ఇంగ్లిష్ చదివితే మతం మారతారా!
పేద, దిగువ కులాలకు చెందిన పిల్లలు ఇంగ్లిష్ నేర్చుకోవడాన్ని ఇష్టపడని శక్తుల ద్వారా ఓ కొత్త సిద్ధాంతం వ్యాప్తిలోకి వచ్చింది. ప్రైవేట్ ఇంగ్లిష్ విద్య చదివిన పిల్లలతో గ్రామీణ విద్యార్థులు పోటీపడకూడదని వీరు భావిస్తున్నారు. వీరు ఒక రాజకీయ పార్టీ లేక ఒక రాజకీయ సిద్ధాంతానికి చెందినవారు కారు. మితవాద పార్టీల సంస్థల నుంచి మీడియా పరిశ్రమాధిపతుల నుంచి, వామపక్ష భావజాలానికి చెందిన విద్యావేత్తల వరకు అన్నిరంగాల్లో ఈ శక్తులు పాతుకుపోయాయి.
ఈ కొత్త సిద్ధాంతం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఏమిటా సిద్ధాంతం? ఇంగ్లిష్ చది విన వారందరూ క్రైస్తవులు అయిపోయారట. ఇది షాక్ కలిగించడం లేదూ? ఇది నిజమే అయితే, అమరావతిలో తిష్ట వేసిన సంపన్నులు, బంజారాహిల్స్ బంగ్లాల్లో నివసిస్తున్నవారు, జూబ్లీహిల్స్ భవనాల్లో ఉంటున్నవారు క్రైస్తవులుగా మారిపోయి ఉండాలి మరి. ఇది నిజమే అయినట్లయితే, గ్రేటర్ కైలాస్ ఖాన్ మార్కెట్ (న్యూఢిల్లీ) ప్రాంతంలోని భారతీయ మేధావులు, వాణిజ్యవేత్తలు, మెరీన్ డ్రైవ్ క్వీన్స్ నెక్లెస్ బీచ్ (ముంబై) ఆకాశ హర్మ్యాలలో నివసిస్తున్నవారు, చెన్నైలోని అయ్యర్, అయ్యంగార్లు నివసించే కాలనీలు ఇప్పటికే క్రైస్తవులతో నిండిపోయి ఉండాలి.
వీళ్లంతా ఒక చేతిలో బైబిల్, నుదుటి మీద క్రాస్ని కలిగి ఉండాలి మరి. ఇకపోతే ఇంగ్లిష్‌లో వలసవాదాన్ని పసిగడుతున్న మన ఉదారవాద, వామపక్ష కామ్రేడ్లు కూడా ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో చదివి ఉండటమే కాకుండా తమ తమ పార్టీల సెంట్రల్ కమిటీ, పొలిట్ బ్యూరో సమావేశాలను కూడా ఇంగ్లిష్‌లోనే నిర్వహిస్తున్నారు. మరి వీరు కూడా సుత్తి కొడవలికి బదులుగా తమ ఎన్నికల చిహ్నాలుగా క్రాస్‌నే కలిగి ఉండాలి కదా.
మనం తినే ఆహారాన్ని పండిస్తున్న, మన నగరాలకు తిండి పెడుతున్న గ్రామీణులకు విద్యలో సమానత్వం అందుబాటులోకి వచ్చినప్పుడు, పట్టణ ప్రాంతాల్లోని సంపన్నులు సౌకర్యవంతమైన జీవితం ఎలా గడుపుతున్నారో వారు చూడగలిగినప్పుడు ఎలా ఉంటుందో చూడాల్సిందే. భారతీయ విద్యావంతులు క్రైస్తవులుగా మారిపోయారనే విషం చిమ్ముతున్న మితవాద కపటవేషధారులను సులభంగానే అర్థం చేసుకోవచ్చు. కానీ వామపక్షానికి చెందిన అగ్రకులాలు, వారి అనుయాయులు కూడా సూపర్ మితవాదులుగా వ్యవహరిస్తున్నారు. కారల్ మార్క్స్ వీరిని చూసి జాలిపడి ఉండేవారు, వారి ఉప తెలుగు జాతీయవాదపు అత్యంత చెత్త భావాలను చూసి ఆయన నిజంగానే చింతించేవారు.
ఇప్పుడు ఆ మార్క్స్ కూడా వారిని కాపాడలేడు. దేవుడు మాత్రమే వీరిని కాపాడాల్సి ఉంది. మహాత్మాగాంధీ నుంచి జవహర్లాల్, ఇందిరాగాంధీ దాకా, జ్యోతిబసు నుంచి నంబూద్రిపాద్, ఇంద్రజిత్ గుప్తా, సీతారాం ఏచూరి, ప్రకాష్ కారత్, బృందా కారత్ వరకు అందరూ ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే చదువుకున్నారు. వీరు మాత్రమే కాకుండా మతఛాందసవాద పక్షానికి చెందిన లాల్ కృష్ణ అడ్వాణీ నుంచి అరుణ్ శౌరీ, అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్ నుంచి మోదీ ఆధునిక మార్కెట్ పరిశ్రమలో పనిచేస్తున్న అనేకమంది మేధావులు కూడా ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నవారే.. పైగా వీరిలో చాలామంది క్రిస్టియానిటీ వ్యతిరేకులే.
మతఛాందసవాద పక్ష హీరో అయిన వీర్ సావర్కర్ పుణేలోని ఫెర్గూసన్ కాలేజీలో అధ్యయనం చేశారు. ఇక్కడే గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర్ తిలక్ కూడా చదువుకున్నారు. బాంబే ప్రావి న్స్‌లోని అత్యుత్తమ ఇంగ్లిష్ మీడియం కాలేజీల్లో ఫెర్గూసన్ కాలేజీ ఒకటని గుర్తుంచుకోవాలి. శ్యామాప్రసాద్ ముఖర్జీ కూడా ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదువుకున్నారు. తర్వాత కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో ఇంగ్లిష్‌ను ప్రధాన భాషగా ఎంచుకున్నారు. ఆ ప్రాంతంలోనే అత్యుత్తమ ఇంగ్లిష్ కాలేజీల్లో అదొకటి. ఇంగ్లిష్ మీడియం విద్య నిజంగానే హిందూయిజంలోని వ్యక్తులను క్రిస్టియానిటీలోకి మార్చేటట్లయితే, పైన పేర్కొన్న వ్యక్తుల్లో చాలామంది పాస్టర్లు, బిషప్పుల్లా అయి ఉండేవారు. కానీ వీరందరూ ఎవరో మనకు బాగానే తెలుసు.
వీరిలో ఇప్పటికే చనిపోయినవారి మృతదేహాలను వారి సమాధులలో శిలువ చిహ్నం ఉంచి పూడ్చిపెట్టలేదు. తగిన హిందూ సంప్రదాయాలతో, వారి పార్థివ దేహాలను దహనం చేశారు. మరి ఏపీలో పైన పేర్కొన్న ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో చదువుకున్న హిందూ నేతలను అనుసరిస్తున్న ఈ నాయకులంతా ప్రైవేట్ కాన్వెంట్ స్కూల్ ఇంగ్లిష్ విద్యను చదువుకోలేని పేదపిల్లలు ఇప్పుడు క్రిస్టియన్లుగా మారిపోతారని ఎందుకు భావిస్తున్నారు? వీరు ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం స్కూల్స్‌లో చదివినంతమాత్రానే మతం ఎందుకు మారి పోతారో ఈ నేతలే జవాబు చెప్పాలి. ఇలాంటి వాదన ఎక్కడి నుంచి వస్తోంది? సమానత్వం అనే ప్రగాఢమైన భయం నుంచే ఈ వాదనలు పుట్టుకొస్తున్నాయి. బీజేపీ, టీడీపీ నేతలు భయపడితే అర్థం చేసుకోవచ్చు కానీ కమ్యూనిస్టులకు ఎందుకీ భయం?
ఈ భయానికి అసలైన కారణం బోధనా మాధ్యమంలో, సిలబస్ కంటెంటులో, విద్యా వాతావరణంలో సమానత్వాన్ని తీసుకురావడమే. విద్యాపరంగా సమానత్వం తీసుకువస్తే.. పేదలు సంపన్నులను సవాలు చేయగలరని, దిగువ కులాలు ఎగువ కులాలను సవాలు చేయగలవని ఇలాంటి వారంతా భయపడిపోతున్నారు. సమానత్వం కోసం పోరాటంలో మానవ చరిత్ర చాలా రక్తం ధారపోసింది. అది దేవుడి ముందు సమానత్వం కోసం పోరాడింది. ఆ యుద్ధంలో సగం విజయాన్ని మాత్రమే సాధించింది. అది భూమిపై సమాన హక్కుల కోసం పోరాడింది. ఈ రంగంలో కూడా మానవ చరిత్ర సగం విజయాన్ని మాత్రమే సాధించింది.
