‘లెండి’ ముందుకు సాగేనా! | lendi project works are going slowly | Sakshi
Sakshi News home page

‘లెండి’ ముందుకు సాగేనా!

Published Sun, Jul 27 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 10:55 AM

‘లెండి’ ముందుకు సాగేనా!

‘లెండి’ ముందుకు సాగేనా!

పనులకు నిధుల కొరత
సా..గుతున్న ‘సాగర్’ కాలువల నిర్మాణం
నల్లవాగు మళ్లింపు పరిస్థితీ అంతే
నేడు భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు రాక


బాన్సువాడ : మందకొడిగా సాగుతున్న నిజాంసాగర్ ప్రధాన కాలువ పను లు.. అర్ధాంతరంగా నిలిచిన అంతర్‌రాష్ట్ర లెండి ప్రాజెక్టు.. ప్రతిపాదనలు పూర్తయినా అనుమతి లభించని నల్లవాగు మళ్లింపు.. ఇలా ఏ పనీ  పూర్తికాక.. రైతన్న కలలు కల్లలుగానే మిగిలాయి. 2004లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పనులను ప్రారంభించగా, ఆయన అకాల మరణం తర్వాత పనులన్నీ ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ చందంలా మారాయి. ఇప్పుడు రోజులు మారాయి. ఎన్నో ఏళ్ల ఆకాంక్ష ఫలిచింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇక ఇప్పుడైనా ఆయా పనులను పూర్తవుతాయన్న గంపెడు ఆశతో జిల్లా రైతులు ఉన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తొలిసారి ఆదివారం జిల్లాలోని బాన్సువాడకు వస్తున్నారు. ఈ సందర్భంగా పెండింగ్ ప్రాజెక్టులు, సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు ‘సాక్షి’ అందిస్తున్న కథనమిది.

నత్తనడకన నిజాంసాగర్ ఆధునికీకరణ
పల్లెబాటలో భాగంగా 2004 నవంబర్ 9న అప్పటి సీఎం వైఎస్సార్ నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా సాగర్ దుస్థితిపై ఆవేదన చెందారు. ప్రాజెక్టుకు చెందిన కాలువలు శిథిలావస్థలో ఉండగా, ప్రధాన కాలువల ఆధునికీకరణకు 2007లో రూ. 549.60 కోట్లను మంజూరు చేశారు. నిజాంసాగర్ జీరో పాయింట్ నుంచి బాల్కొండ వరకు సుమారు 155 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రధాన కాలువను ఆధునీకరించేందుకు 15 ప్యాకేజీల ద్వారా ఈ పనులు చేపట్టారు.

ఈ మేరకు గత రెండేళ్లలో  నిధులను సైతం కేటాయించగా, పనులు కొనసాగుతున్నాయి. ఆయన అకాల మరణం తర్వాత బడ్జెట్‌లో అరకొర నిధులను మాత్రమే కేటాయిస్తుండడంతో పనులన్నీ పడకేశాయి.  మొరం పనులు నాసిరకంగా చేయడంతో కాలువ విడుదల చేసినప్పుడల్లా కొట్టుకుపోతోంది. మరో ఐదేళ్ల వరకు ఈ పనులు పూర్తయ్యేటట్లు కనిపించడం లేదు.

ప్రతిపాదనలకే పరిమితం
2008లో మరోసారి నిజాంసాగర్‌ను సంద ర్శించిన దివంగత సీఎం వైఎస్సార్ ప్రాజెక్టు పరిసరాల్లో సుమారు 500 ఎకరాల్లో బృందావన్ గార్డెన్‌లా మార్చాలని, నల్లవాగు నుంచి నీటిని మళ్లించి ఆయకట్టును సస్యశ్యామలం చేయాలని భావించారు. ఇందుకు ప్రతిపాదనలు సైతం చేయించారు. బృందావన్ గార్డెన్ కోసం పర్యాటక శాఖ అధికారులతో అంచనాలు సైతం వేయించారు. కానీ ఆ ప్రతిపాదనలు నేటికీ ప్రాథమిక దశలోనే ఉన్నాయి.

ఐదేళ్లక్రితం 35కోట్లతో నల్లవాగు మళ్లింపు పథకానికి అధికారులు ప్రతిపాదనలు చేయగా, నేడు పెరిగిన ధరల కారణంగా అది కాస్తా రూ.90 కోట్లకు చేరింది. మెదక్‌లో ఉన్న నల్లవాగు రిజర్వాయర్‌లో కర్ణాటక ప్రాంతం నుంచి వర్షపు నీరు వచ్చి చేరుతుంది. ప్రతీ ఏడాది జూన్, జూలైల్లోనే ఈ రిజర్వాయర్ నిండుకుండలా మారడంతో, దిగువన సుమారు 2 నుంచి 3 టీఎంసీల నీటిని వాగులోకి వదిలేస్తారు. ఈ వాగులోనే కాకివాగు, పిల్లివాగు కలుస్తాయి. ఈ వరద నీరు నిజాంసాగర్ ప్రాజెక్టుకు దిగువన సుమారు 2 కిలోమీటర్ల దూరంలో మంజీరా నదిలో కలుస్తాయి.  ఈ నీటిని నిజాంసాగర్‌లోకి మళ్లి స్తే రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది.

పట్టించుకోరు ‘లెండి’..!
అంతర్ రాష్ట్ర ప్రాజెక్టు అయిన లెండి నిర్మాణానికీ వైఎస్సార్ హయాంలోనే రూ.112 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో కాలువ పనులు, నష్ట పరిహారం చెల్లింపు పూర్తి చేశారు. అయితే కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ హయాంలో 2011లో రూ.50 కోట్లు కేటాయించగా, 2012లో సుమారు రూ.100 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులను నేటికీ విడుదల చేయలేదు. లెండి నదితో రెండు రాష్ట్రాల్లోని వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో 1985లో లెండి ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రులు ఎన్‌టీ రామారావు, ఎస్‌బీ చవాన్ ఒప్పందం చేసుకున్నారు.

అప్పట్లో దీని అంచనా విలువ రూ. 54కోట్లు. మహారాష్ట్ర ప్రభుత్వం 62 శాతం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 38 శాతం ఖర్చు చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టులోని 6.36 టీఎంసీల నీటిలో ఆంధ్రవాటా 2.43 టీఎంసీలుగా, మహారాష్ట్ర వాటా 3.93 టీఎంసీలుగా నిర్ణయించారు. లెండి ప్రాజెక్టుకు మొత్తం 14 గేట్లకు గాను 8గేట్లను పూర్తి చేశారు. ఇంకా ఆరు గేట్లు నిర్మించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వరకు మహారాష్ట్రలో 19.5 కిలోమీటర్ల దూరం ఉమ్మడి పైపులైన్ వేయాల్సి ఉంది.

ఇందుకు మన రాష్ట్ర ప్రభుత్వం రూ. 20కోట్లు మహారాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించినా ఇంత వరకు పైప్‌లైన్ పనులు ప్రారంభం కాలేదు. ఇప్పటి వరకు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 202 కోట్ల రూపాయలు కేటాయించి, రూ. 123 కోట్లు మహారాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. మద్నూర్, బిచ్కుంద మండలాల్లో లెండి కాలువ పనులు కొనసాగుతున్నాయి. ఇటీవల ఈ ప్రాజెక్టు గురించి మహా రాష్ట్ర ప్రభుత్వంతో హరీశ్‌రావు చర్చలు నిర్వహించడం శుభపరిణామం. మిగితా సమస్యల ను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement