెట్ పనులు 90 శాతం పూర్తయ్యా యి. అత్యవసర గేట్ల నిర్మాణం, స్లూయిస్ గేట్ల పనులు చేపట్టాల్సి ఉంది. ► స్పిల్‌వే పై 14 రైడల్ గేట్ల తయారీ పూర్తయింది. పది గేట్లను బిగించారు. ► తెలంగాణకు సాగు నీరందించే కుడి కాలువ మొత్తం పొడువు 35 కి.మీ.లు. ఇందులో 9.43 కి.మీ.లు మహారాష్ట్ర పరి«ధిలో ఉంది. మహారాష్ట్ర పరిధిలోని కాలువల నిర్మాణ పనుల కోసం నిధులను తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర సర్కారుకు డిపాజిట్ చేసింది. లెండి ప్రాజెక్టు నీటి వాటాలు.. ఆయకట్టు మొత్తం నీటి లభ్యత 6.36 టీఎంసీలు తెలంగాణ (38 శాతం) 2.43 టీఎంసీలు మహారాష్ట్ర (62 శాతం) 3.93 టీఎంసీలు -
'లెండి' పూర్తికి సహకరించండి
- మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నీవీస్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ - ప్రాజెక్టు జాప్యంతో పెరిగిన అంచనా వ్యయం - రూ.275కోట్ల నుంచి రూ.554కోట్లు పెరిగిన వ్యయం సాక్షి, హైదరాబాద్ అంతరాష్ట్ర ప్రాజెక్టుగా ఉన్న లెండిని త్వరితగతిన పూర్తి చేయాలని, దీనికి సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు తోడ్పడాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు విన్నవించారు. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రికి రాసిన లేఖను ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం స్వయంగా ఫడ్నీవీస్‌కు అందించారు. 2014జులై 23న ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖా మంత్రులు లెండిపై చర్చించారని, 2015 ఫిబ్రవరి 17న మరోసారి చర్చించారని ముఖ్యమంత్రి తన లేఖలో గుర్తు చేశారు. లెండికి వసరమైన అనుమతులు తీసుకోవాలని, పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కేసీఆర్ లేఖలో కోరారు. ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘం వద్ద అనుమతులు తీసుకోవడంలో వేగం పెంచాలన్నారు. ప్రాజెక్టు కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రూ.183,83కోట్లు మహారాష్ట్ర ప్రభుత్వానికి డిపాజిట్ చేసిందని, అయితే సుదీర్ఘ జాప్యం వల్ల ప్రాజెక్టు వ్యయం రూ.275.83కోట లనుంచి రూ.554.54కోట్లకు పెరిగిందరి గుర్తు చేశారు. జాప్యం జరుగుతున్నా కొద్దీ వ్యవ అంచనాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2017 జూన్ నాటికి భూసేకరణ సహా అన్ని సమస్యలు అధిగమించి ప్రాజెక్టు పూర్తిచేయాలని నిర్ణయించామని తెలిపారు. లెండి తొలి దశ రిజర్వాయర్‌ను జూన్ 2018 నాటికి పూర్తిచేసి క్రస్ట్ వరకు నీటి నిల్వ చేసేందుకు సహకరించాలని లేఖలో కోరారు. ప్రాజెక్టు వ్యయం, ఇతర సహకారం విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించేందుకు సిధ్దంగా ఉందని వెల్లడించారు. -
‘లెండి’ ముందుకు సాగేనా!