భారతదేశంలోనూ భూమి కోసం పోరాటంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాల దాకా అనేకమంది భూ సమస్యపైనే పోరాడి ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ఇప్పటికీ ఆ సమానత్వం రాలేదు. ఉదారవాద పెట్టుబడిదారీ విధానం కంప్యూటర్ని, ఇంటర్నెట్ విప్లవాన్ని తీసుకొస్తుందని కమ్యూనిస్టు సిద్ధాంతం ఎన్నడూ ఊహించలేదు. కానీ అంతర్జాతీయతత్వాన్ని విశ్వసించే వామపక్షవాదులు ఇంతగా ఎలా పతనమయ్యారు? మన దేశ వామపక్షాలు సృజనాత్మకతను మొత్తంగా కోల్పోయి సులభంగా ఆకర్షించే కపటత్వంలోకి ఎలా వెళ్లిపోయాయి?
రక్తాన్ని చిందించడం ద్వారా కంప్యూటర్, ఇంటర్నెట్ విప్లవాలను ఎవరూ తీసుకురాలేదు. మంచి పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచే వీటిని సాధించారు. ప్రత్యేకించి తెలుగు, తమిళం, హిందీ ద్వారా కాకుండా ఇంగ్లిష్ భాషలో విద్య ద్వారానే ఈ విప్లవాలను తీసుకొచ్చారు. ఏ భాష అయినా కొత్త విషయాలను కనిపెట్టే శక్తిసామర్థ్యాలను కలిగి ఉండాలి. హిందుత్వ శక్తులు నూతన విప్లవాల చరిత్రను అర్థం చేసుకుంటారని ఎవరూ ఊహించరు కానీ ప్రపంచ కార్మికులారా ఏకంకండి అనే సూత్రాన్ని విశ్వసించే కమ్యూనిస్టులు చరిత్రను అర్థం చేసుకుంటారని అందరూ భావిస్తారు. కానీ కార్మికుల మధ్య భావ వ్యక్తీకరణ సాధనంగా ఒక ఉమ్మడి ప్రపంచ భాష లేకుండా వారు కార్మికులను ఎలా ఐక్యపర్చగలరు?
బోధనా మాధ్యమం, సిలబస్ కంటెంట్, పాఠశాల మౌలిక వసతి వంటి అంశాలపరంగా విద్యాపరమైన సమానత్వం గురించి ఇతర రాజకీయనేతలు ఆలోచించకముందే కమ్యూనిస్టులు దానిగురించి ఆలోచించి ఉండాలి. కానీ కమ్యూనిస్టులు సరిగ్గా దానికి వ్యతిరేకంగా వ్యవహరించారు. రెండు విభిన్న మాధ్యమాల ఉనికి గురించి ప్రశ్నించకుండానే వారు తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చేర్పించారు. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే, తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం కార్మిక వర్గం, దిగువ కులాలు, పేద తరగతులకు చెందిన పిల్లలను ప్రాంతీయ భాషలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్బంధంగా చేర్పించారు. ఇదే రకమైన పాఠశాల విద్యా వ్యవస్థతో వారు పశ్చిమబెంగాల్‌ను ధ్వంసం చేశారు.
ఇప్పుడు వీరు ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామాల్లో ఇంగ్లిష్ విద్య ప్రవేశ పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం, పాఠశాలకు పిల్లలను పంపిన ప్రతి తల్లి ఖాతాకు అమ్మ ఒడి పేరుతో రూ. 15,000 అందించడం అనేవి రక్తరహిత విప్లవాన్ని తీసుకొస్తాయి. ప్రతి గ్రామంలోనూ ఉంటున్న యువత ఇంగ్లిష్ విద్యా పరిరక్షణ దళాలను నిర్వహించాలి. తమ పిల్ల లకు ఇంగ్లిష్ విద్యను వ్యతిరేకిస్తున్న వారిపై పోరాడేందుకు తల్లులందరూ అమ్మ హక్కుల బృందాలను ఏర్పర్చాలి. గ్రామాల్లోని మన ఇళ్ల ముందుకు వచ్చిన ఈ అపూర్వ అవకాశాన్ని కోల్పోవడాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు.
ప్రొ.కంచ ఐలయ్య
వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్
సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