Joint Collector Satyanarayana
-
అఫిడవిట్ దాఖలుకు సమయం కావాలి: కొత్తపల్లి గీత
కాకినాడ: కులం విషయంలో నిజాన్ని నిర్థారణ చేసే బాధ్యత తనపై ఉందని అరకు ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. ఎంపీ గీత ఎస్టీ కాదని, అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ ట్రైబల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు కేసు ఆమె తన న్యాయవాదితో కలిసి శనివారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..కుల నిరూపణకు సంబంధించిన ఆధారాలను కమిటీకి ఇచ్చినట్లు తెలిపారు. అయితే అఫిడవిట్ దాఖలు చేయాలని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ ఆమెను ఆదేశించగా అందుకు తనకు కొంత సమయం కావాలని కోరినట్టు చెప్పారు. కొత్తపల్లి గీత తండ్రి గ్లాడియ జాకబ్ కుల నిర్ధారణలో భాగంగా శనివారం వై.రామవరం బస్టాండ్ ఆవరణలోని రామాలయం వద్ద తహశీల్దార్ ఎండీ యూసఫ్ జిలానీ బహిరంగ విచారణ నిర్వహించారు. వై.రామవరం మండలంలో కొత్తపల్లి ఇంటిపేరుగల వారెవరూ లేరని, గ్లాడియా జాకబ్‌కు రక్త సంబంధ బంధువులు కూడా ఎవరూ లేరని గ్రామ పెద్దలు తహశీల్దార్‌కు తెలియజేశారు. -
అంతా భ్రాంతియేనా!
► నీటి మూటలవుతున్న జిల్లా మంత్రుల మాటలు ► శంకుస్థాపనతో సరిపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ► ప్రకటనకే పరిమితమైన నిధుల కేటాయింపు ► ముందుకు సాగని గోరు చిక్కుడు ప్రాసెసింగ్ యూనిట్ పనులు ► సన్నగిల్లుతున్న రైతుల ఆశలు కనగానపల్లి : కరువు జిల్లా రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గోరుచిక్కుడు ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులు శంకుస్థాపనకే పరిమితమయ్యాయి. నిధుల కేటాయింపులో ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్ల ఈ పనులు ముందుకు సాగడం లేదు. అతి తక్కువ వర్షపాతం నమోదవుతున్న అనంతపురం జిల్లాలో వేరుశనగకు ప్రత్యామ్నాయ పంటగా గోరు చిక్కుడు సాగు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మూడేళ్లుగా ఈ విషయంపై రైతులు చైతన్యం తీసుకువచ్చారు. దీంతో చాలా మంది రైతులు గోరుచిక్కుడు పంట సాగుకు ఉత్సాహం కనబరిచారు. అయితే పంటకు సరైన మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో రైతులు వెనుకడుగు వేశారు. విషయాన్ని గుర్తించిన అధికారులు, మంత్రులు దీనిపై ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించి, జిల్లాలో గోరుచిక్కుడు మార్కెటింగ్, ప్రాసెసింగ్ యూనిట్ పెడితే కరువు రైతులను ఆదుకునేందుకు వీలవుతుందని తీర్మానించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగానే జిల్లాలో గోరుచిక్కుడు ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభిస్తున్నట్లు జిల్లా మంత్రులు ఆర్భాటంగా ప్రకటించారు. ఇందు కోసం కనగానపల్లి మండలం దాదులూరు సమీపంలో 44వ జాతీయ రహదారి పక్కనే ఉన్న సర్వే 498-2బిలో ఐదు ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసి, 2014 సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా కళ్యాణదుర్గం పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయించారు. అందులో ఈ యూనిట్ కూడా ఒకటి. పునాదులు కూడా వేయని అధికారులు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన అనంతరం అదే ఏడాది అక్టోబర్ 25న జిల్లా మంత్రి పరిటాల సునీత, అప్పటి జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, జిల్లా వ్యవసాయాధికారులతో కలిసి దాదులూరులో పర్యటించారు. గోరుచిక్కుడు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్న స్థలాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని, ప్రభుత్వం రూ. 