పనులకు నిధుల కొరత సా..గుతున్న ‘సాగర్’ కాలువల నిర్మాణం నల్లవాగు మళ్లింపు పరిస్థితీ అంతే నేడు భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు రాక బాన్సువాడ : మందకొడిగా సాగుతున్న నిజాంసాగర్ ప్రధాన కాలువ పను లు.. అర్ధాంతరంగా నిలిచిన అంతర్రాష్ట్ర లెండి ప్రాజెక్టు.. ప్రతిపాదనలు పూర్తయినా అనుమతి లభించని నల్లవాగు మళ్లింపు.. ఇలా ఏ పనీ పూర్తికాక.. రైతన్న కలలు కల్లలుగానే మిగిలాయి. 2004లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పనులను ప్రారంభించగా, ఆయన అకాల మరణం తర్వాత పనులన్నీ ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ చందంలా మారాయి. ఇప్పుడు రోజులు మారాయి. ఎన్నో ఏళ్ల ఆకాంక్ష ఫలిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇక ఇప్పుడైనా ఆయా పనులను పూర్తవుతాయన్న గంపెడు ఆశతో జిల్లా రైతులు ఉన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తొలిసారి ఆదివారం జిల్లాలోని బాన్సువాడకు వస్తున్నారు. ఈ సందర్భంగా పెండింగ్ ప్రాజెక్టులు, సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు ‘సాక్షి’ అందిస్తున్న కథనమిది. నత్తనడకన నిజాంసాగర్ ఆధునికీకరణ పల్లెబాటలో భాగంగా 2004 నవంబర్ 9న అప్పటి సీఎం వైఎస్సార్ నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా సాగర్ దుస్థితిపై ఆవేదన చెందారు. ప్రాజెక్టుకు చెందిన కాలువలు శిథిలావస్థలో ఉండగా, ప్రధాన కాలువల ఆధునికీకరణకు 2007లో రూ. 549.60 కోట్లను మంజూరు చేశారు. నిజాంసాగర్ జీరో పాయింట్ నుంచి బాల్కొండ వరకు సుమారు 155 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రధాన కాలువను ఆధునీకరించేందుకు 15 ప్యాకేజీల ద్వారా ఈ పనులు చేపట్టారు. ఈ మేరకు గత రెండేళ్లలో నిధులను సైతం కేటాయించగా, పనులు కొనసాగుతున్నాయి. ఆయన అకాల మరణం తర్వాత బడ్జెట్లో అరకొర నిధులను మాత్రమే కేటాయిస్తుండడంతో పనులన్నీ పడకేశాయి. మొరం పనులు నాసిరకంగా చేయడంతో కాలువ విడుదల చేసినప్పుడల్లా కొట్టుకుపోతోంది. మరో ఐదేళ్ల వరకు ఈ పనులు పూర్తయ్యేటట్లు కనిపించడం లేదు. ప్రతిపాదనలకే పరిమితం 2008లో మరోసారి నిజాంసాగర్‌ను సంద ర్శించిన దివంగత సీఎం వైఎస్సార్ ప్రాజెక్టు పరిసరాల్లో సుమారు 500 ఎకరాల్లో బృందావన్ గార్డెన్‌లా మార్చాలని, నల్లవాగు నుంచి నీటిని మళ్లించి ఆయకట్టును సస్యశ్యామలం చేయాలని భావించారు. ఇందుకు ప్రతిపాదనలు సైతం చేయించారు. బృందావన్ గార్డెన్ కోసం పర్యాటక శాఖ అధికారులతో అంచనాలు సైతం వేయించారు. కానీ ఆ ప్రతిపాదనలు నేటికీ ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఐదేళ్లక్రితం 35కోట్లతో నల్లవాగు మళ్లింపు పథకానికి అధికారులు ప్రతిపాదనలు చేయగా, నేడు పెరిగిన ధరల కారణంగా అది కాస్తా రూ.90 కోట్లకు చేరింది. మెదక్‌లో ఉన్న నల్లవాగు రిజర్వాయర్‌లో కర్ణాటక ప్రాంతం నుంచి వర్షపు నీరు వచ్చి చేరుతుంది. ప్రతీ ఏడాది జూన్, జూలైల్లోనే ఈ రిజర్వాయర్ నిండుకుండలా మారడంతో, దిగువన సుమారు 2 నుంచి 3 టీఎంసీల నీటిని వాగులోకి వదిలేస్తారు. ఈ వాగులోనే కాకివాగు, పిల్లివాగు కలుస్తాయి. ఈ వరద నీరు నిజాంసాగర్ ప్రాజెక్టుకు దిగువన సుమారు 2 కిలోమీటర్ల దూరంలో మంజీరా నదిలో కలుస్తాయి. ఈ నీటిని నిజాంసాగర్‌లోకి మళ్లి స్తే రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. పట్టించుకోరు ‘లెండి’..! అంతర్ రాష్ట్ర ప్రాజెక్టు అయిన లెండి నిర్మాణానికీ వైఎస్సార్ హయాంలోనే రూ.112 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో