2 ఎకరాల నుంచి రూ.2 లక్షల కోట్లా? | Mudragada Padmanabham fires on CM Chandrababu | Sakshi
Sakshi News home page

2 ఎకరాల నుంచి రూ.2 లక్షల కోట్లా?

Published Mon, Feb 8 2016 1:59 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

2 ఎకరాల నుంచి రూ.2 లక్షల కోట్లా? - Sakshi

2 ఎకరాల నుంచి రూ.2 లక్షల కోట్లా?

♦ ఎలా ఎదిగారో చంద్రబాబు చెప్పాలి: ముద్రగడ పద్మనాభం
♦ మీరు ఆ కిటుకేదో చెబితే మా జాతి కూడా అలాగే అభివృద్ధి చెందుతుంది
♦ అప్పుడు ఏటా రూ.వేయి కోట్లూ అడగం
♦ సీఎం మొండి అయితే.. నేను జగమొండిని
♦ ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపేందుకే  వైద్య పరీక్షల పేరిట సర్కారు హడావుడి
♦ అవేవో బాబుకు చేయిస్తే ఎన్నికల హామీలు గుర్తుకొస్తాయన్న ముద్రగడ
 
 కిర్లంపూడి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి / సాక్షి  ప్రతినిధి, కాకినాడ: ‘సీఎం గారూ... మీరు రెండెకరాల రైతు స్థాయి నుంచి రూ.2 లక్షల కోట్ల రాజకీయ నేతగా ఎలా ఎదిగారో చెప్పండి..’ అని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. ‘చంద్రబాబు తన ఎదుగుదల గురించి పత్రికాముఖంగా చెప్పాలి. ఆయన ఆ కిటుకేదో పదిమందికీ చెబితే, మా జాతి కూడా ఆ విధంగా అభివృద్ధి చెందుతుంది. అప్పుడు ఏటా బడ్జెట్‌లో కేటాయించాల్సిందిగా కోరుతున్న రూ.1,000 కోట్లు కూడా అడగం..’ అని ముద్రగడ అన్నారు.

ఎన్నికల సమయంలో చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎంతమంది పోలీసులను దించినా దీక్షను విరమించేది లేదని తేల్చిచెప్పారు. కాపులకు రిజర్వేషన్లు, కాపు కమిషన్‌కు నిధులు, కాపు నేతలపై కేసుల ఎత్తివేత తదితర డిమాండ్లతో సతీసమేతంగా తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష ఆదివారానికి మూడోరోజుకు చేరింది. ఉదయం 9 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం మొండి అయితే తాను జగమొండినన్నారు. జైల్లో పెట్టినా, సెలైన్ కట్టినా దీక్షను విరమించే ప్రశ్నే లేదన్నారు. ‘నీరసించి, కృశించి పోయి నేను దీక్షను ఆపుతానన్న భావన ప్రభుత్వంలో కనబడుతోంది.

అది ఎన్నటికీ జరగదు. సీఎం ఇచ్చిన హామీలన్నింటిపైనా సానుకూలంగా స్పందించాలి...’ అని ముద్రగడ స్పష్టం చేశారు. తమ ఆరోగ్యం బాగానే ఉందనీ, ప్రజానీకంలో తప్పుడు సంకేతాలు పంపేందుకే ప్రభుత్వం వైద్య పరీక్షల పేరిట హడావుడి చేస్తోందని విమర్శించారు. దీక్షలో ఉన్న తమ ఆరోగ్యం పాడవుతోందంటూ తప్పుడు బులెటిన్లు చెప్పించి తమను అభాసుపాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ‘పంజాబ్, గుజరాత్ లలో ఒక సిక్కు వ్యక్తి 66 నుంచి 70 రోజుల వరకు దీక్ష చేసినట్లు విన్నా. పొట్టి శ్రీరాములు కూడా చాలా రోజులు దీక్ష చేశారు. అలాగే మేము కూడా ఆహారం లేకుండా ఉండగలం. దాన్ని చంద్రబాబు మెడికల్ హిస్టరీలో రాయించవచ్చు..’ అని వ్యాఖ్యానించారు. వైద్య పరీక్షల పేరిట అంబులెన్సు తెచ్చి ప్రతిసారీ హడావుడి చేయొద్దని, పదేపదే డిస్టర్బ్ చేయొద్దని కోరారు. వైద్య పరీక్షల కోసం వచ్చిన వైద్యులను వెనక్కి వెళ్లిపోవాలని కోరారు.
 
 బాబుకు వైద్య పరీక్షలు చేయించండి
 ‘నేను, నా శ్రీమతి ఇద్దరం బాగానే ఉన్నాం. మా ఆరోగ్యం బాగుంది. వైద్య పరీక్షలు అస్సలు వద్దు..’ అని ముద్రగడ తేల్చి చెప్పారు. వైద్యపరీక్షలకు అనుమతించాలని కోరిన జాయింట్ కలెక్టర్ సత్యనారాయణతో ఆయన పది నిమిషాల పాటు మాట్లాడారు. ‘మాకు చేయాలనుకుంటున్న వైద్య పరీక్షలేవో ముఖ్యమంత్రికి చేయించండి. ఆయన ఆరోగ్యం బాగుంటుంది. అప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి. అప్పుడన్నా ఆయనకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు గుర్తుకొస్తాయి. ఇదేదో వ్యంగ్యం కాదు. నిజంగానే చెబుతున్నాను. దయచేసి ముందు ఆ పని చేయించండి’ అని అధికారులను ముద్రగడ ప్రాధేయపడ్డారు.

ఒక సామాజిక ప్రయోజనం కోసం ఉద్యమం ప్రారంభించినప్పుడే తాను చావు గురించిన భయం వదిలేశానన్నారు. తన భార్యకు కూడా అలాంటి భయమేమీ లేదన్నారు. తన జాతి ప్రయోజనం కోసం అంకితం కావాలనుకున్న తనకు మరణం పెద్దలెక్క కాదన్నారు. విద్యా, ఉద్యోగ అవకాశాలను పొందలేక భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉన్న తమ జాతి బిడ్డల కోసం ఈ ఉద్యమం చేస్తున్నానని పునరుద్ఘాటించారు. చంద్రబాబు ఈ ఉద్యమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించే బదులు... రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్ల రూపాయల ఆస్తి సంపాదించిన కిటుకేదో చెబితే తమ జాతి కూడా ఆ విధంగా వృద్ధి చెందుతుందని ముద్రగడ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement