అఫిడవిట్ దాఖలుకు సమయం కావాలి: కొత్తపల్లి గీత
కాకినాడ: కులం విషయంలో నిజాన్ని నిర్థారణ చేసే బాధ్యత తనపై ఉందని అరకు ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. ఎంపీ గీత ఎస్టీ కాదని, అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ ట్రైబల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే.
కోర్టు ఆదేశాల మేరకు కేసు ఆమె తన న్యాయవాదితో కలిసి శనివారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..కుల నిరూపణకు సంబంధించిన ఆధారాలను కమిటీకి ఇచ్చినట్లు తెలిపారు. అయితే అఫిడవిట్ దాఖలు చేయాలని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ ఆమెను ఆదేశించగా అందుకు తనకు కొంత సమయం కావాలని కోరినట్టు చెప్పారు.
కొత్తపల్లి గీత తండ్రి గ్లాడియ జాకబ్ కుల నిర్ధారణలో భాగంగా శనివారం వై.రామవరం బస్టాండ్ ఆవరణలోని రామాలయం వద్ద తహశీల్దార్ ఎండీ యూసఫ్ జిలానీ బహిరంగ విచారణ నిర్వహించారు. వై.రామవరం మండలంలో కొత్తపల్లి ఇంటిపేరుగల వారెవరూ లేరని, గ్లాడియా జాకబ్‌కు రక్త సంబంధ బంధువులు కూడా ఎవరూ లేరని గ్రామ పెద్దలు తహశీల్దార్‌కు తెలియజేశారు.