కాలువ పనులు, నష్ట పరిహారం చెల్లింపు పూర్తి చేశారు. అయితే కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ హయాంలో 2011లో రూ.50 కోట్లు కేటాయించగా, 2012లో సుమారు రూ.100 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులను నేటికీ విడుదల చేయలేదు. లెండి నదితో రెండు రాష్ట్రాల్లోని వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో 1985లో లెండి ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, ఎస్బీ చవాన్ ఒప్పందం చేసుకున్నారు. అప్పట్లో దీని అంచనా విలువ రూ. 54కోట్లు. మహారాష్ట్ర ప్రభుత్వం 62 శాతం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 38 శాతం ఖర్చు చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టులోని 6.36 టీఎంసీల నీటిలో ఆంధ్రవాటా 2.43 టీఎంసీలుగా, మహారాష్ట్ర వాటా 3.93 టీఎంసీలుగా నిర్ణయించారు. లెండి ప్రాజెక్టుకు మొత్తం 14 గేట్లకు గాను 8గేట్లను పూర్తి చేశారు. ఇంకా ఆరు గేట్లు నిర్మించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వరకు మహారాష్ట్రలో 19.5 కిలోమీటర్ల దూరం ఉమ్మడి పైపులైన్ వేయాల్సి ఉంది. ఇందుకు మన రాష్ట్ర ప్రభుత్వం రూ. 20కోట్లు మహారాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించినా ఇంత వరకు పైప్‌లైన్ పనులు ప్రారంభం కాలేదు. ఇప్పటి వరకు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 202 కోట్ల రూపాయలు కేటాయించి, రూ. 123 కోట్లు మహారాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. మద్నూర్, బిచ్కుంద మండలాల్లో లెండి కాలువ పనులు కొనసాగుతున్నాయి. ఇటీవల ఈ ప్రాజెక్టు గురించి మహా రాష్ట్ర ప్రభుత్వంతో హరీశ్‌రావు చర్చలు నిర్వహించడం శుభపరిణామం. మిగితా సమస్యల ను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. -
లెండిపై కన్నేసిన ‘మహా’ సర్కారు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మంజీరా నదిపై లెండి ప్రాజెక్టు ఎగువ భాగం లో మరో మూడు ఎత్తిపోతల పథకాలను చేపట్టేందు కు మహా సర్కారు కుట్ర పన్నుతోంది. కేంద్ర జలవనరుల సంఘం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పేర్కొన్నారు. మంగళవారం బాబ్లీ గేట్ల మూసివేత సందర్భంగా వారు మా ట్లాడిన తీరు చూస్తుంటే జిల్లాకు తాగు, సాగునీటి గండం తప్పదనిపిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు అక్టోబర్ 28 నుంచి జూన్ 30 వరకు బాబ్లీ గేట్లను మూసివేసే అవకాశం ఉంది. ఎనిమిది నెలలు బాబ్లీ గేట్లు మూసి ఉంచడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోని 60 టీఎంసీల నీటికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉం టుంది. గేట్లను తెరిచిన కూడా సాగర్‌లోని ఈ నీరు బాబ్లీలోకి వెళుతుందని పేర్కొంటున్నారు. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు తీవ్ర నష్టం వాటిల్లినుంది. బాబ్లీ గేట్ల మూసి వేత సందర్భంగా మ హారాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పేర్కొన్న తీరును పరిశీలిస్తే అంతర్రాష్ట్ర ప్రాజెక్టు అయిన లెండిని బాబ్లీలాగానే దక్కించుకునేందుకు కుట్రపన్నుతున్నట్లు తెలుస్తుం ది. ఇదే జరిగితే జుక్కల్ నియోజకవర్గంలోని 22,700 ఎకరాల ఆయకట్టు ఎడారిగా మారే అవకాశాలు స్పష్టమవుతున్నాయి.మహారాష్ట్ర,ఆంధ్ర సరిహద్దుల మధ్య ప్రవహిస్తున్న మంజీరానదిపై లెండి ప్రాజెక్టు ఎగు వ భాగంలో మరో మూడు ఎత్తిపోతల పథకాలను ని ర్మించేందుకు మహారాష్ట్ర కుట్ర చేస్తోంది.