Party Office Lands TDP Chandrababu Naidu Yellow Media Fake Propaganda - Sakshi
Sakshi News home page

సైకిల్‌ పైనే షాపింగ్‌.. పార్టీ ఆఫీసుల కోసం బరితెగించింది చంద్రబాబే

Published Sat, Dec 24 2022 7:41 AM | Last Updated on Sat, Dec 24 2022 2:51 PM

Party office lands TDP Chandrababu Naidu Yellow media fake Propaganda - Sakshi

సాక్షి, అమరావతి: నిబంధనలకు లోబడి వైఎస్సార్‌సీపీ కార్యాలయాల కోసం రెండుమూడు చోట్ల రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించడాన్ని చిలవలు పలువలు చేసి రాద్ధాంతం చేస్తున్న ‘ఈనాడు’కు చంద్రబాబు హయాంలో అడ్డగోలుగా టీడీపీ కార్యాల­యాలకు భూ సంతర్పణలు కానరాలేదు. ఐదేళ్ల టీడీపీ పాలనలో రూ.వందల కోట్ల విలువైన భూములు ఆ పార్టీ పరమయ్యాయి.

నాడు చంద్ర­బాబు కేవలం తమ పార్టీకే భూములు దక్కేలా 2016లో ఒక జీవో ఇచ్చారు. దాన్ని అడ్డుపెట్టుకుని అత్యంత విలువైన భూములను 33ఏళ్లు, మరికొన్నింటిని 99 ఏళ్ల లీజుపై కారుచౌకగా టీడీపీకి కట్టబెట్టారు. సమీపంలోని ప్రభుత్వ, పేదల స్థలాలను సైతం ఆక్రమించి టీడీపీ కార్యాలయా­లను నిర్మించుకున్నారు. పసుపు రంగుతో కనిపించే విలాసవంతమైన టీడీపీ కార్యాలయ భవనాల వెనుక ఎన్నో దురాగతాలు, అన్యాయాలున్నాయి. 

రైతుల కడుపుకొట్టి.. వాగు భూమిని ఆక్రమించి
ప్రస్తుతం చంద్రబాబు దర్జాగా సమావేశాలు నిర్వహిస్తున్న మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయమైన ఎన్టీఆర్‌ భవన్‌ పునాదుల్లో పేద రైతు కుటుంబాలు ఛిద్రమైపోయాయి. జాతీయ రహదారి పక్కన కబ్జా చేసిన స్థలంలో విలాసవంతంగా కార్పొరేట్‌ హంగులతో  భవన నిర్మాణంపై కోర్టు కేసులు దాఖలయ్యాయి. ఆత్మకూరు సర్వే నెంబర్‌ 392లో 3.65ఎకరాల భూమిని 99 ఏళ్ల లీజుపై టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు కేటాయించుకున్నారు. సుమారు రూ.50కోట్ల విలువైన ఈ భూమిని ఏడాదికి ఎకరానికి రూ.వెయ్యి లీజుపై కేటాయిస్తూ 2017లో చంద్రబాబు ప్రభుత్వం జీవో ఇచ్చింది.

అయితే ఇదే భూమిని 1974లో ప్రభుత్వం అదే గ్రామానికి చెందిన బొమ్ము రామిరెడ్డి, కొల్లా రఘురాఘవరావు, కొల్లా భాస్కరరావు మరికొందరు రైతులకు కేటాయించి పట్టాలు ఇవ్వడం గమనార్హం. వారంతా అప్పటి నుంచి అందులో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై రైతులు కోర్టుకెళ్లి స్టే ఆర్డర్‌ తెచ్చుకున్నా అధికారమదంతో చంద్రబాబు సర్కారు ఖాతరు చేయలేదు. పక్కనే ఉన్న వాగు స్థలాన్ని కూడా పూడ్చేసి టీడీపీ కార్యాలయాన్ని నిర్మించారు. అన్యాయానికి గురైన రైతుల్లో కొందరు టీడీపీ సానుభూతిపరులూ ఉండటం గమనార్హం.

బెజవాడ ఆటోనగర్‌లో రూ.25 కోట్ల స్థలం
విజయవాడ నడిబొడ్డున ఆటోనగర్‌–గురునానక్‌ నగర్‌ కాలనీ మధ్యలో ఉన్న 93 సెంట్ల స్థలాన్ని 2016 జూలైలో టీడీపీ కాజేసింది. అప్పట్లోనే దీని విలువ రూ.25 కోట్ల పైమాటే. ఇరిగేషన్‌ శాఖకు చెందిన అత్యంత విలువైన స్థలాన్ని నాటి మంత్రి దేవినేని ఉమ కృష్ణా జిల్లా టీడీపీ కార్యాలయానికి ధారాదత్తం చేశారు. ఇరిగేషన్‌ అవసరాలకు ఈ స్థలం కావాలని అధికారులు చెబుతున్నా వినకుండా జిల్లా పార్టీ అధ్యక్షుడితో స్థలం కోసం దరఖాస్తు చేయించి వెంటనే ఇచ్చేశారు. ఏడాదికి కేవలం రూ.వెయ్యి చొప్పున 33ఏళ్లు లీజుకిచ్చారు. 

