చివర్లో సిక్కోలు!
జిల్లాను అభివృద్ధి చేసేస్తున్నారంటూ మంత్రి అచ్చెన్నాయుడుకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ర్యాంకు 7. కానీ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీడీడీజీ) ప్రకారం ప్రభుత్వం జిల్లాకు ఇచ్చిన ర్యాంకులు అన్నీ అట్టడుగునే ఉన్నాయి. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో సిక్కోలే చివరి స్థానంలో ఉండటం జరిగిన అభివృద్ధి ఏమిటో కళ్లకు కడుతోంది. ఒక్క సేవా రంగంలోనే పొరుగునున్న విజయనగరం జిల్లా కన్నా కాస్త మెరుగనిపించి అడుగు నుంచి రెండో స్థానంలో సిక్కోలు నిలిచింది.
ఇక జిల్లా ఆర్థిక పరిస్థితిని చాటిచెప్పే తలసరి ఆదాయం విషయంలోనూ చివరి స్థానమే దక్కింది. టీడీపీ ప్రభుత్వం జిల్లా మంత్రికి, ఎమ్మెల్యేలకు ఇస్తున్న ర్యాంకులకు, ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన గణాంకాల ప్రకారం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధికి సంబంధం లేకపోవడంతో గందరగోళానికి దారితీస్తోంది.
* అభివృద్ధిలో మంత్రి అచ్చెన్నకు ఏడో ర్యాంకు!
* ప్రభుత్వ గణాంకాలతో గందరగోళం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రెండేళ్ల కాలంలో ఏడుసార్లు జిల్లాలో పర్యటించారు. వచ్చినప్పుడల్లా జిల్లాను అభివృద్ధిలో అగ్రస్థానానికి తీసుకెళ్తానని పలు హామీలు గుప్పించారు. ఇప్పటివరకూ జిల్లాలో ఒక్క పరిశ్రమ కూడా కొత్తగా ఏర్పాటు కాలేదు. వ్యవసాయాధారిత జిల్లాగా గుర్తింపు ఉందని, ఆ రంగంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పినా ఆ దిశగా అడుగులు పడలేదు.
పర్యాటకపరంగానూ జిల్లాకు పలు ప్రాజెక్టులు ప్రకటించినప్పటికీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. వాస్తవానికి జిల్లా స్థూల ఉత్పత్తిలో మెరుగవ్వాలంటే మంత్రులకు ర్యాంకులు ఇవ్వడం గాకుండా వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో జిల్లా వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని హామీలు నెరవేర్చాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో సీఎం ప్రకటించిన గణాంకాల ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
స్థూల ఉత్పత్తి
గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ. 6,03,376 కోట్లు ఉంది. దీనిలో రూ.72,219 కోట్ల భాగస్వామ్యంతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, రూ.22,707 కోట్లతో సిక్కోలు చివరి స్థానంతో సరిపెట్టుకుంది. కృష్ణా జీడీడీపీతో పోల్చితే జిల్లా భాగస్వామ్యం మూడో వంతు కూడా లేకపోవడం గమనార్హం. పొరుగునున్న విజయనగరం జిల్లా రూ.22,924 కోట్లతో 12వ ర్యాంకు దక్కించుకొని శ్రీకాకుళం కన్నా మెరుగనిపించింది.
తలసరి ఆదాయం...
ఒక వ్యక్తి ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి తలసరి ఆదాయమే ప్రధాన సూచిక. ఈ విషయంలోనూ సిక్కోలు చివరి స్థానానికే పరిమితమైంది. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,07,532 ఉంటే జిల్లాది రూ.74,638 ఉంది. ఉత్తరాంధ్రలోనే ఒకటైన విశాఖ జిల్లా రూ.1,40,628తో ప్రథమ స్థానం దక్కించుకుంది. ఈలెక్కన ఒక విశాఖ వాసి సగటు ఆదాయంలో సిక్కోలు జిల్లా నివాసి ఆదాయం సగం మాత్రమే. విజయనగరం కూడా రూ.86,223 తలసరి ఆదాయం పొంది 12వ ర్యాంకుతో జిల్లా కన్నా మెరుగనిపించింది.
వ్యవసాయ రంగం
రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా రూ.1,64,086 కోట్లు ఉండగా దానిలో రూ.22,697 కోట్ల భాగస్వామ్యంతో పశ్చిమ గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. శ్రీకాకుళం మాత్రం కేవలం రూ.5,015 కోట్లతో చివరి స్థానానికి పరిమితమైంది. పశ్చిమ గోదావరి జిల్లాతో పోల్చితే ఈ రంగంలో సిక్కోలు వాటా నాలుగో వంతు కూడా లేదు. విజయనగరం జిల్లా రూ.5,894 కోట్లతో 12వ స్థానంతో జిల్లా కన్నా మెరుగ్గా ఉంది.
పారిశ్రామిక రంగం
అన్ని వనరులున్న శ్రీకాకుళం జిల్లాను పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చేస్తామని రెండేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే హామీలు ఇచ్చినా ఆచరణలో కానరావట్లేదు. ఈ ప్రభావం జిల్లా జీడీపీపై స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర జీడీడీజీలో పారిశ్రామిక రంగం వాటా రూ.1,31,643 కోట్లు కాగా దానిలో రూ.24,532 కోట్లతో విశాఖ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ రంగంలో కూడా రూ.4,400 కోట్లతో సిక్కోలుకు చివరి స్థానమే దక్కింది. విశాఖతో పోల్చితే ఆరో వంతు కూడా లేకపోవడం గమనార్హం. విజయనగరం రూ.4,493 కోట్లతో కాస్త మెరుగైన స్థానంలో ఉంది.
సేవా రంగం
రాష్ట్ర జీడీడీపీలో సేవారంగం వాటా రూ.2,61,917 కోట్లు కాగా, దానిలో రూ.32,593 కోట్లతో విశాఖ జిల్లా ప్రథమ స్థానం దక్కించుకుంది. సిక్కోలు మాత్రం రూ.11,571 కోట్లతో 12వ స్థానంలో నిలిచింది. ఈ విషయంలో మాత్రం విజయనగరం (రూ.10,800)ను వెనక్కు నెట్టగలిగింది. విశాఖ జిల్లాతో పోల్చితే సిక్కోలుది మూడో వంతు ఉంది.