8 కోట్లు నిధులు కూడా కేటాయించినట్లు గొప్పగా చెప్పుకున్నారు. తొలిదశలో రూ. 3 కోట్లు విడుదల చేసి గోదాముల నిర్మాణం చేపట్టనున్నట్లు నమ్మబలికారు. రైతులు ధైర్యంగా పంట సాగు చేపట్టాలని భరోసానిచ్చారు. ఈ ప్రకటన చేసి 17 నెలలు దాటినా ఇంత వరకూ అక్కడ పునాది రాయి కూడా వేయకపోవడం గమనార్హం. మంత్రి, అధికారుల మాటలు నమ్మి పంట సాగు చేపట్టి ఉంటే తమ బతుకులు మరింత దుర్భరమై ఉండేవని ఈ సందర్భంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ సమావేశాల్లో కనిపించని ప్రస్తావన తమ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా పేర్కొంటున్న జిల్లా మంత్రులు.. అదే రైతుల తరుఫున ఏనాడూ అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇందుకు గోరుచిక్కుడు ప్రాసెసింగ్ యూనిట్ పనులు అద్దం పడుతున్నాయి. ఈ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రకటించిన రూ. 8 కోట్ల నిధుల కేటాయింపులపై ఎలాంటి ఊసే లేదు. కనీసం బడ్జెట్ సమావేశాల్లోనైనా దీనిపై ప్రస్తావన లేవనెత్తడంలో జిల్లా మంత్రులు విఫలమయ్యారు. ఫలితంగా యూనిట్ స్థాపన ప్రశ్నార్థకమవుతోంది. త్వరలో పనులు ప్రారంభిస్తాం గోరు చిక్కుడు ప్రాసెసింగ్ యూనిట్ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు జిల్లా మార్క్‌ఫెడ్ డీఎం బాల భాస్కర్ తెలిపారు. ఇందు కోసం దాదులూరు వద్ద ఐదు ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారని, తొలి విడత కిం ద రూ. 3 కోట్లు నిధులు వచ్చాయని, టెండర్లను ఆహ్వానించడంలో జాప్యం చోటు చేసుకుంటోందని అన్నారు. ఆర్కేవైఎస్ కింద కేంద్ర ప్రభుత్వమే ఈ పరిశ్రమ స్థాపనకు నిధులు కేటాయిస్తుందని ఆయన వివరించారు. -
2 ఎకరాల నుంచి రూ.2 లక్షల కోట్లా?
♦ ఎలా ఎదిగారో చంద్రబాబు చెప్పాలి: ముద్రగడ పద్మనాభం ♦ మీరు ఆ కిటుకేదో చెబితే మా జాతి కూడా అలాగే అభివృద్ధి చెందుతుంది ♦ అప్పుడు ఏటా రూ.వేయి కోట్లూ అడగం ♦ సీఎం మొండి అయితే.. నేను జగమొండిని ♦ ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపేందుకే వైద్య పరీక్షల పేరిట సర్కారు హడావుడి ♦ అవేవో బాబుకు చేయిస్తే ఎన్నికల హామీలు గుర్తుకొస్తాయన్న ముద్రగడ కిర్లంపూడి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి / సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘సీఎం గారూ... మీరు రెండెకరాల రైతు స్థాయి నుంచి రూ.2 లక్షల కోట్ల రాజకీయ నేతగా ఎలా ఎదిగారో చెప్పండి..’ అని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. ‘చంద్రబాబు తన ఎదుగుదల గురించి పత్రికాముఖంగా చెప్పాలి. ఆయన ఆ కిటుకేదో పదిమందికీ చెబితే, మా జాతి కూడా ఆ విధంగా అభివృద్ధి చెందుతుంది. అప్పుడు ఏటా బడ్జెట్లో కేటాయించాల్సిందిగా కోరుతున్న రూ.1,000 కోట్లు కూడా అడగం..’ అని ముద్రగడ అన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎంతమంది పోలీసులను దించినా దీక్షను విరమించేది లేదని తేల్చిచెప్పారు. కాపులకు రిజర్వేషన్లు, కాపు కమిషన్‌కు నిధులు, కాపు నేతలపై కేసుల ఎత్తివేత తదితర డిమాండ్లతో సతీసమేతంగా తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష ఆదివారానికి మూడోరోజుకు చేరింది. ఉదయం 9 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం మొండి అయితే తాను జగమొండినన్నారు. జైల్లో పెట్టినా, సెలైన్ కట్టినా దీక్షను విరమించే ప్రశ్నే లేదన్నారు. ‘నీరసించి, కృశించి పోయి నేను దీక్షను ఆపుతానన్న భావన ప్రభుత్వంలో కనబడుతోంది. అది ఎన్నటికీ జరగదు. సీఎం ఇచ్చిన హామీలన్నింటిపైనా సానుకూలంగా స్పందించాలి...’ అని ముద్రగడ స్పష్టం చేశారు. తమ ఆరోగ్యం బాగానే ఉందనీ, ప్రజానీకంలో తప్పుడు సంకేతాలు పంపేందుకే ప్రభుత్వం వైద్య పరీక్షల పేరిట హడావుడి చేస్తోందని విమర్శించారు. దీక్షలో ఉన్న తమ ఆరోగ్యం పాడవుతోందంటూ తప్పుడు బులెటిన్లు చెప్పించి తమను అభాసుపాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ‘పంజాబ్, గుజరాత్ లలో ఒక సిక్కు వ్యక్తి 66 నుంచి 70 రోజుల వరకు దీక్ష చేసినట్లు విన్నా. పొట్టి శ్రీరాములు కూడా చాలా రోజులు దీక్ష చేశారు. అలాగే మేము కూడా ఆహారం లేకుండా ఉండగలం. దాన్ని చంద్రబాబు మెడికల్ హిస్టరీలో రాయించవచ్చు..’ అని వ్యాఖ్యానించారు. వైద్య పరీక్షల పేరిట అంబులెన్సు తెచ్చి ప్రతిసారీ హడావుడి చేయొద్దని, పదేపదే డిస్టర్బ్ చేయొద్దని కోరారు. వైద్య పరీక్షల కోసం వచ్చిన వైద్యులను వెనక్కి వెళ్లిపోవాలని కోరారు. బాబుకు వైద్య పరీక్షలు చేయించండి ‘నేను, నా శ్రీమతి ఇద్దరం బాగానే ఉన్నాం. మా ఆరోగ్యం బాగుంది. వైద్య పరీక్షలు అస్సలు వద్దు..’ అని ముద్రగడ తేల్చి చెప్పారు. వైద్యపరీక్షలకు అనుమతించాలని కోరిన జాయింట్ కలెక్టర్ సత్యనారాయణతో ఆయన పది నిమిషాల పాటు మాట్లాడారు. ‘మాకు చేయాలనుకుంటున్న వైద్య పరీక్షలేవో ముఖ్యమంత్రికి చేయించండి. ఆయన ఆరోగ్యం బాగుంటుంది. అప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి. అప్పుడన్నా ఆయనకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు గుర్తుకొస్తాయి. ఇదేదో వ్యంగ్యం కాదు. నిజంగానే చెబుతున్నాను. దయచేసి ముందు ఆ పని చేయించండి’ అని అధికారులను ముద్రగడ ప్రాధేయపడ్డారు. ఒక సామాజిక ప్రయోజనం కోసం ఉద్యమం ప్రారంభించినప్పుడే తాను చావు గురించిన భయం వదిలేశానన్నారు. తన భార్యకు కూడా అలాంటి భయమేమీ లేదన్నారు. తన జాతి ప్రయోజనం కోసం అంకితం కావాలనుకున్న తనకు మరణం పెద్దలెక్క కాదన్నారు. విద్యా, ఉద్యోగ అవకాశాలను పొందలేక భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉన్న తమ జాతి బిడ్డల కోసం ఈ ఉద్యమం చేస్తున్నానని పునరుద్ఘాటించారు. చంద్రబాబు ఈ ఉద్యమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించే బదులు... రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్ల రూపాయల ఆస్తి సంపాదించిన కిటుకేదో చెబితే తమ జాతి కూడా ఆ విధంగా వృద్ధి చెందుతుందని ముద్రగడ వ్యాఖ్యానించారు. -
ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన జేసీ
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట పట్టణంలోని ఇందిరానగర్‌లోని ప్రభుత్వ భూమిలో కొంత మంది వ్యక్తులు నిర్మించుకున్న ఇళ్లను జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ గురువారం పరిశీలించారు. ఇళ్లు నిర్మించుకున్న వారు జీఓ నంబర్ 58, 59 ప్రకారం అసైన్మెంట్ పట్టాలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇటీవల తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకున్నారు. ఈ విషయమై జాయింట్ కలెక్టర్ స్వయంగా పరిశీలించి మాట్లాడుతూ 125 గజాలలో 2014 జూన్ 2 నాటికి ఇంటి నిర్మాణం చేసుకున్న వారికి ఉచితంగా పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. ఆయన వెంట ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ వెంకటేశంతో పాటు ఐబీ అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి కట్టంగూర్ అంగన్వాడీ సిబ్బంది విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. గురువారం కట్టంగూర్‌లో అంగన్వాడీ కేంద్రం-3ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మాట్లాడారు. సరుకుల నాణ్యతను పరిశీలించిన అనంతరం వంటలు చేసి విద్యార్థులకు అందించాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ ప్రమీల, ఆర్ఐ పద్మ, వీఆర్ఓ వహీద్ తదితరులు ఉన్నారు. -
అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు
రాంనగర్:కిరోసిన్ పంపిణీలో అక్రమాలకు, అవకతవకలకు పాల్పడే డీలర్లపై కేసులు నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. జేసీ శనివారం తన చాంబర్లో జిల్లాలోని 21 మంది హోల్‌సేల్ కిరోసిన్ డీలర్లతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు చెందిన కిరోసిన్ ట్యాంకర్ పక్కదారి పట్టించి హైదరాబాద్‌లో దొరకడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలోని కిరోసిన్ డీలర్లు ప్రభుత్వానికి బకాయిపడిన ఒక కోటి రూపాయల ప్రైస్ ఈక్వలేషన్ ఫండ్ ఈనెల 16, 17 తేదీలోగా చెల్లించాలన్నారు. లేనిచో సీరియస్‌గా పరిగణించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతినెలా 20వ తేదీలోగా కిరోసిన్ లిప్టుచేసి పంపిణీకి చర్యలు తీసుకోవాలని, లిప్టింగ్, పంపిణీలో అలసత్వం చూపితే లెసైన్స్ రద్దుచేస్తామని హెచ్చరించారు. ప్రతి కిరోసిన్ ట్యాంకర్ వివరాలు పరిధిలోని తహసీల్దార్, డీటీ, డీఎస్‌ఓలకు తెలియజేయాలని, రూట్ ఆఫీసర్ సమక్షంలో పంపిణీ జరగాలని కోరారు. అనంతరం రబీ ధాన్యం కొనుగోలుపై పౌరసరఫరాలు మార్కెటింగ్, ఐకేపీ అధికారులతో సమీక్షించారు. ధాన్యం విక్రయించే రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు ప్రక్రియ పూర్తిచేసినందున రైతుల ఖాతాకు జమచేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకుల ద్వారా చెల్లింపుకై చర్యలు తీసుకుంటామన్నారు. మోత్కూరు, చౌ టుప్పల్, చిట్యాల ఏరియాలో ధాన్యం కొనుగోలు లేనందున కొనుగోలుకు ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. రైతులను అసౌకర్యానికి గురిచేయకుండా ధాన్యం కొనుగోలుకు అన్ని ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్ఓ నాగేశ్వర్రావు, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, డీఎంసీఎస్ వరకుమార్, డీఆర్డీఏ పీడీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ‘ఆహారభద్రత’
రాంగనర్ : అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఆహారభద్రత కార్డులు మంజూరు చేస్తామని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. మంగళవారం నిర్వహించిన జేసీ ఫోన్ ఇన్ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేశారు. మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, కోదాడ, హాలియ, త్రిపురారం, దేవరకొండ, నకిరేకల్, మోత్కూర్ తదితర ప్రాం తాల నుంచి ఫోన్ చేసిన పలువురు.. ఆహారభద్రత కార్డుల మంజూరులో కింది స్థాయి అధికారులు పట్టించుకోవడంలేదని జేసీ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం జేసీ మాట్లాడుతూ ఆహారభద్రత కార్డులు రాలేదని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదని, అర్హత ఉంటే తప్పనిసరిగా ఇస్తామన్నారు. జాబితాలో పేరు వచ్చిన వారికి రేషన్ సరుకులు అందిస్తున్నట్లు తెలిపారు. మండల స్థాయి అధికారులు, సిబ్బంది ఎలాంటి అవాంతరాలు కలుగజేయకుండా దరఖాస్తులను పరిశీలించి అర్హులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనర్హులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారభద్రత కార్డులు ఇవ్వదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్నారు.