
లండన్‌లో అమరావతి ఆఫీస్
లండన్ నగరంలో అమరావతి కార్యాలయం శనివారం నుంచి పనిచేయనుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
* రెండో రోజు నగరంలో పర్యటించిన చంద్రబాబు బృందం
* బ్రిటిష్ మ్యూజియంలోని అమరావతి పెవిలియన్ సందర్శన
* వివిధ సంస్థలు, పెట్టుబడిదారులతో సమావేశం
సాక్షి, హైదరాబాద్: లండన్ నగరంలో అమరావతి కార్యాలయం శనివారం నుంచి పనిచేయనుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి మండలి ద్వారా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు సీఎం ప్రకటించారని శనివారం ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం హైదరాబాద్‌లో వెల్లడించింది. బ్రిటన్‌కు చెందిన సంస్థలు, పెట్టుబడిదారులు అమరావతితో పాటు, ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశంపై మండలి కార్యనిర్వాహణాధికారి జె.కృష్ణకిషోర్ సమన్వయం చేస్తారు.
కాగా, రెండో రోజు తన లండన్ పర్యటనలో చంద్రబాబు స్థానిక పార్లమెంటు సభ్యుడు బిల్లీ మోరియా, స్థానిక పెట్టుబడిదారులు, ఆరోగ్య రంగ నిపుణులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉన్న వనరులు, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు, పెట్టుబడులకు గల అవకాశాలను ఆయన వివరించారు. లండన్‌లో భారత హై కమిషనర్ అజయ్ జైన్, పార్లమెంటు సభ్యుడు అలోక్ శర్మ, యూకే డిప్యూటీ కమిషనర్ ఆండ్రూ, యుకేఐబీసీ సీఈవో రిచర్డ్ తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. అనంతరం స్థానికంగా ఉన్న బ్రిటిష్ మ్యూజియంలోని 33ఏ గదిలో ఉన్న అమరావతి పెవిలియన్‌ను చంద్రబాబు సందర్శించారు.
అమరావతి చరిత్ర, ఇతర వస్తువులను ఆయన పరిశీలించారు. మ్యూజియంలోని వస్తువులు అక్కడికి ఎలా చేరుకున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత క్లైమెట్ బాండ్స్ ఇనిషియేటివ్(సీబీఐ) ముఖ్య కార్యనిర్వహణాధికారి, సహ వ్యవస్థాపకుడు సీన్ కిడ్నేతో చంద్రబాబు సమావేశమయ్యారు. వాతావరణ కాలుష్య పరిష్కారాలకు పెట్టుబడులు సమీకరిస్తున్న అంతర్జాతీయ స్వచ్చంద సంస్థగా సీబీఐకి పేరుంది. లండన్ పర్యటన ముగించుకుని చంద్రబాబు బృందం ఆదివారం ఉదయం ఢిల్లీ చేరుకోనుంది. రాత్రికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు పండిట్ రవిశంకర్ నిర్వహిస్తున్న సాంస్కృతిక ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు.
బిజినెస్ సిటీ ప్రతినిధులతో చర్చలు ఫలప్రదం: సీఎం
క్యానరీవార్ఫ్‌లోని బిజినెస్ సిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ సమావేశాలు ఫలప్రదమయ్యాయని, అమరావతిలో పెట్టుబడులు పెట్టి, అభివృదికి సహకరించేందుకు ఆయా సంస్థలు ఆసక్తి కనబరిచినట్లు తెలిపారు. లండన్‌లో ఉన్న ప్రవాసులు కూడా రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తామని తెలిపారన్నారు. దాదాపు 600 మంది ఏపీ ప్రవాసులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం పేర్కొంది.