అంతా భ్రాంతియేనా!
► నీటి మూటలవుతున్న జిల్లా మంత్రుల మాటలు
► శంకుస్థాపనతో సరిపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు
► ప్రకటనకే పరిమితమైన నిధుల కేటాయింపు
► ముందుకు సాగని గోరు చిక్కుడు ప్రాసెసింగ్ యూనిట్ పనులు
► సన్నగిల్లుతున్న రైతుల ఆశలు
కనగానపల్లి : కరువు జిల్లా రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గోరుచిక్కుడు ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులు శంకుస్థాపనకే పరిమితమయ్యాయి. నిధుల కేటాయింపులో ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్ల ఈ పనులు ముందుకు సాగడం లేదు. అతి తక్కువ వర్షపాతం నమోదవుతున్న అనంతపురం జిల్లాలో వేరుశనగకు ప్రత్యామ్నాయ పంటగా గోరు చిక్కుడు సాగు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మూడేళ్లుగా ఈ విషయంపై రైతులు చైతన్యం తీసుకువచ్చారు. దీంతో చాలా మంది రైతులు గోరుచిక్కుడు పంట సాగుకు ఉత్సాహం కనబరిచారు.
అయితే పంటకు సరైన మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో రైతులు వెనుకడుగు వేశారు. విషయాన్ని గుర్తించిన అధికారులు, మంత్రులు దీనిపై ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించి, జిల్లాలో గోరుచిక్కుడు మార్కెటింగ్, ప్రాసెసింగ్ యూనిట్ పెడితే కరువు రైతులను ఆదుకునేందుకు వీలవుతుందని తీర్మానించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగానే జిల్లాలో గోరుచిక్కుడు ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభిస్తున్నట్లు జిల్లా మంత్రులు ఆర్భాటంగా ప్రకటించారు. ఇందు కోసం కనగానపల్లి మండలం దాదులూరు సమీపంలో 44వ జాతీయ రహదారి పక్కనే ఉన్న సర్వే 498-2బిలో ఐదు ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసి, 2014 సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా కళ్యాణదుర్గం పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయించారు. అందులో ఈ యూనిట్ కూడా ఒకటి.
పునాదులు కూడా వేయని అధికారులు
ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన అనంతరం అదే ఏడాది అక్టోబర్ 25న జిల్లా మంత్రి పరిటాల సునీత, అప్పటి జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, జిల్లా వ్యవసాయాధికారులతో కలిసి దాదులూరులో పర్యటించారు. గోరుచిక్కుడు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్న స్థలాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని, ప్రభుత్వం రూ. 8 కోట్లు నిధులు కూడా కేటాయించినట్లు గొప్పగా చెప్పుకున్నారు.
తొలిదశలో రూ. 3 కోట్లు విడుదల చేసి గోదాముల నిర్మాణం చేపట్టనున్నట్లు నమ్మబలికారు. రైతులు ధైర్యంగా పంట సాగు చేపట్టాలని భరోసానిచ్చారు. ఈ ప్రకటన చేసి 17 నెలలు దాటినా ఇంత వరకూ అక్కడ పునాది రాయి కూడా వేయకపోవడం గమనార్హం. మంత్రి, అధికారుల మాటలు నమ్మి పంట సాగు చేపట్టి ఉంటే తమ బతుకులు మరింత దుర్భరమై ఉండేవని ఈ సందర్భంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బడ్జెట్ సమావేశాల్లో కనిపించని ప్రస్తావన
తమ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా పేర్కొంటున్న జిల్లా మంత్రులు.. అదే రైతుల తరుఫున ఏనాడూ అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇందుకు గోరుచిక్కుడు ప్రాసెసింగ్ యూనిట్ పనులు అద్దం పడుతున్నాయి. ఈ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రకటించిన రూ. 8 కోట్ల నిధుల కేటాయింపులపై ఎలాంటి ఊసే లేదు. కనీసం బడ్జెట్ సమావేశాల్లోనైనా దీనిపై ప్రస్తావన లేవనెత్తడంలో జిల్లా మంత్రులు విఫలమయ్యారు. ఫలితంగా యూనిట్ స్థాపన ప్రశ్నార్థకమవుతోంది.
త్వరలో పనులు ప్రారంభిస్తాం
గోరు చిక్కుడు ప్రాసెసింగ్ యూనిట్ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు జిల్లా మార్క్‌ఫెడ్ డీఎం బాల భాస్కర్ తెలిపారు. ఇందు కోసం దాదులూరు వద్ద ఐదు ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారని, తొలి విడత కిం ద రూ. 3 కోట్లు నిధులు వచ్చాయని, టెండర్లను ఆహ్వానించడంలో జాప్యం చోటు చేసుకుంటోందని అన్నారు. ఆర్‌కేవైఎస్ కింద కేంద్ర ప్రభుత్వమే ఈ పరిశ్రమ స్థాపనకు నిధులు కేటాయిస్తుందని ఆయన వివరించారు.