రాంనగర్:కిరోసిన్ పంపిణీలో అక్రమాలకు, అవకతవకలకు పాల్పడే డీలర్లపై కేసులు నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. జేసీ శనివారం తన చాంబర్‌లో జిల్లాలోని 21 మంది హోల్‌సేల్ కిరోసిన్ డీలర్లతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు చెందిన కిరోసిన్ ట్యాంకర్ పక్కదారి పట్టించి హైదరాబాద్‌లో దొరకడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలోని కిరోసిన్ డీలర్లు ప్రభుత్వానికి బకాయిపడిన ఒక కోటి రూపాయల ప్రైస్ ఈక్వలేషన్ ఫండ్ ఈనెల 16, 17 తేదీలోగా చెల్లించాలన్నారు. లేనిచో సీరియస్‌గా పరిగణించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతినెలా 20వ తేదీలోగా కిరోసిన్ లిప్టుచేసి పంపిణీకి చర్యలు తీసుకోవాలని, లిప్టింగ్, పంపిణీలో అలసత్వం చూపితే లెసైన్స్ రద్దుచేస్తామని హెచ్చరించారు.
ప్రతి కిరోసిన్ ట్యాంకర్ వివరాలు పరిధిలోని తహసీల్దార్, డీటీ, డీఎస్‌ఓలకు తెలియజేయాలని, రూట్ ఆఫీసర్ సమక్షంలో పంపిణీ జరగాలని కోరారు. అనంతరం రబీ ధాన్యం కొనుగోలుపై పౌరసరఫరాలు మార్కెటింగ్, ఐకేపీ అధికారులతో సమీక్షించారు. ధాన్యం విక్రయించే రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ పూర్తిచేసినందున రైతుల ఖాతాకు జమచేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకుల ద్వారా చెల్లింపుకై చర్యలు తీసుకుంటామన్నారు. మోత్కూరు, చౌ టుప్పల్, చిట్యాల ఏరియాలో ధాన్యం కొనుగోలు లేనందున కొనుగోలుకు ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. రైతులను అసౌకర్యానికి గురిచేయకుండా ధాన్యం కొనుగోలుకు అన్ని ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్‌ఓ నాగేశ్వర్‌రావు, ఏఎస్‌ఓ వెంకటేశ్వర్లు, డీఎంసీఎస్ వరకుమార్, డీఆర్‌డీఏ పీడీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు
Published Sat, Mar 14 2015 11:55 PM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
Advertisement
Advertisement