ప్రజల తిరుగుబాటు తప్పదు | “revolt” against TDP government | Sakshi
Sakshi News home page

ప్రజల తిరుగుబాటు తప్పదు

Published Tue, Jun 2 2015 1:01 AM | Last Updated on Wed, Aug 29 2018 7:50 PM

“revolt” against TDP government

 నరసన్నపేట : అధికారం చేతిలో ఉందికదా అని టీడీపీ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని.. త్వరలోనే ఆ పార్టీపై ప్రజల తిరుగుబాటు తప్పదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీసెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ఒక్క హామీ కూడా సజావుగా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు వరకూ ఇంకా కింది స్థాయి కార్యకర్తలు కూడా తమకు తోచిన విధంగా దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు.
 
  ఇకనైనా సిగ్గు తెచ్చుకొని ప్రజాస్వామ్యపద్ధతిలో పాలన చేయమని హితవు పలికారు. ప్రస్తుతం రాష్ట్రంలో యథారాజ.. తథా ప్రజ అన్నచందంగా పాలన సాగుతోందనీ, పచ్చచొక్కాలవారంతా దొరికిన కాడికి దోచుకుంటున్నారని విమర్శించారు. అందుకు తన నియోజకవర్గంలోని జలుమూరు మండలం పర్లాం ఇసుక ర్యాంపే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇక్కడ టీడీపీ నాయకులు దందాలు చేస్తున్నారని, ఇసుకను అడ్డుగోలుగా తరలిస్తున్నారని అన్నారు. మహిళల పేరున వీరు రూ. లక్షలు గడిస్తున్నారని అన్నారు. వంశధార పనుల్లో తీవ్రంగా అవినీతి చోటు చేసుకుంటోందన్నారు. నరసన్నపేట సబ్ డివిజన్ పరిధిలో నిర్వహిస్తున్న వంశధార పనులను పరిశీలిస్తే ఎవరికైనా ఈ విషయం స్పష్టమవుతుందని పేర్కొన్నారు.
 
 పనివిలువ కంటే అధికంగా ప్రతిపాదనలు తయారు చేసి ప్రజా ధనాన్ని టీడీపీ నేతలు లూటీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమకు అనుకూలురైన టీడీపీ కార్యకర్తలకు పనులు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టి వారి ఆర్థికపరిపుష్టికి దోహదపడుతున్నారని మండిపడ్డారు. ఉపాధి పనుల్లోనూ టీడీపీకి చెందిన నాయకులు తమకు నచ్చిన పేర్లు పెట్టుకొని డబ్బు కాజేస్తున్నారని అన్నారు. జలుమూరు మండలం తిమడాం టీడీపీ నాయకుడు వెలమల చంద్రభూషణం తన కుమారుడిపేరుతో జాబుకార్డు తెచ్చుకుని డబ్బు కాజేస్తున్నారని ఉదాహరణతో సహా తెలియజేశారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు ఆరంగి మురళీధర్, ధర్మాన వెంకటరమణ, ఈశ్వరరావు, యాళ్ల బైరాగినాయుడు, మొజ్జాగ శ్యామ్ తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement