
దమ్ముంటే ఢిల్లీలో పోరాడదాం రా
ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి
♦ చంద్రబాబుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సవాల్
♦ చేతకానితనం నీదా, మాదా?
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని, కేంద్రంతో పోరాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. చంద్రబాబు తన తప్పుల్ని, చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు విపక్షాల మీద ఎదురు దాడికి దిగడం విజ్ఞత కాదని హితవుపలికారు. సోమవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ హోదా సాధనకు వామపక్షాల ఆధ్వర్యంలో ఇప్పటికే ఆదివారం నుంచి అనంతపురంలో దీక్షలు ప్రారంభించామని, ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపు ఇచ్చిందని చెప్పారు.
హోదా కోసం తాము ఢిల్లీలో చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తూ చంద్రబాబు ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ప్రత్యేక హోదాపై ఢిల్లీలో పోరాడడానికి తాము సిద్ధమేనని, ముఖ్యమంత్రికి దమ్ము, ధైర్యం ఉంటే అన్ని పార్టీలతో కలసి రావాలని సవాల్ చేశారు. ప్రత్యేక హోదాపై నానా యాగీ చేసిన వెంకయ్యనాయుడికి ఇప్పుడు నోరు పెగలడం లేదని, ఆయన్ను రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపించాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని, అదే జరిగితే నల్లజెండాలతో ఊరూరా నిరసన తెలుపుతామన్నారు. ఏపీ నుంచి నామినేషన్ వేసే నైతిక హక్కు వెంకయ్యకు లేదన్నారు. కృష్ణా జలాలపై ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలసి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకోవాలని సూచించారు.