‘పిల్ల కాల్వ’ల కళకళ!  | Telangana Government Special Focus On Irrigation Projects | Sakshi
Sakshi News home page

‘పిల్ల కాల్వ’ల కళకళ! 

Published Thu, May 23 2019 3:24 AM | Last Updated on Thu, May 23 2019 3:24 AM

Telangana Government Special Focus On Irrigation Projects - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాలనంతా సస్యశ్యామలం చేసే వ్యూహాలకు ప్రభుత్వం మరింత పదును పెట్టింది. ప్రాజెక్టు పరిధిలోని 13.60 లక్షల ఎకరాల్లో చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించే ప్రణాళికను ఇప్పటికే అమల్లో పెట్టగా, దాన్ని మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దే పనిలో పడింది. ప్రాజెక్టు పరిధిలో ముప్పై ఏళ్ల కింద నిర్మించిన కాల్వకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి ఆధునీకరించే పనులను చేస్తున్న ప్రభుత్వం, తాజాగా వాటి పరిధిలోని డిస్ట్రిబ్యూటరీల (పిల్ల కాల్వలు)ను పూర్తి స్థాయిలో ఆధునీకరించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం రూ.419 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది.  

ప్రతి ఎకరాకు నీటిబొట్టు 
ఎస్సారెస్పీలో భాగంగా ఉండే కాకతీయ కాల్వ, సరస్వతి, లక్ష్మీ కాల్వల ద్వారా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాలో మొత్తంగా స్టేజ్‌–1 కింద 9.68 లక్షలు, స్టేజ్‌–2 కింద మరో 4లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా ఉండేది. ఇందులో ఎస్సారెస్పీ నుంచి మానేరు వరకు 146 కిలోమీటర్ల వరకు ఉన్న కాల్వ నీటి ప్రవాహ సామర్థ్యం వాస్తవానికి 9,700 క్యూసెక్కులు. కానీ కాల్వలో చాలాచోట్ల పూడిక, పిచ్చిమొక్కలు పెరగడం, సిమెంట్‌ నిర్మాణాలు దెబ్బతినడంతో దాని ప్రవాహ సామర్థ్యం 5 వేలకు పడిపోయింది. దీంతో ఎగువ మానేరులో ఉన్న సుమారు 4.60 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందడం గగనంగా మారింది.

దీంతోపాటే మానేరు దిగువన 146 కిలోమీటర్‌ నుంచి 234 కిలోమీటర్‌ వరకు కాల్వ ప్రవాహ సామర్థ్యం 8,505 క్యూసెక్కులు ఉండగా, అది 3 వేల క్యూసెక్కులకు పడిపోయింది. దీంతో దిగువ మానేరులో ఉన్న 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు గడ్డు పరిస్థితి ఏర్పడుతోంది. దీనిపై గతంలోనే సమీక్షించిన సీఎం కేసీఆర్‌ కాల్వల ఆధునికీకరణ చేపట్టాలని నిర్ణయించి రూ 200 కోట్లతో పనులకు ఆదేశించారు. దీంతో కాల్వల సామర్ధ్యం 5వేల క్యూసెక్కుల వరకు పెరిగింది. అనంతరం కాల్వల ఆధునికీకరణకు అదనంగా రూ.863 కోట్ల వరకు కేటాయించారు. ఈ పనులు కొనసాగుతున్నాయి. రెండోసారి ప్రభుత్వం ఏర్పాటయిన అనంతరం ఫిబ్రవరి 7న మరోమారు కాల్వల ఆధునికీకరణపై సమీక్షించిన ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఖరీఫ్‌లోనే ఎస్సారెస్పీ పూర్తి స్థాయిలో నీరందించనున్న దృష్ట్యా, చివరి ఆయకట్టు వరకు నీరందేలా కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల మరమ్మతుల పనులు పూర్తి చేయా లని ఆదేశించారు.

కాల్వలను పూర్తి స్థాయి డిశ్చార్జి సామర్థ్యానికి తెచ్చేందుకు ఆదేశాలిచ్చారు. డిస్ట్రిబ్యూటరీల ఆధునీకరణకు అయ్యే వ్యయ అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో కదిలిన అధికారులు మొత్తంగా డిస్ట్రిబ్యూటరీల పనులకు రూ.419.75 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో కాకతీయ కాల్వ పనులకు రూ.88.39 కోట్లు, దాని కింది డిస్ట్రిబ్యూటరీలకు రూ.263.41 కోట్లు, సరస్వతి కెనాల్‌కు రూ.29.40 కోట్లు, లక్ష్మీ కెనాల్‌ డిస్ట్రిబ్యూటరీలకు రూ.19.67 కోట్లు, సదర్‌మట్‌కింద 17.47 కోట్లు, మిగతా పనులకు రూ.1.41కోట్లతో అంచనా లు రూపొందిం చారు. ఈ ప్రతిపాదనల ఆమోదానికై ప్రభుత్వ పరిశీలనకు పంపారు. ఈ పనులను వీలైనంత త్వరగా చేపట్టాల్సి ఉన్నందున తక్కువ సమయంలోనే వీటికి ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు తెలిపాయి. ఈ పనులు పూర్తయితే కాళేశ్వరం నీటితో ప్రతి ఎకరాకు నీరందే అవకాశం ఉంటుందని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement