
బాబు తాటాకు చప్పుళ్లకు భయపడం
సీఎం చంద్రబాబుకు ముద్రగడ బహిరంగ లేఖ
కిర్లంపూడి (తూర్పుగోదావరి): ముఖ్యమంత్రి చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు కాపుజాతి భయపడబోదని, తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఓపిక ఉన్నంత వరకే కాదు.. ఊపిరి ఉన్నంత వరకూ పోరాడతామని మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014 ఎన్నికల ప్రచారంలో కాపు జాతికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని తాను రోడ్డెక్కిన తరువాతే మంజునాథ కమిషన్ వేశారన్నారు.
అయినప్పటికీ ఆ కమిషన్ రాష్ట్రంలో పర్యటిస్తున్న సమాచారం లేదని, వెంటనే కమిషన్ కార్యకలాపాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తమకు ఇచ్చిన హామీలు అమలయ్యే వరకూ జైల్లో పెట్టి నిర్బంధించినా, కేసులు పెట్టి భయపెట్టినా ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదన్నారు. తమ డిమాండ్లతో బాబుకు లేఖ రాసినట్లు ముద్రగడ తెలిపారు.