గుంటూరులో కార్పొరేషన్‌ స్థలం కబ్జా.. 
గుంటూరు అరండల్‌పేటలోని వెయ్యి గజాల విలువైన స్థలాన్ని టీడీపీ కారుచౌకగా కొట్టేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 1999 జూలై 1న ఈ స్థలాన్ని 30 ఏళ్ల లీజుకు టీడీపీ నేతలు తీసుకున్నారు. అనంతరం ఆ స్థలంతోపాటు పక్కనే ఉన్న 1,637 గజాల కార్పొరేషన్‌ స్థలాన్ని కూడా కబ్జా చేసి పార్టీ కార్యాలయాన్ని నిర్మించేశారు. లీజు డబ్బులను కూడా చెల్లించలేదు. ఆ భవనానికి ఎలాంటి అనుమతులు లేకపోవడం గమనార్హం. 

దసపల్లా భూముల్లో టీడీపీ ఆఫీసు 
విశాఖ మహారాణిపేటలోని దసపల్లా భూమిని పార్టీ కార్యాలయం కోసం చంద్రబాబు కేటాయించుకున్నారు. సర్వే నం.1196/7లోని రెండు వేల గజాల స్థలాన్ని 33 ఏళ్ల పాటు ఏడాదికి రూ.25 వేలు చొప్పున లీజుపై టీడీపీ కార్యాలయానికి 2002లో కేటాయించుకున్నారు. 2014లో అధికారంలో ఉండగా అక్కడ పార్టీ కార్యాలయాన్ని  కట్టేశారు. పక్కన ఉన్న కొండను తొలగించి 160గజాలు ఆక్రమించి కార్యాలయాన్ని నిర్మించారు. 

శ్రీకాకుళం దళితుల భూమిలో..
శ్రీకాకుళంలో దళితుల ఇళ్ల స్థలాల కోసం సేకరించిన స్థలాన్ని టీడీపీ గుంజుకుని పార్టీ కార్యాల­యాన్ని నిర్మించుకుంది. నగరంలోని 80 అడుగుల రోడ్డులో దళితులకు ఇళ్ల స్థలాల కోసం సాంఘిక సంక్షేమ శాఖ గతంలో భూముల్ని సేకరించి పంచింది. అందులో రెండు ఎకరాలు మిగలగా గురుకుల హాస్టల్‌ కట్టాలని భావించారు. దీనిపై కన్నేసిన టీడీపీ నేతలు 2015 సెప్టెంబర్‌లో కారుచౌకగా 99 ఏళ్లకు ఏడాదికి రూ.25వేల చొప్పున పార్టీ కార్యాలయం కోసం లీజుకు తీసుకున్నారు. దాని విలువ ఇప్పుడు రూ.40 కోట్ల పైమాటే. 

కాకినాడలో జడ్పీ స్థలం..
కాకినాడ కచేరిపేట (మేడ్‌లైన్‌ ప్రాంతం)లోని  సర్వే నెంబర్‌ 60/1లో జిల్లా పరిషత్‌కు చెందిన రెండు వేల గజాల  స్థలాన్ని టీడీపీ అప్పనంగా సొంతం చేసుకుంది. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ పేరుతో ఏటా రూ.25 వేల లీజుతో 99 ఏళ్లకు కేటాయించారు. 2015లో జీవో తెచ్చి వెంటనే పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. ఇది కాకినాడలోనే అత్యంత ఖరీదైన ప్రాంతం కావడం గమనార్హం. 

మరికొన్ని నిర్వాకాలివీ.. 
►చిలకలూరిపేటలో నాగార్జున సాగర్‌ కాలువ భూమి 20 సెంట్లు (2017లో)
►అనంతపురం జిల్లా రాప్తాడులో 1.10 ఎకరాల దేవుడి మాన్యం
►కర్నూలులో 25 సెంట్ల మున్సిపల్‌ స్థలం
►చిత్తూరులోని గాండ్లపల్లిలో 1.20 ఎకరాలు

ఇతరులకు అవకాశం లేకుండా..
2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ కార్యాలయాల ముసుగులో విలువైన భూముల్ని కొట్టేయడానికి చంద్రబాబు పథ­కం రూపొందించారు. అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు, కుదిరితే మండల కేంద్రాల్లో కూడా భూముల్ని కాజేసేం­దుకు తెర తీశారు. పార్టీ కార్యాల­యాలకు నామమాత్రపు ధరకు 99 ఏళ్ల లీజుపై కేటాయించేందుకు వీలుగా 2016 జూలై 22న ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ మినహా మరే ఇతర పార్టీకి భూములు దక్కకుండా నిబంధనలు విధించారు. గతంలో హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ కోసం సీఎం హోదాలో తానే దరఖాస్తు చేసుకుని, తానే కేటాయించుకున్న ఘనచరిత్ర చంద్రబాబుది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement